చెన్నూరుకు లిఫ్ట్‌‌ !.. శెట్‌‌పల్లి దగ్గర నిర్మాణానికి ప్రపోజల్స్‌‌

చెన్నూరుకు లిఫ్ట్‌‌ !.. శెట్‌‌పల్లి దగ్గర నిర్మాణానికి ప్రపోజల్స్‌‌
  •  సుందిళ్ల బ్యారేజీ నుంచి ఆరు టీఎంసీలు తరలింపు
  • గంగిపల్లి, ఆరెపల్లి, అస్నాద్‌‌ ట్యాంకుల ద్వారా 60 వేల ఎకరాలకు సాగునీరు
  • రూ.872.33 కోట్లతో నిర్మించేందుకు ప్లాన్‌‌
  • మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి చొరవతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా చెన్నూర్‌‌ నియోజకవర్గంలో లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ స్కీమ్‌‌ ఏర్పాటుకు కసర్తతు జరుగుతోంది. కార్మిక, మైనింగ్‌‌ శాఖ మంత్రి డాక్టర్‌‌ గడ్డం వివేక్‌‌ వెంకటస్వామి చొరవతో గోదావరి నదిపై జైపూర్‌‌ మండలం శెట్‌‌పల్లి వద్ద లిప్ట్‌‌ నిర్మాణానికి ఇరిగేషన్‌‌ ఆఫీసర్లు ప్లాన్‌‌ రెడీ చేశారు. నియోజకవర్గంలోని 60 వేల ఎకరాలకు సాగు నీరు అందించే లక్ష్యంతో రూ.872.33 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్ట్‌‌ను రూపొందించారు. సుందిళ్ల బ్యారేజీ నుంచి ఆరు టీఎంసీల నీటిని లిఫ్ట్‌‌ చేసి గంగిపల్లి, ఆరెపల్లి, ఆస్నాద్‌‌ ట్యాంకుల ద్వారా ఆయకట్టుకు తరలించేలా ప్రణాళిక తయారు చేశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే సర్కారుకు సమర్పించినట్టు తెలిసింది. ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు రాగానే లిఫ్ట్‌‌ పనులు ముందుకు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. 

లిఫ్ట్‌‌ స్వరూపం ఇలా...

లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ స్కీమ్‌‌లో భాగంగా జైపూర్‌‌ మండలం శెట్‌‌పల్లి వద్ద గోదావరి నదిపై పంప్‌‌ హౌస్​ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ 1.5 మెగావాట్ల కెపాసిటీ గల రెండు వర్టికల్‌‌ టర్బైన్‌‌ పంపులతో సుందిళ్ల బ్యారేజీ నుంచి నీళ్లను లిఫ్ట్‌‌ చేసి 4.96 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగిపల్లి ట్యాంక్‌‌లోకి తరలిస్తారు. దీనికింద జైపూర్‌‌ మండలంలో 13,086 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. 18.657 కిలోమీటర్ల మెయిన్‌‌ కెనాల్‌‌కు 12 డిస్ట్రిబ్యూటరీలు, 14 మైనర్‌‌, నాలుగు సబ్‌‌ మైనర్‌‌ కెనాల్స్‌‌ నిర్మించనున్నారు. మరోవైపు శెట్‌‌పల్లి పంప్‌‌ హౌస్‌‌ నుంచి భీమారం మండలం ఆరెపల్లి, చెన్నూర్‌‌ మండలం ఆస్నాద్‌‌ ట్యాంకులకు నీటిని తరలిస్తారు.

 ఆరెపల్లి ట్యాంక్‌‌ పరిధిలో 26,653 ఎకరాలు, ఆస్నాద్‌‌ ట్యాంక్‌‌ ద్వారా 15,689 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్లాన్‌‌ రూపొందించారు. ఇందుకోసం పంపుహౌస్‌‌ వద్ద 3.5 మెగావాట్ల కెపాసిటీతో ఆరు వర్టికల్‌‌ టర్బైన్‌‌ పంపులను ఏర్పాటు చేయనున్నారు. 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరెపల్లి ట్యాంక్‌‌ నుంచి లెఫ్ట్‌‌ మెయిన్‌‌ కెనాల్, రైట్‌‌ మెయిన్‌‌ కెనాల్, హైలెవల్‌‌ మెయిన్‌‌ కెనాల్‌‌తో పాటు ఆస్నాద్‌‌ ట్యాంక్‌‌ వరకు మరో 60 కిలోమీటర్ల కెనాల్‌‌ నిర్మిస్తారు. 16 డిస్ట్రిబ్యూటరీలకుగానూ లెఫ్ట్‌‌ మెయిన్‌‌ కెనాల్‌‌కు 9 మైనర్స్, రైట్‌‌ మెయిన్‌‌ కెనాల్‌‌కు మూడు డిస్ట్రిబ్యూటరీలు, ఒక మైనర్‌‌, హైలెవల్‌‌ మెయిన్‌‌ కెనాల్‌‌కు రెండు డిస్ట్రిబ్యూటరీలు ఏర్పాటు చేస్తారు. ఇక ఆస్నాద్‌‌ మెయిన్‌‌ కెనాల్‌‌కు 14 డిస్ట్రిబ్యూటరీలు, 14 మైనర్స్, నాలుగు సబ్‌‌ మైనర్స్‌‌ ద్వారా సాగునీరు అందనుంది. 

గతంతో పోలిస్తే సగం ఖర్చుతోనే..

బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వ హయాంలో 2022–23లో అప్పటి ఎమ్మెల్యే బాల్క సుమన్‌‌ చెన్నూర్‌‌ లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ స్కీమ్‌‌ను తెరలైకి తీసుకొచ్చారు. నియోజకవర్గంలోని 90 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామంటూ రూ.1,658 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. ఇందులో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ ఆధారంగా మూడు లిఫ్ట్‌‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2023 అక్టోబర్‌‌లో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో అందులో నీరు నిల్వ చేసే అవకాశం లేకుండా పోయింది. అన్నారం బ్యారేజీకి బుంగలు పడి అక్కడా అదే పరిస్థితి తలెత్తింది. 

దీంతో ఆ రెండు చోట్ల లిఫ్ట్‌‌ నిర్మించాలన్న ప్రతిపాదన ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలోనే మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి సుందిళ్ల బ్యారేజీ ఆధారంగా కొత్త లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ స్కీమ్‌‌ ఏర్పాటుకు ముందడుగు వేశారు. 2022–23 ఎస్‌‌ఎస్‌‌ఆర్‌‌ (స్టాండర్డ్‌‌ షెడ్యూల్‌‌ ఆఫ్‌‌ రేట్స్) ప్రకారం గతంలో 90 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి రూ.1,658 కోట్లు కాగా, ప్రస్తుతం 2026 ఎస్‌‌ఎస్‌‌ఆర్‌‌ ప్రకారం రూ.872.33 కోట్లతోనే 60 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుంది. ఇది గత అంచనాలతో పోలిస్తే సగం ఖర్చు మాత్రమే.