చందుర్తి, వెలుగు: ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం వేములవాడ నుంచి ఎనగల్, బండపల్లి ,మరిమడ్ల మీదుగా నిజామాబాద్ జిల్లా సిరికొండ వరకు నూతన బస్ సర్వీసును ఆయన ప్రారంభించారు. ఈ సర్వీసుతో రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాల మధ్య కనెక్టివిటీ మరింత పెరగనుందన్నారు. తిరుగు ప్రయాణంలో ఈ బస్సు కరీంనగర్ వెళ్లేలా షెడ్యూల్ రూపొందించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వేములవాడ నుంచి వివిధ ప్రాంతాలకు దశలవారీగా కొత్త సర్వీసులు ప్రారంభిస్తున్నామని చెప్పారు. సుమారు 20 ఏండ్ల తర్వాత ఈ మార్గంలో మళ్లీ బస్సు సర్వీసు ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. వేములవాడను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రూ.150 కోట్లతో చేపట్టిన రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో ఇప్పటికే సుమారు 45 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. తాజాగా రూ.99.40 కోట్లు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులకు ఆయన కృతజ్ఞ తలు తెలిపారు.
