Rishab Shetty: 'కాంతార: చాప్టర్ 1' రికార్డుల విధ్వంసం.. రూ. 1000 కోట్ల దిశగా కలెక్షన్స్!

Rishab Shetty: 'కాంతార: చాప్టర్ 1' రికార్డుల విధ్వంసం.. రూ. 1000 కోట్ల దిశగా కలెక్షన్స్!

కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంతో తెరకెక్కించిన పాన్ ఇండియా  చిత్రం 'కాంతార: చాప్టర్ 1' .  దసరా పండుగ సందర్భంగా ఆక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఇప్పుడు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రోజుకో  సరికొత్త రికార్డును సృష్టిస్తూ దూసుకుపోతోంది.  థియేటర్లలో కాసుల వర్షం కురుస్తోంది. రెండు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 717.50 కోట్లను వసూళ్లు చేసింది. ఒక్క తెలుగులోనే రూ.108 కోట్లకు పైగా రాబట్టింది. అటు హిందీలోనూ అత్యధిక వసూళ్లు రాబడుతూ... వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. 

అంచనాలకు మించి రికార్డులు..

మూడేళ్ల క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన 'కాంతార 'మూవీ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కేవలం రూ. 20 కోట్లతో నిర్మిస్తే.. ఏకంగా రూ. 450 కోట్లు రాబట్టింది. ఇప్పుడు 'కాంతార: చాప్టర్ 1' రికార్డులను బద్దలు కొట్టి దూసుకెళ్తోంది. తొలి భాగం 'కాంతార' సాధించిన జీవితకాల వసూళ్లను కేవలం ఆరు రోజుల్లోనే దాటేసింది ఈ కన్నడ పీరియాడిక్ యాక్షన్ చిత్రం. 2 గంటల 29 నిమిషాల నిడివితో ప్రేక్షకులను కట్టిపడేస్తూ.. బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ చిత్రాలను సైతం బోల్తా కొట్టించి దూసుకెళ్తోంది. 

కథాంశం..

హోంబాలే ఫిల్మ్స్ (KGF ఫేమ్) నిర్మాణంలో రిషబ్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, 2022 బ్లాక్‌బస్టర్ 'కాంతార'కు ప్రీక్వెల్ గా వచ్చింది. ఇది క్రీ.శ. 300లో కదంబ రాజవంశం కాలంలో అడవులు, తెగల మధ్య సంఘర్షణ, ఆధ్యాత్మిక సంప్రదాయాలు, భూత కోల ఆచారాల మూలాలను అన్వేషిస్తుంది. రిషబ్ శెట్టి శక్తివంతమైన యోధుడు బెర్మే అనే నాగ సాధువు పాత్రలో నటించగా, జయరామ్ విజయేంద్ర రాజుగా, రుక్మిణి వసంత్ కనకవతిగా,  గుల్షన్ దేవయ్య కులశేఖరగా నటించారు.

ఈ చిత్రం కేవలం విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కోసమే కాక, దానిలోని ఆధ్యాత్మిక లోతు, సాంస్కృతిక ప్రాతినిధ్యం కోసం సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశంసలు అందుకుంటోంది. 'కాంతార' ఫ్రాంచైజీ కేవలం వినోదం మాత్రమే కాక, మన సజీవ వారసత్వం, విశ్వాసం యొక్క ప్రతీకగా నిలిచిందని సినీ ప్రియులు అభినందిస్తున్నారు.