డేంజర్ బెల్స్.. సిటీ నీళ్లలో కొత్త బ్యాక్టీరియా

డేంజర్ బెల్స్.. సిటీ నీళ్లలో కొత్త బ్యాక్టీరియా
  • ‘ఎన్​డీఎం’తో లంగ్స్​ ఇన్​ఫెక్షన్​, డయేరియా, అంటువ్యాధులు వచ్చే చాన్స్​
  • ఐఐటీ హైదరాబాద్ 17 చెరువుల్లో చేసిన స్టడీలో వెల్లడి
  • వ్యర్థాలు కలుస్తుండడంతోనే వాటర్​ బాడీస్​ పొల్యూషన్​
  • కాలుష్య నియంత్రణపై దృష్టి పెట్టని ప్రభుత్వం, అధికారులు

హైదరాబాద్, వెలుగు: సిటీ చుట్టూ ఉన్న జల వనరులు కొత్త బ్యాక్టీరియాకు నివాసంగా మారాయి.  ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు చెరువులు, కుంటల్లో నీటి శాంపిల్స్​ తీసుకుని చేసిన స్టడీలో కొత్త రకం బ్యాక్టీరియా ఆనవాళ్లను గుర్తించారు. ఈ బ్యాక్టీరియాతో అంటు వ్యాధులు, లంగ్స్ సంబంధిత వ్యాధులు వస్తున్నాయని తేలింది. చెరువు, కుంటల్లో కలిసే వ్యర్థాలతో  నీరంతా విషంగా మారుతోంది.  పొల్యూషన్​ కూడా పెరుగుతోంది. ఇందుకు ప్రధాన కారణం సీవరేజీ నీళ్లు కలుస్తుండడమేనని స్పష్టమైంది. దీంతో వాటర్ బాడీస్ పొల్యూష్యన్ ఆందోళన కలిగిస్తోంది. 

కాలుష్య తీవ్రతపై స్టడీ చేయగా..
ఐఐటీ హైదరాబాద్​లోని సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ తాటికొండ శశిధర్, రీసెర్చర్​రాజీవ్ రంజన్ తో కలిసి సిటీలోని 17 చెరువుల్లో కొద్ది నెలల కిందట కాలుష్య తీవ్రతపై స్టడీ చేశారు. సిటీ పరిధిలోని వాటర్ బాడీస్​లో  ఎన్​డీఎం( న్యూఢిల్లీ మెటాలో బీటా లాక్టమాస్ ) –1 జన్యువు కలిగిన కొత్త బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. వ్యర్థాలు, సీవరేజీ, సీసం లాంటి భార లోహాలు నీటిలో కలుస్తుండడంతోనే ఈ బ్యాక్టీరియా వృద్ధి చెందుతున్నట్లు గుర్తించారు. అయితే 7  చెరువుల్లో మాత్రం ఎన్డీఎం  ప్రమాద తీవ్రత అధికంగా ఉన్న అవశేషాలు కనిపించాయి. అయితే ఇది వేగంగా వ్యాప్తి చెందుతుండగా సమీప కాలనీల్లోని జనాల ప్రాణాలకు ముప్పుగా మారుతుందని పేర్కొంటూ.. వాటర్ బాడీస్​లోని బ్యాక్టీరియా తీవ్రతపై గతేడాది డిసెంబర్10 న ‘జర్నల్ ఆఫ్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్’లో ప్రచురించారు.

17 చెరువుల్లో శాంపిల్స్​ సేకరించగా..
మంజీరా, సింగూరు, అంబర్‌‌‌‌‌‌‌‌పేట్ ఎస్‌‌‌‌టీపీ, దుర్గం చెరువు, అమీన్‌‌‌‌పూర్, ఉస్మాన్ సాగర్, అల్వాల్, హుస్సేన్‌‌‌‌ సాగర్, మోమీన్‌‌‌‌పేట్, సరూర్‌‌‌‌ నగర్, ఫాక్స్ సాగర్, హిమాయత్ సాగర్, కంది, మీర్ ఆలం, నాగోల్, సఫిల్‌‌‌‌గూడ చెరువుల్లో  కొత్త బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించాయి. ఆయా నీటి వనరుల్లో సేకరించిన శాంపిల్స్​ఆధారంగా పలు సార్లు పరిశోధనలు చేశారు. బ్యాక్టీరియా వ్యాప్తితో పాటు మూడు కేటగిరీలుగా విభజించారు. ఎక్కువగా సీవరేజీ నీళ్లు కలుస్తుండడం, భార లోహాలతోనే ఇది వేగంగా వృద్ధి చెందుతుందని పరిశోధకులు స్పష్టం చేశారు. 

