
గాంధీధామ్: ప్రపంచానికి ప్రకృతి వ్యవసాయం మార్గాన్ని చూపాలంటే.. భారతదేశానికి కొత్త హరిత విప్లవం అవసరమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ హరిత విప్లవం.. సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్‌ను కనుగొనడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంపదను భారతదేశానికి తీసుకువస్తుందని చెప్పారు. గుజరాత్‌లోని కచ్ జిల్లా కండ్లాలో నానో డీఏపీ(లిక్విడ్) ప్లాంటు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ ప్లాంటు అందుబాటులోకి వస్తే రోజుకు 2 లక్షల బాటిళ్ల (ఒక్కో బాటిల్‌లో 500ఎంఎల్) లిక్విడ్ తయారవుతుంది. దీనివల్ల దిగుమతి చేసుకునే ఎరువులపై ఆధారపడడం తగ్గుతుంది” అని చెప్పారు. ‘‘ప్రపంచానికి ప్రకృతి సేద్యం మార్గాన్ని చూపేందుకు, రైతుల శ్రేయస్సుకు మార్గనిర్దేశం చేసేందుకు.. మోదీ నాయకత్వంలో కొత్త హరిత విప్లవం అవసరం ఉంది” అని అమిత్ షా వివరించారు.