హైదరాబాద్‌లో కొత్త రేషన్ కార్డులు మంజూరైన లబ్ధిదారులకు గుడ్ న్యూస్

హైదరాబాద్‌లో కొత్త రేషన్ కార్డులు మంజూరైన లబ్ధిదారులకు గుడ్ న్యూస్
  •  ఈనెల 20 వరకూ మంజూరైన కార్డులకు కూడా పంపిణీ  
  • నగర పరిధిలోనే 14,488 మెట్రిక్​ టన్నుల కోటా

హైదరాబాద్​సిటీ, వెలుగు:  గ్రేటర్ ​పరిధిలో కొత్తగా మంజూరైన రేషన్ ​కార్డుల లబ్ధిదారులతో పాటు పాతవారికీ సెప్టెంబర్​కోటా సిద్ధమైందని అధికారులు తెలిపారు. ఈనెల 20వ తేదీలోపు మంజూరైన కొత్త రేషన్​కార్డుల లబ్ధిదారులకు సైతం సెప్టెంబరు నుంచి  సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.

 గ్రేటర్ పరిధిలో ఆగస్టు 20వ తేదీ నాటికి కొత్తగా లక్ష రేషన్​కార్డులు మంజూరైనట్టు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో గత జూన్​ నెలలోనే మూడు నెలల బియ్యం కోటాను అధికారులు పంపిణీ చేశారు. తర్వాత రెండు నెలలుగా అధికారులు కొత్త రేషన్​కార్డుల మంజూరుపైనే దృష్టి పెట్టారు.

1 నుంచి 15వ తేదీ వరకు..

హైదరాబాద్​కోర్​సిటీలోని 9 సర్కిళ్ల పరిధిలోనే సెప్టెంబరు నెలలో 7,12,352  రేషన్​కార్డులకు సంబంధించి 14,488 మెట్రిక్​టన్నుల బియ్యాన్ని సరఫరా చేయనున్నట్టు హైదరాబాద్ డీఎస్​ఓ శ్రీనివాస్​ తెలిపారు. వచ్చేనెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ సరుకుల పంపిణీ ఉంటుందన్నారు.

మేడ్చల్​, రంగారెడ్డి, సంగారెడ్డి పరిధిలో దాదాపు 7.5 లక్షల రేషన్​షాపులకు కూడా కేటాయింపులు పూర్తయ్యాయన్నారు. ప్రస్తుతం గ్రేటర్​పరిధిలో కొత్త రేషన్​కార్డుల వెరిఫికేషన్​ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికీ దాదాపు లక్ష దరఖాస్తులు వెరిఫికేషన్​ కోసం పెండింగ్​లో ఉన్నట్టు అధికారులు తెలిపారు.