
- ఈ నెల 14 నుంచి పంపిణీ
- సెప్టెంబర్ నుంచి కొత్త కార్డులపై బియ్యం సరఫరా
మెదక్/సిద్దిపేట/సంగారెడ్డి, వెలుగు: ఏండ్లుగా ఎదురుచూస్తున్నవారికి ఎట్టకేలకు కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 52,835 కార్డులు ఇవ్వనున్నారు. అలాగే, పాత కార్డుల్లో 1,74, 124 మంది పేర్లను కొత్తగా చేర్చారు. దీంతో పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల14వ తేదీ నుంచి కొత్త కార్డులు పంపిణీ చేయనున్నారు. కాగా ఈ లబ్ధిదారులు రేషన్‌బియ్యం కోసం మరో రెండు నెలలు వేచివుండాల్సిందే. జూన్ నెలలో మూడు నెలల బియ్యం పంపిణీ చేసిన నేపథ్యంలో మళ్లీ సెప్టెంబర్ నెలలోనే ఇవ్వనున్నారు.
మెదక్ జిల్లాలో..
జిల్లాలోని 21 మండలాల పరిధిలో 520 రేషన్ షాపులు, 2,16,716 ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. మొత్తం 7,31,890 మంది లబ్ధిదారులున్నారు. వీరికి ప్రతీ నెల 4,522 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. పాత కార్డుల్లో 35,573 మంది చేరగా.. కొత్తగా 11,737 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. వీటికి అనుగుణంగా నెలవారీ రేషన్ బియ్యం కోటా పెరగనుంది.
సిద్దిపేట జిల్లాలో..
మొత్తం 685 రేషన్ షాపులు, 2,98,985 రేషన్ కార్డులు ఉన్నాయి. లబ్ధిదారులకు ప్రతీ నెల 6.95 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో కొత్తగా27,648 కార్డులు అప్రూవ్అవగా, పాత కార్డుల్లో 74,551 మంది యాడ్ అయ్యారు. వచ్చిన దరఖాస్తుల్లో 1,500 అర్జీలను వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించారు.
సంగారెడ్డి జిల్లాలో..
జిల్లాలో మొత్తం 846 రేషన్ షాపులు, 3,81,017 కార్డులున్నాయి. కొత్తగా13,450 రేషన్ కార్డులు మంజూరయ్యాయి. పాత కార్డుల్లో 64 వేల మంది పేర్లను చేర్చారు.