కొత్త పాలకవర్గాలకు సవాలే

 కొత్త పాలకవర్గాలకు సవాలే
  • పెండింగ్​లో అభివృద్ధి పనులు
  • అంతంతమాత్రంగానే మౌలిక వసతులు
  • ప్రత్యేక దృష్టి పెడితేనే సమస్యలకు శాశ్వత పరిష్కారం


మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు:ఏడాదిగా స్పెషల్  ఆఫీసర్ల పాలనలో ఉన్న మున్సిపాలిటీలకు కొత్త  చైర్ పర్సన్, వైస్  చైర్ పర్సన్లు వచ్చారు. కొత్తగా ఏర్పాటైన పలు బల్దియాలకు సైతం పాలకవర్గాలు ఏర్పాటయ్యాయి. చాలా బల్దియాల్లో కౌన్సిలర్లు కొత్త వారు ఎక్కువగా ఎన్నికయ్యారు. పట్టణాల్లో పెండింగ్ లో ఉన్న వివిధ అభివృద్ధి పనులు పూర్తి చేయించడంతో పాటు మౌలిక వసతులు మెరుగు పర్చడం, పాలనా యంత్రాంగాన్ని గాడిలో పెట్టాల్సిన బాధ్యత కొత్త పాలక వర్గాలపై ఉంది. కొత్త చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు పట్టణ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మెదక్​ జిల్లాలో..

మెదక్​ పట్టణంలో రూ.6 కోట్లకు పైగా ఖర్చుచేసి నిర్మించిన రైతు బజార్​ అసంపూర్తిగా ఉంది. రూ.4.50 కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్​ మార్కెట్​ పిల్లర్ల దశలో ఆగిపోయింది. రూ.20 కోట్లతో చేపట్టిన మినీ ట్యాంక్ బండ్  పనులు అసంపూర్తిగా ఉన్నాయి. పట్టణంలో ఒక్క పార్క్​ కూడా లేదు. ఇక పట్టణానికి బైపాస్​ రోడ్డు అవసరం ఉంది. పట్టణ శివారులో చేపట్టిన డబుల్​ బెడ్రూమ్​ కాలనీలో అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. మరో 500 ఇండ్లు అసంపూర్తిగా ఉండగా, ఆ పనులు పూర్తి చేసి పంపిణీ చేయాల్సి ఉంది.

తూప్రాన్ లో పెద్ద చెరువు కట్టను సుందరీకరణ చేసేందుకు ఐదేళ్ల కింద రూ.5 కోట్లతో ప్రపోజల్స్​ రెడీ చేశారు. గత ప్రభుత్వంలో చెరువుకట్ట సమీపంలో రూ.75 లక్షలతో అర్బన్  పార్క్  పనులను ప్రారంభించారు. కాంపౌండ్​ వాల్​ పనులు చేపట్టి నిలిపివేశారు. సుందరీకరణ పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. 504 డబుల్  బెడ్రూం ఇండ్లలో 400 పైగా ఇళ్లను పూర్తి చేయగా, మిగిలిన వాటి పనులు నిధులు సరిపోక ఆపేశారు. పట్టాలు పొందిన లబ్ధిదారుల్లో  కొందరు మిగిలిన పనులు పూర్తి చేసుకోగా, ఆర్థిక స్థోమత సరిగా లేనివారు ఎప్పుడు కట్టిస్తారోనని ఆశతో ఎదురుచూస్తున్నారు. పలు వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించి, నిధులు సరిపోక ఆపేశారు.

అసంపూర్తి పనులతో రెండేళ్లుగా ప్రజలు తిప్పలు పడుతున్నారు. రామాయంపేటలోని మెదక్  చౌరస్తా నుంచి ఎస్సీ కాలనీ ఇందిరమ్మ విగ్రహం వరకు రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. పాత హైవే విస్తరించి డివైడర్ తో పాటు సెంట్రల్  లైటింగ్  సిస్టం ఏర్పాటు చేయాల్సి ఉంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక చిన్నపాటి వర్షానికే వరద నీరు ఇళ్లలోకి చేరుతోంది. రూ.60 లక్షలతో చేపట్టిన వైకుంఠధామం పనులు  అసంపూర్తిగా ఉన్నాయి. 

