
- గద్వాల జిల్లా అయిజలో రెండు రోజుల కింద మహిళ హత్య కేసులో నిందితుల అరెస్ట్
అయిజ, వెలుగు : గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని మాలపేటలో ఈ నెల 1న జరిగిన మహిళ హత్య కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మహిళ ప్రవర్తన సరిగా లేకపోవడం వల్లే కొడుకుకు పెండ్లి సంబంధాలు రావడం లేదన్న కోపంతో భర్త, కొడుకు కలిసి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసుకు సంబంధించిన వివరాలను గురువారం డీఎస్పీ మొగిలయ్య వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... ధరూర్ మండల కేంద్రానికి చెందిన రామాచారితో 2001లో సరోజకు వివాహమైంది.
ఇద్దరు కుమారులు, ఒక కూతురు. తర్వాత సరోజ ప్రవర్తనలో మార్పు రావడంతో రామాచారి పలుమార్లు నచ్చజెప్పాడు. అయినా వినకపోవడంతో పెద్దల సమక్షంలో మాట్లాడుకొని విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో రామాచారి కర్నూలు జిల్లా కోస్గి మండలం కౌతాళం గ్రామానికి చెందిన సుజాతను పెండ్లి చేసుకుని అక్కడే ఉంటున్నాడు. పిల్లలను చూసేందుకు అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. రామాచారి, సరోజ పెద్ద కొడుకు వినోదాచారికి పెండ్లి సంబంధాలు చూస్తున్న క్రమంలో సరోజ ప్రవర్తన సరిగా లేదని ఎవరూ రావడం లేదు. దీంతో సరోజను హత్య చేయాలని రామాచారి, కొడుకు వినోదాచారి ప్లాన్ చేశారు.
ఇందులో భాగంగా ఈ నెల 1న సరోజ ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన వినోదాచారి తండ్రికి ఫోన్ చేశాడు. మధ్యాహ్నం తర్వాత ఇద్దరూ కలిసి సరోజతో గొడవ పడి తలను గోడకు కొట్టి, గొంతు నులిమి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయారు. మృతురాలి తమ్ముడు నరసింహాచారి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగాకేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ చేపట్టగా అసలు విషయం వెలుగుచూసింది. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ తెలిపారు.