రేపే మార్కెట్లోకి కొత్త 'హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్'.. సరికొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు..

రేపే మార్కెట్లోకి కొత్త 'హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్'.. సరికొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు..

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హోండా, రేపు (మే 22, 2026) భారత మార్కెట్లో అప్‌డేట్ చేసిన సరికొత్త 'సిటీ ఫేస్‌లిఫ్ట్' సెడాన్ కారును విడుదల చేయనుంది. ఈ మధ్య లీక్ అయిన ఫోటోలు, టీజర్ల ద్వారా ఈ కారుకు సంబంధించిన చాలా వివరాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. అయితే ఈ కార్ పూర్తిగా  న్యూ-జనరేషన్ కారు కాదు. కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడే ఫ్రంట్ డిజైన్, సరికొత్త ఫీచర్లు, క్యాబిన్ అప్‌గ్రేడ్స్‌పైనే హోండా ఈసారి ఎక్కువ దృష్టి పెట్టింది.

ప్రస్తుతం మార్కెట్లో ఎస్‌యూవీ (SUV) కార్ల హవా నడుస్తోంది. ఇలాంటి సమయంలో హ్యుందాయ్ వెర్నా, వోక్స్‌వ్యాగన్ విర్టస్, స్కోడా స్లావియా వంటి గట్టి పోటీదారులకు దీటుగా నిలబడటానికి ఈ కొత్త హోండా సిటీ అప్‌డేట్ కంపెనీకి చాలా కీలకంగా మారనుంది.

ఎక్స్‌టీరియర్ డిజైన్
కొత్త హోండా సిటీ కారును పాత దానితో పోల్చి చూడటం  చాలా ఈజీ. ఎందుకంటే ఎక్కువ మార్పులు కారు ముందు భాగంలోనే చేశారు. ఫ్రంట్ లుక్ వస్తే  కారుకు కొత్త గ్రిల్, అప్‌డేట్ చేసిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు, కొత్త ఫ్రంట్ బంపర్‌ ఇచ్చారు. దీనివల్ల కారు పాత మోడల్ కంటే చాలా షార్ప్, స్పోర్టీ లుక్‌తో కనిపిస్తుంది. హెడ్‌లైట్లను కలుపుతూ ఒక సన్నని లైట్ బార్‌ కూడా ఇచ్చారు. సైడ్ & వెనుక భాగం చూస్తే కారు సేడ్ భాగంలో పెద్దగా మార్పులు లేవు కానీ, కొత్త డ్యూయల్-టోన్ 16-ఇంచుల అల్లాయ్ వీల్స్‌ను ఇచ్చారు. అలాగే వెనుక బంపర్ డిజైన్‌ను కొద్దిగా మార్చి, నిలువుగా ఉండే లైట్ రిఫ్లెక్టర్లను పెట్టారు.

 ఇంటీరియర్ & ఫీచర్లు 
కారు లోపలి లేఅవుట్ పాతదానిలానే ఉన్న.. ఫీచర్లు, లగ్జరీని మరింత పెంచారు.  డాష్‌బోర్డ్‌పై ఇంతకుముందు కంటే పెద్దగా కొత్త ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ అమర్చారు.  వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేలను సపోర్ట్ చేస్తుంది.

కొత్త ఫీచర్లు చూస్తే డ్రైవింగ్‌ను మరింత ఈజీ చేయడానికి ఇందులో 360-డిగ్రీల కెమెరా, ఎండకాలంలో హాయిగా ఉండేందుకు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లను కొత్తగా చేర్చారు.

ఈ  హోండా కారులో సేఫ్టీ కోసం హోండా సెన్సింగ్(ADAS) టెక్నాలజీ ఇస్తూ... ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ బ్రేకింగ్ వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు టాప్ వేరియంట్లలో ఉంటాయి.

ఇంజన్ & మైలేజ్ 
కారు ఇంజన్ పర్ఫార్మెన్స్  లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.  1.5-లీటర్ పెట్రోల్ వేరియంట్  ఇంజన్ (121 PS పవర్, 145 Nm టార్క్) లభిస్తుంది.   6-స్పీడ్ మాన్యువల్ అండ్ సివిటి (CVT) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో వస్తుంది. దీని మైలేజ్ లీటరుకు సుమారు 18 కిలోమీటర్లు ఉంటుంది.

ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారి కోసం స్ట్రాంగ్  హైబ్రిడ్ వేరియంట్ (e:HEV)  ఆప్షన్ కూడా ఉంది. ఇది పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ సహాయంతో నడుస్తుంది. దీని మైలేజ్ లీటరుకు  27 కిలోమీటర్ల వరకు వచ్చే అవకాశం ఉంది.

 ధర ఎంత ఉండొచ్చంటే 
కొత్త హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ ధరలను రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే మార్కెట్ అంచనాల ప్రకారం, పెట్రోల్ వేరియంట్ల ధరలు రూ. 12.50 లక్షల నుండి ప్రారంభమై రూ. 19 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే హైబ్రిడ్ మోడల్ ధర రూ. 20.50 లక్షల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు.