సిటీకి ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు : సజ్జనార్

సిటీకి ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు : సజ్జనార్
  • ఈ నెలాఖరు కల్లా 25 బస్సులు అందుబాటులోకి 

హైదరాబాద్, వెలుగు: ఈనెలాఖరు కల్లా 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు సిటీ రోడ్లపైకి వస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. ఇప్పటికే విజయవాడ రూట్​లో సేవలు అందిస్తున్నామని వివరించారు. ఈనెలాఖరుకల్లా ఎయిర్​పోర్ట్ రూట్​లో, ఐటీ కారిడార్ ఏరియాల్లో ఈ బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. సోమ వారం బస్​భవన్​లో బస్సులను పరిశీలించిన ఆయన.. ఒలెక్ట్రా కంపెనీ ప్రతినిధులకు పలు మార్పులు సూచించారు. 

వీలైనంత త్వరగా బస్సులు అందజేయాలని కోరారు. ఒలెక్ట్రా గ్రీన్​టెక్ లిమిటెడ్ (ఓజీఎల్)కు 550 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్డర్ ఇచ్చామన్నారు. అందులో 500 బస్సులు హైదరాబాద్ సిటీలో, 50 బస్సులు విజయవాడ రూట్​లో నడపాలని నిర్ణయించామని తెలిపారు. ఇప్పటికే విజయవాడ మార్గంలో 10 బస్సులు నడుస్తున్నాయన్నారు. హైదరాబాద్​లో తొలి దశలో 50 బస్సులు రాబోతున్నాయని, వాటిలో 20 ఎయిర్​పోర్ట్ రూట్​లో, 30 ఐటీ కారిడార్​లో నడుపుతామని తెలిపారు. 

వాటిలో 25 బస్సులను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాది మార్చ్ నాటికి సిటీలో 500 బస్సులు అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. వీటిలో 50 ఏసీ బస్సులుండగా, మిగిలినవి ఆర్డినరీ, మెట్రో ఎక్స్​ప్రెస్​లు అని తెలిపారు. ఈ బస్సులు ఒక్కసారి చార్జింగ్ చేస్తే 225 కిలో మీటర్ల దూరం వరకు ప్రయాణించొచ్చని వివరించారు.