
- రెండు నెలల్లో పార్క్ నిర్మాణ పనులు ప్రక్రియ షురూ
- ఎన్టీపీసీ, సింగరేణి అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యం
- ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం
- కంపెనీలు, గోడౌన్లు, ఆఫీసులు ఒకే చోట ఉండేలా ఆఫీసర్ల నిర్ణయం
గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్‌నగర్‌లో ఇండస్ట్రియల్ పార్క్ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకోగా.. అందుకు ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. ఇక్కడి స్థలం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనుకూలంగా లేకపోవడంతో ఆఫీసర్లు పార్క్ఏర్పాటుకు నిర్ణయించారు. పాత ఎయిర్‌పోర్టు భూమితో పాటు చుట్టు పక్కల భూములను కలిపి వంద ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి రెండు నెలల్లో పనులు షురూ కానున్నాయి.
ఎయిర్‌పోర్టుకు అనుకూలంగా లేకపోగా..
బసంత్‌నగర్‌లోని కేశోరామ్ సిమెంట్ ఫ్యాక్టరీని అధినేత బీకే బిర్లా సందర్శించేందుకు1972లోనే ప్రభుత్వ స్థలాన్ని లీజుకు తీసుకుని ఎయిర్ పోర్ట్ నిర్మించుకున్నారు. హైదరాబాద్ నుంచి ఇక్కడికి ‘వాయు దూత్ ఎయిర్ లైన్స్’ పేరుతో 21 సీట్ల సామర్థ్యం కలిగిన చిన్నవిమానాల రాకపోకలు సాగించాయి. ఆ తర్వాత కొంత కాలానికి విమాన సర్వీస్‌లు నిలిచిపోయాయి.2016 లో బసంత్నగర్ఎయిర్పోర్టు నిర్వహణ సాధ్యం కాకపోవడంతో ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పగించారు. అయితే ఇక్కడ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు ఆలోచన చేసినా రన్‌వే ఏరియాలో ఎలక్ట్రిసిటీ హై టెన్షన్ వైర్లతో పాటు కన్నాల గ్రామ పరిధిలోని బోడగుట్ట గుట్టలు అడ్డంకిగా మారాయి. దీంతో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు బసంత్నగర్ఏరియా అనుకూలం కాదనే నిర్ణయానికి కేంద్రప్రభుత్వం వచ్చింది. ఎయిర్ పోర్ట్ నిర్మాణం వెనక్కి తీసుకుంది.
కంపెనీల ఏర్పాటుపై ఆఫీసర్ల అవగాహన
బసంత్ నగర్ ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం తర్వాత వివిధ కంపెనీలకు అనుబంధంగా ప్రభుత్వ శాఖలకు చెందిన అన్నిరకాల ఆఫీస్‌లను ఒకే చోట ఉండేందుకు ఆఫీసర్లు నిర్ణయించారు. ఇందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేశారు. అక్కడ 300 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ, కొన్ని ఎకరాల్లో ప్రజలు పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం100 ఎకరాల స్థలం మాత్రం అందుబాటులో ఉంది. ఇందులోనే వివిధ పరిశ్రమలను నెలకొల్పడానికి ఆలోచన చేశారు. ఇందుకు ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తలతో ప్రోత్సాహించి పరిశ్రమలను ఏర్పాటు చేయించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
స్థానిక సిమెంట్ప్లాంట్ఆధ్వర్యంలో బ్రిక్ఇండస్ట్రీ ఏర్పాటు, బిర్లా కంపెనీతో మరో సిమెంట్పరిశ్రమ నిర్మాణానికి కూడా ఆఫీసర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా.. ధాన్యం నిల్వ చేసేందుకు 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోడౌన్ల నిర్మాణం, ఐదెకరాల స్థలంలో పాలకుర్తి మండల ఎంపీడీవో ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్‌లను నిర్మించనున్నారు. మరో రెండు నెలల్లో ఈ నిర్మాణాలకు సంబంధించిన ప్రక్రియ మొదలు కానుంది.
అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యం
బసంత్నగర్ఎయిర్పోర్టు ఏరియాలో అందుబాటులో ఉన్న స్థలంలో ఇండస్ట్రియల్పార్క్ఏర్పాటుకు ప్రపోజల్స్ సిద్ధం చేశారు. ఈ స్థలంలో ఎన్టీపీసీ, సింగరేణి వంటి పరిశ్రమల్లో మెషినరీలకు సంబంధించిన విడి భాగాలు తయారు చేసే అనుబంధ పరిశ్రమలను(యాక్సిలరీ ఇండస్ట్రీ) ఎక్కువగా ప్రోత్సహిస్తాం. ధాన్యం నిల్వ చేయడానికి ఏసీ గోడౌన్ల నిర్మాణం చేపడతాం. ప్రభుత్వ ఆఫీస్‌లన్నీ ఒకే చోట ఉండేలా ప్లాన్ చేస్తున్నాం.
ఎంఎస్ రాజ్‌ఠాకూర్, ఎమ్మెల్యే, రామగుండం