జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం.. 12, 28 శాతం జీఎస్టీ శ్లాబులు రద్దు

జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం.. 12, 28 శాతం జీఎస్టీ శ్లాబులు రద్దు

న్యూఢిల్లీ: జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. 12, 28 శాతం జీఎస్టీ శ్లాబులను రద్దు చేసింది. 5, 18 శాతం రేట్లతో రెండు అంచెల జీఎస్టీ విధానానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. జీఎస్టీ తగ్గింపు కోసం కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణల గురించి చర్చించడానికి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం (సెప్టెంబర్ 3) 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశమైంది. ఈ భేటీలో కేంద్ర ప్రతిపాదించిన సంస్కరణల గురించి కూలంకషంగా చర్చించిన కౌన్సిల్.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. 

జీఎస్టీ పన్ను రేట్లను రెండు శ్లాబులకు (5 శాతం, 18 శాతం) తగ్గించాలన్న కేంద్రం ప్రతిపాదనకు కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో 12, 18 జీఎస్టీ శ్లాబులు రద్దు అయ్యాయి. 5, 18 శాతం జీఎస్టీ శ్లాబులు కొనసాగనున్నాయి. అలాగే, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‎పై జీఎస్టీ రద్దుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. లగ్జీరీ వస్తువులపై 40 శాతం జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. 2025, సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబులు అమ్లలోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. 

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం మీటింగ్ వివరాలను మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు వెల్లడించారు. రెండు అంచెల (5, 18) జీఎస్టీ విధానానికి జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని చెప్పారు. 12, 28 శాతం శ్లాబులను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. కొత్త శ్లాబులతో పేదలు, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చాలా ఆహార పదార్థాలపై  సున్నా శాతం జీఎస్టీ విధించామని తెలిపారు. పేదలు, సామాన్యులు అధికంగా వాడే వస్తువులను 5 శాతం శ్లాబులలోకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. 2025, సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబులు అమ్లలోకి వస్తాయని తెలిపారు. 

అలాగే, అన్ని రకాల వ్యక్తిగత, జీవిత బీమా ఇన్సురెన్స్‎లకు జీఎస్టీ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇన్సురెన్స్ లపై ప్రస్తుతమున్న 18 శాతం జీఎస్టీ పూర్తిగా రద్దు చేశామని తెలిపారు. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గించామని చెప్పారు. చేనేత, మార్బుల్, గ్రానైట్‎ను 5 శాతం జీఎస్టీ శ్లాబులోకి తీసుకొచ్చామన్నారు. 

సిమెంట్‎పై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించామన్నారు. క్యాన్సర్ సహా 33 ప్రాణాధార ఔషదాలపై జీఎస్టీని 12 నుంచి సున్నాకు తగ్గించామని పేర్కొన్నారు. 350 సీసీ కంటే తక్కువ కెపాసిటీ ఉన్న లోకల్ బైకులపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి కుదించామని చెప్పారు. ఫర్టిలైజర్స్, ఎరువులపై జీఎస్టీ 18 నుంచి 5 శాతానికి తగ్గించామని తెలిపారు. పునరుత్పాదక ఇంధన పరికరాలపై జీఎస్టీ 12నుంచి 5 శాతానికి కుదించామని వెల్లడించారు. 

ఆటో మొబైల్ పరికరాలపై జీఎస్టీ 28 నుంచి 18 శాతానికి  తగ్గించామని తెలిపారు. ఆరోగ్యానికి హాని కలిగించే పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తుల, నాన్ ఆల్కహాలిక్ బ్రేవరేజ్‎స్‎పై 40 శాతం జీఎస్టీ విధించామని చెప్పారు. కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, జ్యుసులపై 40 శాతం జీఎస్టీ విధించామన్నారు. త్రీవీలర్లపై  జీఎస్టీ 28 నుంచి 18 శాతానికి కుదించామని తెలిపారు. అన్ని టీవీలపై జీఎస్టీ 18 శాతం విధించామని చెప్పారు.