సిద్దిపేట జిల్లాలో..

చేర్యాల అంబేద్కర్​ సెంటర్​లో వెజ్,  నాన్​ వెజ్​ మార్కెట్  కాంప్లెక్స్​ ప్రారంభానికి నోచుకోలేదు. మున్సిపల్​ ఆఫీస్​కు కొత్త బిల్డింగ్​ అవసరం ఉంది. హుస్నాబాద్ లో వెజ్ అండ్  నాన్  వెజ్  మార్కెట్, ఫిష్ మార్కెట్  నిర్మాణం పెండింగ్ లో ఉంది. వర్షం పడినప్పుడు మెయిన్  రోడ్డులోని షాపుల్లోకి వరద నీరు చేరకుండా డ్రైనేజీ నిర్మించాల్సిన అవసరం ఉంది. గజ్వేల్​ పట్టణం చుట్టూ చేపట్టిన రింగ్​ రోడ్డు అసంపూర్తిగా ఉంది. పట్టణంలోని పలు కాలనీల్లో ఇంటర్నల్​ రోడ్లు అధ్వానంగా మారాయి. అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ పనులు సక్రమంగా జరగక ఇబ్బంది పడుతున్నారు. దుబ్బాకలో డంప్​ యార్డ్​ నిర్మించినా వినియోగించడం లేదు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు చెరువుల్లోకి చేరి కలుషితం అవుతోంది.

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి పట్టణంలో స్పెషల్  ఆఫీసర్  పాలనలో అక్రమంగా పెరిగిన నల్లా కనెక్షన్లను క్రమబద్దీకరించాల్సి ఉంది. ప్రాపర్టీ ట్యాక్స్ ల వ్యవహారంలో అక్రమాలను, మున్సిపల్ ఆఫీసులో పాలనను గాడిలో పెట్టాలి. జహీరాబాద్ లో విలీనం చేసిన అల్లీపూర్, పస్తాపూర్, హోతి- కే, చిన్న హైదరాబాద్  గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్లమ్  ఏరియాల్లో మురికి కాలువల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. అందోల్- - జోగిపేట బల్దియాకు సొంత బిల్డింగ్  లేదు. వెటర్నరీ బిల్డింగ్ లో ప్రస్తుతం ఆఫీస్  కొనసాగుతోంది. సీసీ రోడ్లు, అండర్  గ్రౌండ్  డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేయాలి. సదాశివపేట, నారాయణఖేడ్, గడ్డపోతారం మున్సిపాలిటీల్లో తాగు నీరు, డ్రైనేజీ సమస్యలున్నాయి.

బల్దియాల్లోని పలు వార్డుల్లో స్ట్రీట్​ లైట్లు సైతం వెలగడం లేదు. ఖేడ్  పట్టణానికి బైపాస్  రోడ్డు అవసరం. ఇంద్రేశం మున్సిపాలిటీకి సొంత భవనం కావాలి. ఇక్కడ కబ్జాలను నియంత్రించాల్సి ఉంది. జిన్నారం మున్సిపాలిటీ పూర్తిగా గ్రామాలతో ఏర్పడడంతో వ్యాపార కూడళ్లను అభివృద్ధి చేయాల్సి ఉంది. అండర్  గ్రౌండ్  డ్రైనేజీ సమస్య, సీసీ రోడ్ల నిర్మాణం, ఎల్ఈడీ లైట్ల సమస్యకు తోడు తాగునీటి అవసరాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలతో కాలుష్యం పెరిగిపోతోంది. వ్యర్థ జలాలు గ్రౌండ్  వాటర్ లో కలిసి తాగు నీరు కలుషితమవుతోంది.