
న్యూఢిల్లీ: దేశంలోని సిటీలలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరిగేలా కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త పాలసీలో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీకి భారీ ప్యాకేజ్ ఉంటుందని ప్రైమ్ మినిస్టర్ ఎడ్వైజర్ తరుణ్ కపూర్ మంగళవారం వెల్లడించారు. చాలా సిటీలలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు అంతంత మాత్రంగా ఉన్నట్లు ఒక స్టడీలో తేలిందని, దీంతో కొత్త పాలసీ రూపకల్పనకు ప్రభుత్వం నడుం బిగించిందని పేర్కొన్నారు. కొత్త పాలసీలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు పెద్ద పీట వేయనున్నామని, డీజిల్ వెహికల్స్‌కు చోటు ఉండదని తరుణ్ కపూర్ స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీదారులకు ఈ కొత్త పాలసీ మంచి బూస్ట్ ఇస్తుందని హామీ ఇచ్చారు. డీజిల్ బస్సులు కనుమరుగవడమే కాకుండా, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం పెరుగుతుందని వివరించారు. ఎలక్ట్రిక్ మొబిలిటీపై జరిగిన ఒక కార్యక్రమంలో తరుణ్ కపూర్ మాట్లాడారు.
ఈవీ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారాలి....
ఇండియాలోని రోడ్లపై ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, టూ వీలర్లు ఎక్కువగా పరిగెడుతుంటే చూడాలని ప్రభుత్వం కోరుకుంటోందని, దీంతోపాటు గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గానూ దేశం మారాలని ఆశిస్తోందని తరుణ్ కపూర్ వెల్లడించారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుకు ఎలక్ట్రిక్ బస్సుల వాడకం మొదలైందని, కానీ ఇది మరింత జోరుగా సాగాలని ఆయన పిలుపు ఇచ్చారు. రాబోయే 5–7 ఏళ్లలో దేశంలోని టూ వీలర్లన్నీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అవ్వాలని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. టూ వీలర్లు ఎలక్ట్రిక్ అయితే పెట్రోల్ వినియోగం భారీగా తగ్గిపోతుందని వివరించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు పెద్ద మార్కెట్ కానున్న నేపథ్యంలో ఈవీల రేట్లు మరింత అందుబాటులోకి వచ్చేలా చొరవ తీసుకోవాలని ఈవీ ఇండస్ట్రీని ఆయన కోరారు. ప్రభుత్వ ఇన్సెంటివ్‌లు ఒక లెవెల్ వరకే సాయపడతాయని పేర్కొన్నారు. ట్యాక్సేషన్, పాలసీ రిఫార్మ్స్ వంటి అంశాలలో తమకు ఏమి కావాలో ఈవీ ఇండస్ట్రీ సలహాలు ఇవ్వచ్చని అన్నారు. ట్రక్కులు, కార్ల సెగ్మెంట్లలోనూ దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని కపూర్చెప్పారు. ప్రభుత్వ మద్దతుతో దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగం దూసుకుపోతుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కన్జూమర్లకు ఈవీలపై ఆసక్తి మెండుగా కనిపిస్తోందని పేర్కొన్నారు. కన్జూమర్లకు ఆప్షన్లు పెరగడంతోపాటు, రేట్లు కొంత తగ్గితే మేలని అభిప్రాయపడ్డారు. బ్యాటరీ మాన్యుఫాక్చరింగ్ వాల్యూ చెయిన్‌లో అన్ని విభాగాలలోనూ పెట్టుబడులు పెంచాలని ఈవీ ఇండస్ట్రీని కోరారు.
టూ వీలర్స్‌లో మనమే నెంబర్1.....
మన ఆటోమొబైల్ ఇండస్ట్రీ సైజు రూ. 10 లక్షల కోట్లని హెవీ ఇండస్ట్రీస్ సెక్రటరీ కమ్రాన్ రిజ్వి చెప్పారు. టూ వీలర్లలో మనది గ్లోబల్‌గా నెంబర్ 1 పొజిషన్, త్రీవీలర్లలో నెంబర్ 2 పొజిషన్, కార్లలో నెంబర్ 4 పొజిషన్లో నిలుస్తున్నామని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలోనూ ఇలాగే మనం టాప్ ప్లేస్‌కు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. తక్కువ బరువుండేలా బ్యాటరీలు తయారు చేయాలని సూచించారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్‌కు మద్దతు ఇచ్చేందుకు ఫేమ్, పీఎల్ఐ స్కీములు అమలులోకి తెచ్చామని చెబుతూ, ఇంకేమి కావాలో ఇండస్ట్రీ సలహా ఇవ్వాలని అన్నారు. ఏటా ఇచ్చే ఇన్సెంటివ్ తగ్గినా పర్లేదని , కానీ ఫేమ్3 ఇన్సెంటివ్స్ స్కీమును కనీసం అయిదేళ్ల కాలానికి తేవాలని ఫిక్కి ఎలక్ట్రిక్ వెహికల్ కమిటీ ఛెయిర్ సులజ్జ ఫిరోదియా మోత్వాని ప్రభుత్వాన్ని కోరారు. ఇన్సెంటివ్స్ను అకస్మాత్తుగా తగ్గించడం వల్ల ఈవీల రేట్లు హఠాత్తుగా పెరుగుతాయని....ఫలితంగా మూమెంటమ్ దెబ్బతింటుందని పేర్కొన్నారు. పీఎల్ఐ స్కీమును రివైజ్ చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బ్యాటరీలపై జీఎస్టీని ఇప్పుడున్న 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని సులజ్జ ఫిరోదియా మోత్వాని కోరారు.
రేట్లు, బ్యాటరీ సైజు తగ్గాలి
ఎలక్ట్రిక్ వెహికల్స్ రేట్లు , బ్యాటరీ సైజు తగ్గేలా ఇన్నొవేషన్‌పై ఫోకస్ పెట్టాలని ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీకి తరుణ్ కపూర్ సలహా ఇచ్చారు. కొన్ని స్కాండినేవియన్, యూరోపియన్ దేశాలలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం జోరు పెరిగిందని, ఇప్పుడు మనం కూడా మన దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకం పెరిగేలా చొరవ తీసుకోవాలని ఆయన చెప్పారు. ఎనర్జీ సెక్యూరిటీ దృష్ట్యా తప్పనిసరిగా ఇండియా ఈవీల వినియోగం పెరిగేలా శ్రద్ధ వహించాల్సి ఉందన్నారు. దేశానికి అవసరమైన క్రూడ్‌లో 85 శాతాన్ని, నేచురల్ గ్యాస్‌లో 50 శాతాన్ని దిగుమతుల ద్వారానే సమకూర్చుకుంటున్న విషయాన్ని కపూర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. గ్లోబల్‌గా పొల్యూషన్ ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలోని ఎక్కువ నగరాలు మన దేశంలోనే ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు మళ్లడం తప్ప వేరే ప్రత్యామ్నాయం మనకి లేనే లేదని పేర్కొన్నారు.