మొంథా తుఫాన్ మిగిల్చిన నష్టాల నుంచి రైతులు కోలుకోకముందే మళ్లీ వర్షాలు కురవడం కలవరపెడుతోంది. మంగళవారం (నవంబర్ 04) తెల్లవారుజాము నుంచీ తెలంగాణలో వర్షాలు కురుస్తుండటం ఆందోళనకు గురిచేస్తుంది. కరీంనగర్, వరంగల్, జనగాం మొదలైన ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా కల్లాల్లో ధాన్యం తడిసి తీవ్ర నష్టం వాటిల్లింది.
కరీంనగర్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజాము నుంచే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హుజూరాబాద్, సైదాపూర్ మండలాల్లో భారీ వర్షం కురవటంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షార్పణం అయ్యింది. కల్లాల్లో ఉన్న దాన్యం వర్షాల కారణంగా తడిసి వానకు కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది.
జిల్లా వ్యాప్తంగా వాతావరణం లో ఒకే సారి మార్పులు రావడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు మార్కెట్ యార్డులలో, కళ్లాలలో పోసిన ధాన్యం వర్షం పాలైంది. శంకరపట్నం మండలంలోమోస్తారు వర్షం కురుస్తోంది. అదేవిధంగా జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. ఉదయం కురిసిన అకాల వర్షానికి గన్నేరువరం మండలంలోని పలు కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కొట్టుకుపోయింది.
మరోవైపు జనగామ నియోజకవర్గంలో కూడా ఉన్నట్లుండి మోస్తరు వర్షం కురుస్తోంది. అదే విధంగా వరంగల్, హనుమకొండ, కాజీపేట లో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
