
- తెలంగాణ, ఏపీ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ
ముషీరాబాద్, వెలుగు: ఉత్తరప్రదేశ్ విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుని, ఉద్యోగులకు అండగా ఉంటామని తెలంగాణ, ఏపీ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ పేర్కొంది. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణను సహించబోమని, కేంద్రం మెడలు వంచుతామని హెచ్చరించింది. విద్యుత్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 9న 27 లక్షల మంది విద్యుత్ ఉద్యోగులతో దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నట్లు తెలిపింది. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ నేషనల్ జనరల్ సెక్రటరీ మోహన్ శర్మ, సుదీప్ దత్త, అశోక్ రావు మాట్లాడుతూ.. దేశంలో విద్యుత్ ప్రైవేటీకరణ చేస్తే ధరలు అందుబాటులో ఉండవన్నారు. పవర్ ఖరీదైన వస్తువుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ యూపీలో ఏడు నెలలుగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. వారికి మద్దతుగా జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.