నయా ట్రెండ్: పాత టైటిల్స్ తో కొత్త స్టోరీస్

నయా ట్రెండ్: పాత టైటిల్స్ తో కొత్త స్టోరీస్

పాతసీసాలో కొత్త సరకులాగా ఉంది కొత్త సినిమాల టైటిళ్ల పరిస్థితి. పాత సినిమాల టైటిల్స్ ను ఇప్పుడు వాడుకోవడం కామన్ అయిపోయింది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సామెతను ఇప్పటి హీరోలు ఫాలో అవుతున్నారు. గతంలో సూపర్ హిట్ అయిన సినిమాల టైటిల్స్ ను వాడుకుంటే క్రేజ్ బాగా వస్తుందనో..లేక కథ డిమాండ్ చేయడం వలనో కానీ చాలా మంది యంగ్ హీరోలు పాత సినిమాల టైటిల్స్ ను తమ అప్ కమింగ్ ఫిలిమ్స్ కు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే హిట్టు సినిమా టైటిల్ పెట్టుకున్నంత మాత్రాన సినిమా హిట్ అయిపోతుంది అనుకోవడం పొరపాటే. 

పాత మూవీస్ టైటిల్స్ పెట్టుకోవటం రిస్కే

ఇలా పాత సినిమాల టైటిల్స్ ను పెట్టుకోవటం కాస్త రిస్కే అవుతుంది. ఆ సినిమా లేదా హీరో ఫ్యాన్స్ కొత్త మూవీకి పేరు అనౌన్స్ చేయగానే మూవీ టీమ్ పై సోషల్ మీడియాలో విరుచుకుపడతారు. మా హీరో టైటిల్ పెట్టుకుంటావా అని తిడతారు. రీసెంట్ గా యంగ్ హీరోలు నాని, విజయ్ దేవరకొండలు మెగా ఫ్యాన్స్ తో తిట్లు తిన్నారు. మూవీ రిలీజయ్యాక సినిమా హిట్ టాక్ వస్తే ఏం కాదు. కానీ ఒక వేళ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం అనవరంగా మంచి టైటిల్ ను చెడగొట్టారు అని ట్రోల్ చేస్తారు.

ఇంతకు ముందు పాత టైటిల్స్ పెట్టుకున్నప్పడు అంతగా కాంట్రవర్శీ అవ్వలేదు. కానీ 2019లో హీరో నాని గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ పెట్టుకున్నాడు. అప్పుడు చిరు ఫ్యాన్స్ నానిపై ఎటాక్ చేశారు. క్లాసిక్ సినిమా పేరు ను చెడగొడుతున్నావ్ అంటూ మండిపడ్డారు. దానికి నాని వివరణ ఇచ్చాడు. ఈ సినిమాలో ఐదుగురు లేడీస్ కి తాను లీడర్ గా ముందుండి నడిపిస్తాననీ, అందుకే ఈ టైటిల్ పెట్టామని చెప్పాడు. తాను కూడా చిరంజీవి అభిమానినేనని తన టైటిల్ పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించాడు.

విజయ్ దేవరకొండపై పవన్ ఫ్యాన్స్ ఫైర్

రీసెంట్ గా విజయ్ దేవరకొండపై కూడా పీకే ఫ్యాన్స్ ఇలాగే ఫైర్ అయ్యారు. విజయ్ సమంత లతో శివనిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా పేరు ‘ఖుషి’ అనౌన్స్ చేశారు. ఖుషి అంటే ఓ క్లాసిక్ అని ,ఆ టైటిల్ పెట్టుకొని చెడగొడతారా అంటూ  పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అదే అంశంపై మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాత రవిశంకర్ యలమంచిలి మాట్లాడుతూ.. తమ డైరెక్టర్ శివ నిర్వాణ పవన్ కళ్యాణ్ కు, ఖుషి సినిమాకు పెద్ద ఫ్యాన్. ఈ సినిమా కథ చెప్పినప్పుడే ఖుషి టైటిల్ ను ఫిక్స్ చేశాడు ఆయన..చాలా రోజుల క్రితమే ఈ  టైటిల్ చాంబర్ లో రిజిస్టర్ చేయించాం. ఇలాంటి రొమాంటిక్ కథకు ఇది పర్ఫెక్ట్ టైటిల్. పాత ఖుషి లాగే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అన్నారు.

