జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపుతో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఊపు వచ్చింది. ఈ గెలుపుతో.. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనదే గెలుపు.. అంటూ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 2025 నవంబర్ 14 వ తేదీన జూబ్లీహిల్స్ బైపోల్స్ ఫలితంలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలవటంతో రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు కార్యకర్తలు, నాయకులు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్.. ప్రత్యర్ధి మాగంటి సునీతా గోపీనాథ్ (బీఆర్ఎస్) పై మాగంటి సునీతా గోపినాథ్‌పై 24,658 వేల ఓట్ల మెజార్టీతో గెలుపు కైవసం చేసుకున్నారు నవీన్ యాదవ్.
కాంగ్రెస్ గెలుపుతో పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. గెలుపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలతో విజయోత్సవాలు చేస్తున్నారు నాయకులు. ఎమ్మెల్సీ దయానంద్ గుప్త ఆధ్వర్యంలో కొత్త పేట ఓమ్ని చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు నిర్వహించాయి. పటాకులు కాల్చి, మిఠాయిలు పంచుకొంటూ ఉత్సవాలు నిర్వహించారు.
జూబ్లీహిల్స్ లో:
నవీన్ యాదవ్ గెలుపుతో జూబ్లీహిల్స్ లో సంబరాలు అంబరాన్నంటాయి. కౌంటింగ్ సెంటర్ కోట్ల విజభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి యూసుఫ్ గూడలోని నవీన్ యాదవ్ ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అదే విధంగా రెహమత్ నగర్ సర్కిల్ లో బాణా సంచా పేల్చి సెలబ్రేషన్స్ చేసుకున్నారు కార్యక్ర్తలు. బోరబండలో భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో పాల్గొన్నారు. బోరబండ బస్టాప్ దగ్గర బాణా సంచా పేల్చి స్వీట్లు తినిపించుకుని సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అటు షేక్ పేట్, మెహదీపట్నం, వెంగళరావు నగర్, ఎర్రగడ్డ మొదలైన ఏరియాల్లో పార్టీ ఆఫీసుల ముందు సంబరాలు చేసుకున్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు భారీ ఎత్తున యూసుఫ్ గూడకు చేరుకుంటున్నారు. మరోవైపు అటు గాంధీ భవన్ లో కూడా సంబరాలు నిర్వహించారు నాయకులు, కార్యకర్తలు.
మంచిర్యాల జిల్లాలో పాలభిషేకం:
మందమర్రి మండలం రామక్రిష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడంతో హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు
మహబూబ్‌నగర్ జిల్లాలో:
మహబూబ్‌నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి. అదే విధంగా భూత్పూర్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గెలుపు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి స్టెప్పులేశారు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఇటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చౌక్ వద్ద టపకాయలు పేల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు పార్టీ శ్రేణులు.
సిద్దిపేట జిల్లాలో:
సిద్దిపేట జిల్లాలో జూబ్లీహిల్స్ గెలుపును కోలాహలంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. హుస్నాబాద్ లో హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణుల సంబరాలు చేసుకున్నారు.
టపాసులు కాల్చి, మిఠాయిలు తినిపించుకున్నారు పార్టీ నాయకులు.
దుబ్బాక నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీఎత్తున చేరి సంబరాలు చేసుకున్నారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ రాయల్ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు సంబరాలు చేసుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో:
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు ప్రజలు పట్టాభిషేకం కట్టడంపై సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ప్రజా పాలనకే ప్రజలు మొగ్గు చూపారని, ఓటర్లు బీజీపీ, బీఆర్ఎస్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారని అన్నారు వేములవాడ పట్టణ కాంగ్రెస్ నాయకులు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు సంక్షేమ ఫలాలు అందడంతో ప్రజల సుఖసంతోషాలతో ఉన్నారని, ఎన్నికల సమయంలో కేటీఆర్ హైడ్రా ను బూచీగా చూపి పేరుతో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారని, అయినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారని, బీజేపీ, బీఆర్ఎస్ మాటలను ప్రజలు పట్టించుకోలేదని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడానికి జూబ్లీహిల్స్ ఎన్నిక శుభసూచకమఅని ఈ సందర్భంగా చెప్పారు.
జగిత్యాల జిల్లాలో:
కాంగ్రెస్ గెలుపతో సంబరాలు చేసుకున్నారు జగిత్యాల కాంగ్రెస్ నేతలు. ఎండపల్లి మండలం కొత్తపేటలో ఐకేపీ సెంటర్ ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం ఉంది కాబట్టే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారని అన్నారు. ఈ గెలుపు నిదర్శనమే ప్రతిపక్షాలకు చెంపపెట్టు అని అన్నారు.
కరీంనగర్ జిల్లాలో:
శంకరపట్నం మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు డీజే సౌండ్స్ తో డాన్స్ లు చేస్తూ బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే గా గెలుపొందడంతో వేడుకలు చేసుకుంటున్నారు పార్టీ కార్యకర్తలు, అభిమానులు.