మీరాలం చెరువు ప్రాంతంలో.. 
బ్యాక్టీరియా వ్యాపిస్తున్న తీరును తెలుసుకోగా, మూడు కేటగిరీల్లో  రిస్క్ తీవ్రత ఉందని పేర్కొన్నారు. అధికంగా​ మీరాలం చెరువు పరివాహక ప్రాంతంలో నివసించే ప్రతి 100 మందిలో 77 మందికి బ్యాక్టీరియా వ్యాప్తించి ఉంది.  హై రిస్క్ జాబితాలో సికింద్రాబాద్ లోని ఫాక్స్ సాగర్, హిమాయత్ సాగర్, కంది చెరువు, మంజీరా డ్యాం, మీరాలం ట్యాంక్, నాగోల్, సఫిల్ గూడ, సింగూరు రిజర్వాయర్లు ఉన్నాయి. అంబర్ పేట్ ఎస్టీపీ వద్ద రిస్క్ తీవ్రత చాలా తక్కువగా ఉండగా ఒకరిద్దరిలోనే ఉండొచ్చని గుర్తించారు. ఉస్మాన్ సాగర్, అల్వాల్ లేక్, దుర్గం చెరువు, హుస్సేన్ సాగర్, మోమీన్ పేట్ లేక్, సరూర్ నగర్ చెరువుల్లో వ్యాప్తి సాధారణంగా ఉండగా, 2-50 లోపు మందికి వ్యాపించి ఉంటుందని స్టడీలో స్పష్టం చేశారు. 

తాగునీటి చెరువుల్లోనూ...
ఈ జాబితాలో సిటీకి తాగునీరు అందించే సరస్సులు, రిజర్వాయర్లు ఉండడం  ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా మంజీరా, హిమాయత్ సాగర్, మీరాలం లేక్​లోనూ బ్యాక్టీరియా ఆనవాళ్లు ఉండడమే కాకుండా రిస్క్ తీవ్రత కూడా అధికంగా ఉందని స్పష్టమైంది. ప్రస్తుతానికి హిమాయత్ సాగర్ నుంచి తక్కువగా తాగునీరు సరఫరా అవుతున్నా, వాటర్ బాడీస్ క్యాచ్ మెంట్ ఏరియాల్లోని గ్రౌండ్​ వాటర్​ను కలుషితం చేసే అవకాశం ఉందని గుర్తించారు. ఇక్కడి నీళ్లను తాగితే ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, డయేరియా, ప్రాణాంతకమైన అంటు వ్యాధులు వస్తాయి.   బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతున్నా అధికారులు, పాలకులు మాత్రం పట్టించుకోవడంలేదు. ముఖ్యంగా ప్రజారోగ్యానికి హాని కలిగించే విధానాలను పాటిస్తున్నారు. మరోవైపు రూ.కోట్ల నిధులను వృథా చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. 

ఆ నీటితో ప్రమాదమే..
ఎన్డీఎం –1 బ్యాక్టీరియా  జలవనరుల్లో వృద్ధి చెందడం ఆందోళన కలిగించే అంశమే. ఆ నీళ్లను తాగినా, స్నానం చేసినా, బట్టలు ఉతికినా, చేపలను ఆహారంగా తీసుకున్నా ప్రమాదమే. మనుషుల హెల్త్​పై కూడా ఎఫెక్ట్​ చూపుతుందని ఎన్నో  పరిశోధనల్లో తేలింది. కలుషితమవుతున్న జల వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాలుష్య కారకాల నుంచి తాగునీటి వనరులను పరిరక్షించుకోవాలి.
‑ ప్రొ. తాటికొండ శశిధర్, ఐఐటీ హైదరాబాద్ పరిశోధకులు  

శుద్ధి చేయకపోవడంతోనే కలుషితం
పాలకుల నిర్లక్ష్యం కారణంగా సహజ వనరులు కలుషితమవుతున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు, సీవరేజీ నీళ్లు ఎక్కడికి అక్కడ కలుస్తుండగా, వాటిని శుద్ధి చేయడం లేదు. ఐదేళ్ల క్రితమే చెరువులు, కుంటలు కలుషితమైనట్లు గుర్తించాం. ఎన్నో అధ్యయనాలు, పరిశోధనల ఫలితాలతో తమ వాదనకు బలం చేకూర్చుతున్నది. రసాయనిక వ్యర్థాలను అడ్డుకున్నప్పుడే ప్రయోజనం. అధికారులు గొప్పగా చెప్పుకునే ఎస్టీపీలు కూడా నిరుపయోగంగా మారాయి.  
‑ లుబ్నా సార్వత్, పర్యావరణ వేత్త