5ఏళ్ల తర్వాత ఎవరైనా పెట్టుకోవచ్చు

నిజానికి 5 ఏళ్ల తర్వాత ఏ సినిమా టైటిల్ అయినా ఎవరైనా వాడుకోవచ్చు. ఫిలిం చాంబర్ లో రూల్ ఇలాగే ఉంది. చాలా మంది ఇలాగే టైటిల్స్ తీసుకున్నారు. ఇదే అంశంపై ఫిలిం చాంబర్ ప్రతినిధులు మాట్లాడుతూ..ఏ టైటిల్ వాలిడిటీ అయినా 5 ఏళ్లు మాత్రమే ఉంటుంది.అప్పటివరకు ఆ టైటిల్ ను ఎవరు పెట్టుకోవద్దు. 5 ఏళ్లు దాటిన తర్వాత ఎవరైనా పెట్టుకునే హక్కు ఉంటుంది.  నామినల్ రేట్ 12 వందలు కడితే సరిపోతుందని చెప్పారు. ఇతర భాషల్లో ఏదైన క్లాసిక్ సినిమా టైటిల్ ను పెట్టుకోవడానికి లేదు. కేరళ,తమిళనాడు రాష్ట్రాల్లో ఆ సినిమాకు గౌరవంగా మరెవరూ ఆ టైటల్ పెట్టుకోవద్దని రూల్ ఉంది. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అలాంటి నిబంధన పెట్టాలని చూస్తున్నారు నిర్మాతలు.

దీని గురించి సీనియర్ నిర్మాత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ:నిజానికి తమిళనాడు, కేరళలో సూపర్ హిట్ అయిన టైటిల్స్ ఎవరూ పెట్టుకోవద్దని రిజల్యూషన్ చేసుకున్నారు. టాలీవుడ్ లో అలాంటిదేం లేదు. 5 ఏళ్లు దాటితే ఎవరైనా పెట్టుకోవచ్చు. కానీ రీసెంట్ గా కొందరు నిర్మాతలు కేరళ, తమిళనాడులో లాగానే ఇక్కడ కూడా అలాంటి రూల్ పెడదామంటున్నారు. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో చూడాలి. ఫ్యాన్స్ గొడవ మాములే. పాతాళ భైరవి, శంకరభరణం, లవ కుశ లాంటి చాలా క్లాసిక్  టైటిల్స్ చిన్న సినిమాలకు పెట్టుకున్నారు. అయితే అమెరికా ఎంబసీకి పాత సినిమా టైటిల్ ప్రొడ్యూసర్ అప్లై చేసుకుంటే గూగుల్ లో వాళ్ల సినిమానే మొదట కనిపిస్తుంది. ఇక పోతే రీసెంట్ గా డబ్బింగ్ సినిమాకు ఒక టైటిల్ సెన్సార్ చేస్తే..వేరే భాషల్లో డబ్బింగ్ చేస్తే.. అదే టైటిల్ పెట్టుకోవచ్చు అనే వెసులుబాటు ఇచ్చింది సెన్సార్ బోర్డ్. తెలుగులో అవేలబుల్ లేకపోయినా వాళ్లు అదే టైటిల్ తో సినిమా రిలీజ్ చేయవచ్చంటూ చెప్పుకొచ్చారు.

ఇప్పటివరకు పాత టైటిల్స్ యూజ్ చేసిన సినిమాలు

గ్యాంగ్ లీడర్, తొలిప్రేమ, జెంటిల్ మెన్, మహర్షి, మిస్సమ్మ, శ్రీమంతుడు, మల్లీశ్వరి, గీతాంజలి, నర్తనశాల, ఖైదీ, దేవదాస్, ప్రేమాభిషేకం, జంబలకిడిపంబ, శంకరాభరణం, మోసగాళ్లకు మోసగాడు, యముడికి మొగుడు, గూడాచారి, పూల రంగడు, ఆహ నా పెళ్లంట, విజేత, దొంగ, విక్రమ్ ఖుషి

సినిమా టైటిల్ అనేది ఆ కథను రిప్రజెంట్ చేస్తుంది. టైటిల్ అనేది సినిమాకు పాజిటివ్ వైబ్ తీసుకొస్తుంది. జనాల్లో ఆ పేరు నానుతుంది. పాత సినిమా టైటిల్ పెట్టుకుంటే కేవలం ప్రమోషన్ వరకు ఉపయోగపడుతుంది కానీ అల్టీమేట్ గా కంటెంట్ బాగుంటేనే ఏ సినిమా అయినా సక్సెస్ అవుతుంది. కథ,స్క్రీన్ ప్లేలు బాగుంటే పేరుతో సంబంధం ఉండదు. అత్తారింటికి దారేది, సరిలేరు నీకెవ్వరు, జనతా గ్యారేజ్, అలా వైకుంఠపురంలో, అరవింద సమేత, జయ జానకి నాయక,వినయ విధేయ రామ లాంటి సినిమా టైటిల్స్ అనౌన్స్ చేసినప్పుడు ఆశ్చర్యపోయారు. కానీ మెల్లమెల్లగా ప్రేక్షకుల్లో ఆ టైటిల్స్ బాగా రిజిస్టర్ అయ్యాయి. అదే విధంగా మేకర్స్ టైటిల్స్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా కంటెంట్ పై దృష్టి పెడితే బాగుంటుంది అనేది సినీ విమర్శకుల అభిప్రాయం.

మరిన్ని వార్తల కోసం

‘పై ఫోనా’ మజాకా.. అంతరిక్షం నుంచీ కాల్స్

సీనియర్ హీరోల ఫ్యామిలీలో చేరుతున్న క్రేజీ హీరోయిన్స్