ఈ ఏడాది నుంచే.. నవోదయ అడ్మిషన్లు .. డైట్ కాలేజీలో క్లాస్ల నిర్వహణ

ఈ ఏడాది నుంచే.. నవోదయ అడ్మిషన్లు ..  డైట్ కాలేజీలో క్లాస్ల నిర్వహణ
  • రూ.45 లక్షలతో రిపేర్లు, సౌకర్యాలు 
  • పర్మనెంట్ బిల్డింగ్ నిర్మాణానికి కలిగోట్​లో 30 ఎకరాల ల్యాండ్ అలాట్
  • కేంద్రం ఫండ్స్ ఇవ్వగానే పనులు షురూ
  • ఈ నెల 14 నుంచి నవోదయ ప్రారంభం

నిజామాబాద్​, వెలుగు: నిజామాబాద్​ జిల్లాలో ఈ ఏడాది నుంచి జవహర్ నవోదయ రెసిడెన్షియల్​ స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం 6వ తరగతి విద్యార్థులకు అడ్మిషన్​ ఇస్తున్నారు. ఒక్కో క్లాస్​ పెంచుతూ ఇంటర్​ వరకు కొనసాగిస్తారు. స్కూల్​ పర్మినెంట్ బిల్డింగ్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం జక్రాన్​పల్లి మండలం కలిగోట్ విలేజ్​లో 30 ఎకరాల భూమిని కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ రిలీజ్ అయ్యాక నిర్మాణ పనులు షురూ కానున్నాయి. 

అప్పటివరకు నిజామాబాద్​ డైట్ కాలేజీ బిల్డింగ్​ను వినియోగించనున్నారు. ఈ నెల 14న స్కూల్​ ప్రారంభం కానుండగా, ఎంపీ అర్వింద్​ ఇచ్చిన రూ.20 లక్షలతోపాటు కలెక్టర్ ఫండ్​ రూ.25 లక్షలతో రిపేర్లు, వాటర్​ప్లాంట్​, కరెంట్ ఫెసిలిటీ, కలర్స్ వేసి సిద్ధం చేశారు.   ప్రతి జిల్లాకో నవోదయ పాఠశాల ఉండాలనే ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ మండలం అచ్చంపేటలో 1986లో స్కూల్​ను ఏర్పాటు చేశారు. ఈ స్కూల్​లో చదివిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. 

2016 అక్టోబర్​లో జిల్లాల విభజన జరిగాక నిజాంసాగర్ మండలం కామారెడ్డి జిల్లా పరిధిలోకి వెళ్లింది. నిజామాబాద్​కు 2025లో కేంద్రం నవోదయ స్కూల్​ను మంజూరు చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను 
ఎంపిక చేయనుండగా,  ఆరో క్లాస్ నుంచి ఇంటర్​ వరకు ఫ్రీ విద్య అందించడంతోపాటు వసతి, భోజనం, క్రీడలు, దేశభక్తి, ఎన్​సీసీ, చిత్రలేఖనం, సాంస్కృతిక అంశాలపై శిక్షణ ఇస్తున్నారు.  గ్రామీణ విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయిస్తారు.  ఏటా నవోదయ ప్రవేశాలకు క్రేజ్ పెరుగుతోంది.  

జిల్లాకు జవహర్​ నవోదయ మంజూరయ్యాక ఎక్కడ ప్రారంభించాలనే అంశంపై ఆఫీసర్లు మల్లగుల్లాలు పడ్డారు. మూడు భవనాలు పరిశీలించి చివరకు డైట్ కాలేజీ బిల్డింగ్ ఎంపిక చేశారు. దీనిని ఏడాది క్రితం వరకు కేంద్రీయ పాఠశాల కోసం వినియోగించారు. కేంద్రీయ స్కూల్ కొత్త బిల్డింగ్​లోకి షిష్ట్ కావడంతో నవోదయకు వాడనున్నారు. మొదటి ఏడాది ఆరో తరగతిలో అడ్మిషన్లు పూర్తి చేసి గర్ల్స్​, బాయ్స్​కు వేరువేరు హాస్టల్స్, టాయిలెట్స్, టీచర్స్ అకామిడేషన్ పనులు కంప్లీట్ చేశారు. నిజాంసాగర్ నవోదయ ప్రిన్సిపాల్​కు నిజామాబాద్​ బాధ్యతలు అప్పగించారు. 

14 నుంచి స్కూల్​ ప్రారంభం..

ఈ నెల 14 నుంచి స్కూల్​ ప్రారంభమవుతోంది. ఆరో తరగతిలో 40 మందికి అడ్మిషన్లు ఇవ్వనున్నాం.   కేంద్రం నుంచి రూ.వంద కోట్లు రాగానే కలిగోట్ లో పర్మినెంట్ బిల్డింగ్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. అప్పటిదాకా డైట్ కాలేజీలోనే నవోదయ కొనసాగుతుంది. 

మను యోహనన్, ఇన్​చార్జి ప్రిన్సిపాల్