ఒకప్పుడు వేడుక ఏదైనా విస్తరాకుల్లోనే భోజనం వడ్డించేవాళ్లు. కానీ, ఇప్పుడు పేపర్, ప్లాస్టిక్ ప్లేట్స్ వాటిని పూర్తిగా రీప్లేస్ చేశాయి. ఒకరిద్దరు మినహాయించి అందరూ విస్తరాకుల్ని పక్కనపెట్టేశారు. కానీ, వైజాగ్‌కి చెందిన ఈ మిల్లెట్ మ్యాన్ మాత్రం విస్తరాకుల్లో వడ్డించడమే కాదు వాటిల్లోనే హెల్దీ ఇడ్లీలని కూడా ప్రిపేర్ చేస్తున్నాడు. అంతేకాదు రైతులకు అండగా నిలుస్తున్నాడు కూడా. అదెలాగంటే..
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకి చెందిన చిత్తమ్ సుధీర్ నాగార్జున యూనివర్సిటిలో ‘ఆగ్రో ఎకనామిక్స్’లో మాస్టర్స్ చేశాడు. ఆ టైంలో నేచురల్ ఫార్మింగ్‌పై ఆసక్తి కలిగింది అతనికి. దాంతో వ్యవసాయం వైపు అడుగులేశాడు. నేచురల్ ఫార్మింగ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి రైతులతో కొన్ని నెలలు గడిపాడు. అప్పుడే మిల్లెట్స్ సాగు, వాటివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకున్నాడు. ఇంట్రెస్టింగ్గా అనిపించడంతో సొంతూల్లో మిల్లెట్ సాగుకి గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాడు. కానీ, ఆ టైంలో అవి పండించే రైతుకు లేని డిమాండ్ వాటితో తయారుచేసిన వంటకాలకి ఉందని తెలుసుకున్నాడు. దాంతో ‘వాసెన పోలి’ స్టాల్లో చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీలను అమ్మడం స్టార్ట్ చేశాడు. ఈ పేరే ఎందుకంటే సాధారణంగా మినప్పప్పుని రుబ్బి, అల్లం, జీలకర్ర, కొద్దిగా మె౦తులు కలిపి ఆవిరిమీద ఉడికించే ప్రాసెస్‌ని వాసెన పోలి అంటారు. ఆ ట్రెడిషనల్ పద్ధతిలోనే మిల్లెట్స్‌తో ఇడ్లీలు చేస్తుండటంతో సుధీర్ కూడా తన స్టాల్‌కి వాసెన పోలి అని పేరు పెట్టాడు.
ప్రత్యేకత అదే
కేవలం జొన్న, కొర్ర, రాగి, వరిగ, సామల, ఆరిక, సజ్జ, ఊద, మల్టీ మిల్లెట్స్‌తో తయారుచేసిన ఇడ్లీలని మాత్రమే అమ్ముతాడు సుధీర్. వాటిల్లోకి చట్నీలను కూడా సొరకాయ, అల్లం, క్యారెట్లతో తయారుచేస్తాడు. ఇడ్లీలను కూడా విస్తరాకుల్లో ఆవిరిపై ఉడికిస్తాడు. ఇన్ని స్పెషాలిటీలు ఉండటంతో కస్టమర్స్ ‘క్యూ’ కడుతున్నారు ఇతని స్టాల్‌కి. రోజుకి ఐదు వందల ప్లేట్ల ఇడ్లీలు అమ్ముడుపోతున్నాయి ఇప్పుడు. వీకెండ్స్‌లో అది మరో రెండొందలు పెరుగుతుంది. ప్రతి నెలా ఇడ్లీలకి కావాల్సిన 700 కిలోల మిల్లెట్స్‌ని కూడా నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేస్తున్నాడు సుధీర్. వాళ్లకి మార్కెట్ ధర కన్నా 30 రూపాయలు ఎక్కువగానే ముట్టజెప్తున్నాడు. చిరుధాన్యాలతో తయారుచేసిన ఇడ్లీలలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాపర్ లాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఫోలేట్, బి6, సి, ఈ, కె విటమిన్లు కూడా అధికం. ఇవి రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. అందుకే మిల్లెట్స్‌తో ఇడ్లీలు తయారు చేసి అమ్ముతున్నా. మొదట్లో అరకొరగానే కస్టమర్లు వచ్చేవాళ్లు. కానీ, వీటివల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్‌పై అవేర్నెస్ పెరగడంతో కస్టమర్స్ పెరిగారు. ఇప్పుడు వైజాగ్‌లో ఫేమస్ టిఫిన్ స్టాల్స్‌లో ఒకటిగా మారింది ‘వాసెన పోలి’ అంటున్నాడు సుధీర్.
