
- బ్యారేజీకి రిపేర్లలో సవాళ్లు
- సీసీ బ్లాకులు, రాఫ్ట్, లాంచింగ్ ఆప్రాన్స్ సహా అన్నింటికీ కొత్తగా డిజైన్లు
- ఏడో బ్లాకును కూల్చి కొత్తది కట్టాలన్నా.. కూల్చకుండా రిపేర్లు చేయాలన్నా కష్టమే
- కూలిస్తే పక్కనున్న బ్లాకులపై ప్రభావం.. రిపేర్లు చేస్తే ఫౌండేషన్‌ను పైకి లేపేలా ఏర్పాట్లు
- ఏం చేయాలన్న దానిపై డిజైన్లు ఇచ్చే సంస్థ నుంచే అభిప్రాయ సేకరణ
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లపై ప్రభుత్వం అడుగు ముందుకు వేసినా.. అందులోని సవాళ్లే ఇప్పుడు సంకటంగా మారుతున్నాయి. బ్యారేజీలోని సీసీ బ్లాకులు, రాఫ్ట్, లాంచింగ్ఆప్రాన్స్ సహా మొత్తం డ్యామేజీలే ఉన్నట్టు నేషనల్ డ్యామ్‌సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) తుది నివేదిక తేల్చి చెప్పింది. కుంగింది ఏడో బ్లాక్ అయినా దాని ఎఫెక్ట్ మాత్రం బ్యారేజీపై తీవ్రంగా పడిందన్న అభిప్రాయాలను ఎన్డీఎస్ఏ వ్యక్తం చేసింది.
అందుకు అనుగుణంగానే ఇరిగేషన్ శాఖ తొలుత పునరుద్ధరణ డిజైన్ల కోసం ఆసక్తి ఉన్న సంస్థలను ఆహ్వానించింది. అయితే ఇప్పుడు మొత్తం బ్యారేజీకే కొత్తగా డిజైన్లను చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకుముందున్న డిజైన్లలో లోపాల కారణంగానే బ్యారేజీకి పెను నష్టం జరిగిందని, అలాంటప్పుడు మళ్లీ అన్ని బ్లాకులకూ కొత్తగా డిజైన్లను చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సీసీ బ్లాకులు, లాంచింగ్ ఆప్రాన్లు, రాఫ్ట్‌లు.. ఇలా అన్నింటికీ కొత్తగా ఇన్వెస్టిగేషన్లు చేశాకే డిజైన్లను ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఏడో బ్లాకుకు ఒక్కదానికే డిజైన్లు చేసి రిపేర్లు చేస్తే, మిగతా వాటిలో తేడాలొచ్చే ప్రమాదం ఉంటుందని
చెబుతున్నారు.
గేట్లు ఎత్తాక దిగువకు వచ్చే వరద వేగాలకు అనుగుణంగా బ్యారేజీల్లోని ప్రొటెక్షన్వర్క్స్నిర్మాణం జరగలేదని ఇప్పటికే ఎన్డీఎస్ఏ నిపుణులు తేల్చారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్వెలాసిటీలకు అనుగుణంగా దిగువన ప్రొటెక్షన్వర్క్స్ను చేపట్టాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. బ్యారేజీ మొత్తంలో ఈ సమస్య ఉంది కాబట్టి.. అన్ని చోట్లా రీప్లేస్మెంట్లు చేయాల్సి ఉంటుందంటున్నారు.
అంతేగాకుండా వరద వేగం తాలూకు శక్తిని నియంత్రించే ‘ఎనర్జీ డిసిపేషన్’ వర్క్స్నూ పటిష్ఠం చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని టెస్టులు చేసి అన్నింటికీ మళ్లీ కొత్త డిజైన్లు ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.
డిజైన్లు చేసే సంస్థ అభిప్రాయాలూ తీసుకుంటున్నరు
కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు డిజైన్లు చేయడానికి ముందుగా అన్ని చోట్లా జియోటెక్నికల్ఇన్వెస్టిగేషన్స్, మోడల్స్టడీస్ వంటివన్నీ చేసేలా ప్రభుత్వం ఆసక్తి ఉన్న సంస్థలను ఆహ్వానించింది. రిపేర్ల విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నది. ఇటు మేడిగడ్డ ఏడో బ్లాక్రిపేర్లకు సంబంధించి కూడా డిజైన్లు చేసే సంస్థ నుంచి ఒపీనియన్లను తీసుకోవాలని నిర్ణయించింది.
అందులో భాగంగానే ఏడో బ్లాక్‌ను కూల్చాలా? లేదా? దానికే రిపేర్లు చేయాలా? అన్నది కూడా సంస్థ చెప్పాలని ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈవోఐ)లో పేర్కొంది. కూల్చాలంటే ఏం చేయాలి? రిపేర్లకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? వంటి వివరాలను తెలియజేయాలని సూచించింది.
సీకెంట్‌పైల్స్ ఎలా?
మేడిగడ్డ బ్యారేజీని.. సీకెంట్ పైల్స్‌ను ఫౌండేషన్‌గా వేసి ఫ్లోటింగ్ బ్యారేజీగా నిర్మించారు. కానీ, ఇప్పుడు ఆ సీకెంట్‌పైల్స్ వ్యవస్థ వల్లే బ్యారేజీకి నష్టం జరిగిందని నిపుణులు తేల్చారు. ఈ క్రమంలోనే ఇప్పుడు దెబ్బతిన్న బ్యారేజీలోని ఏడో బ్లాక్‌కు రిపేర్లు చేయాలంటే.. సీకెంట్పైల్స్ఎంత పటిష్ఠంగా ఉన్నాయో కూడా చెక్చేయాల్సి ఉంటుందని, అన్ని బ్లాకుల్లోనూ వాటి పటిష్టతను చెక్‌చేసేందుకు ఇన్వెస్టిగేషన్స్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
ఏడో బ్లాక్‌కు రిపేర్ల విషయంలో ఏం చేయాలన్న దానిపైనా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. బ్లాక్‌ను పూర్తిగా తొలగించి కట్టాలంటే, పక్కన ఉన్న బ్లాకులకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతానికి బ్యారేజీకి దిగువన కనిపించే ఒక గొయ్యి మాత్రమే పడిందని, మిగతా బ్లాకుల్లో కూడా అలాంటివి ఉండవన్న గ్యారంటీ ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవేళ ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించాల్సి వస్తే అందుకు కావాల్సిన టెక్నాలజీ కూడా మన దగ్గర లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బాంబులతో డిస్మాంటిల్చేయాల్సి వస్తే కచ్చితంగా పక్కన ఉన్న బ్లాకులపై ఎఫెక్ట్ పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. ఒక్కో గేటు తొలగింపు కూడా చాలా సంక్లిష్టమైన చర్య అని చెబుతున్నారు. దాన్ని కూల్చకుండా బ్లాకుకు రిపేర్లు చేద్దామన్నా కింది నుంచి ఫౌండేషన్‌ను పైకి ఎత్తాల్సి ఉంటుందని, ఒకవేళ పైకి లేపినా ఎంత పటిష్ఠంగా ఉంటుందన్నదీ అనుమానమేనని పేర్కొంటున్నారు.