OTT Movies : ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఇవే !

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు ఇవే !

వన్‌‌సైడ్​ లవ్

టైటిల్ : అభిలాషం,
ప్లాట్​ ఫాం :  అమెజాన్ ప్రైమ్ వీడియో, మనోరమ మ్యాక్స్
డైరెక్షన్ :  షంజు జైబా
కాస్ట్​ : సైజు కురుప్, తన్వి రామ్, అర్జున్ అశోక్, నవాస్ వల్లికున్ను

కొట్టక్కల్​కు చెందిన అభిలాష్ కుమార్(సైజు కురుప్) ఒక ఫ్యాన్సీ స్టోర్​ నడుపుతుంటాడు. వయసు మీద పడుతున్నా పెండ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుంటాడు. అందుకు కారణం అతను గతంలో ఒక అమ్మాయిని ప్రేమించడమే. అభిలాష్​ స్కూల్​ డేస్​లోనే తన ఫ్రెండ్​ షెరిన్ మూసా(తన్వి రామ్)తో ప్రేమలో పడతాడు. కానీ.. ఆ విషయం ఆమెకు చెప్పడానికి భయపడతాడు. తర్వాత షెరిన్​ చదువుకోసం ఊరు విడిచి వెళ్లిపోతుంది. ఏండ్లు గడిచిపోతాయి. 

అతను మాత్రం ఆమె జ్ఞాపకాల్లోనే బతుకుతుంటాడు. అలాంటి టైంలో షెరిన్​ మళ్లీ ఊళ్లోకి రావడంతో అతని మనసులో కొత్త ఆశలు చిగురిస్తాయి. కానీ.. ఇంట్రోవర్ట్‌‌, ఆత్మవిశ్వాసం లేని వ్యక్తి కావడంతో తన ప్రేమను చెప్పలేకపోతాడు. చెప్తే ఎలా రియాక్ట్‌‌ అవుతుందో అనే సంకోచంతో ప్రతిసారి ఆగిపోతుంటాడు. అందుకే తన ప్రాణ స్నేహితుడు, లాయర్​ (నవాస్ వల్లికున్ను) సాయం తీసుకుంటాడు. అతను వాళ్లను దగ్గర చేసే ప్రయత్నంలో అనుకోకుండా మరింత దూరం పెరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అతని ప్రేమ గెలిచిందా? ఓడిందా? తెలియాలంటే సినిమా చూడాలి.

ఒకరి కలలోకి మరొకరు!

టైటిల్ : పెండ్యులం
 ప్లాట్​ ఫాం :  ఈటీవీ విన్‌‌, 
డైరెక్షన్ :  రెజిన్‌‌ ఎస్‌‌.బాబు
కాస్ట్​ : విజయ్ బాబు, అనుమోల్, దేవకి రాజేంద్రన్, ప్రకాష్ బారె, అమల్ దేవ్, అవని

నిద్రలో కలలు రావడం సహజం. కలలో ఇతరులు కనిపించడం కూడా మామూలే. కానీ.. ఒకరి కలలోకి మరొకరు ఉద్దేశపూర్వకంగా వెళ్లే కొత్త కాన్సెప్ట్‌‌తో ఈ సినిమా తీశారు. కథలోకి వెళ్తే.. డాక్టర్ మహేష్ నారాయణ్ (విజయ్ బాబు) తన భార్య శ్వేత(దేవకి రాజేంద్రన్) కూతురు తన్మయి(అవని)తో కలిసి ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు షిఫ్ట్ అవుతాడు. ప్రతిరోజూ హాస్పిటల్​లో బిజీగా ఉండే మహేశ్​ ఒకరోజు ఫ్యామిలీతో లాంగ్ డ్రైవ్‌‌కి వెళ్తాడు. అలా వెళ్తుండగా ఒక ప్లేస్ నచ్చడంతో అక్కడే ఆగిపోతారు. అయితే.. మహేశ్​కి ఆ ప్లేస్​తో ఏదో సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. అప్పుడే తన్మయి చేసిన పొరపాటు వల్ల తాళం చెవి కారు డిక్కీలో ఉన్నప్పుడు లాక్​ పడిపోతుంది. 

దాంతో లాక్​ తీయలేక ఆరోజు రాత్రి దగ్గర్లోని ఓ ఇంట్లో ఉండిపోతారు. ఉదయం నిద్రలేచి చూసేసరికి మహేశ్‌‌ కనిపించకుండాపోతాడు. అందరూ కలిసి వెతకగా రోడ్డు పక్కన ఒకచోట స్పృహతప్పి పడిపోయి ఉంటాడు. రాత్రి తనని ఓ లారీ ఢీ కొట్టిందని చెప్తాడు. అయితే.. తర్వాత ఎంక్వైరీ చేసి అక్కడ ఎలాంటి యాక్సిడెంట్​ జరగలేదని తెలుసుకుంటాడు. అదంతా అతనికి కలలో జరిగిందని తెలిసి షాక్​ అవుతాడు. ఎలాగైనా ఆ కల మిస్టరీ తెలుసుకోవాలని ఒక ఎక్స్‌‌పర్ట్‌‌ని కలుస్తాడు. ఆ క్రమంలో అతనికి తెలిసిన నమ్మలేని నిజాలు ఏంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. 

గతం మర్చిపోయిన రెజ్లర్  ​ 

టైటిల్ : సుమో
ప్లాట్​ ఫాం : సన్​నెక్స్ట్‌‌
డైరెక్షన్ :   ఎస్పీ హోసిమిన్
కాస్ట్​ : శివ, ప్రియా ఆనంద్, యోషినోరి తషిరో, వీటీవీ గణేష్, యోగి బాబు, సతీష్

శివ(శివ) చెన్నైలోని ఒక రెస్టారెంట్‌‌లో పనిచేస్తుంటాడు. అతనికి ఒకరోజు అపస్మారక స్థితిలో బీచ్‌‌లో కొట్టుకొచ్చిన సుమో తషిరో(యోషినోరి తషిరో) కనిపిస్తాడు. ఒంటి మీద సుమో రెజ్లర్లు వేసుకునే మావాషి బట్టలు ఉంటాయి. సుమో గతం మర్చిపోయాడని గమనించిన శివ అతన్ని డాక్టర్‌‌‌‌ దగ్గరకు తీసుకెళ్తాడు. సుమో మానసిక వయసు ఒకటిన్నర సంవత్సరాలు అని చెప్తాడు డాక్టర్‌‌. దాంతో శివ అతన్ని ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంటూ ఉంటాడు. 

అందరూ అతన్ని గణేశ్​ అని పిలుస్తుంటారు. కొన్నాళ్లకు గతంలో అతను జపాన్‌‌లో గొప్ప సుమో రెజ్లింగ్​ చాంపియన్​ అని తెలుస్తుంది. దాంతో శివ అతన్ని తిరిగి జపాన్​కు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తాడు. కానీ.. జపాన్‌‌లోని ఒక ముఠా అతన్ని అడ్డుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది?  సుమోకు గతం గుర్తొచ్చిందా? అతను మళ్లీ రెజ్లింగ్​ పోటీల్లో పాల్గొన్నాడా? అనేదే మిగతా కథ.