
తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచంలోనే కీలకమైందన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. నిజాం సర్కార్ చేస్తున్న దౌర్జన్యాలపై చాకలి ఐలమ్మ పోరాడిందన్నారు. ఆమె స్పూర్తితో తాము పోరాటాలకు సిద్ధం అవుతున్నామన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా కామారెడ్డి జిల్లాలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..సీఎం కేసీఆర్ తెచ్చిన నూతన రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే నూతన చట్టంలో ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయన్నారు. కొత్త చట్టంలో కౌలు రైతుల ఊసెత్తలేదన్నారు. గతంలో ఆర్టికల్ 26 ద్వారా భూ యజమానులతో పాటు కౌలు రైతులకు కూడా పత్రాలు ఇచ్చేవారని తెలిపారు. ప్రస్తుతం ఈ చట్టంలో కౌలు రైతులు హక్కు కోల్పోతున్నారన్నారు. రైతుబంధు సమయంలో కూడా కౌలు రైతులను గుర్తించలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నుంచి కౌలు రైతులకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. గత కొద్దికాలంగా రెవెన్యూ సంస్కరణలు తెస్తామంటూ సీఎం కేసీఆర్ ఉదరగొడుతూ వచ్చారు…ఈ చట్టంలో రెవిన్యూ లోపాలు, కుంభకోణాల జోలికి వెళ్ళలేదన్నారు. అలాగే ఆలయ భూములు, వక్ఫ్ భూములు, మిగులు భూములు, అటవిభూములు… వేలు, లక్షల ఎకరాల అన్యాక్రాంతం అయ్యాయని..వీటిని బయటకు తెచ్చేలా సమగ్ర సర్వే జరగాలన్నారు. గత 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఈ సమస్య మరుగున పడిందన్నారు.
ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కూడా భూ సర్వే చేస్తామని చెప్పి ఆరేళ్లు గడిచిన చేయలేదన్నారు తమ్మినేని. కొత్తగా భూ సర్వే చేపట్టాలన్నా అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు. అవినీతి, అక్రమ అధికారులు ఉంటే వారిపై దావా వేయడానికి రైతులు కోర్టుకు వెళ్లే అవకాశాన్ని ఈ చట్టం తీసేసిందన్నారు. వారసత్వ భూములకు ఫీజు కట్టాలని చట్టంలో తెచ్చారని.. ఫీజు భారీగా ఉంటుంది కాబట్టి ఇది రైతులకు భారంగా మారుతుందన్నారు. LRS జీవో 111 ప్రకారం అక్రమార్కుల జోలికి వెళ్లడం లేదన్నారు. ఎకరాల కొద్ది ఆక్రమించిన వారిని వదిలి చిన్న చిన్న ప్లాట్లను చేసుకున్న వారి జోలికి వెళ్తున్నారని ఆరోపించారు. సామాన్యుల నుంచి భూమి రేటు ఎంత ఉందో అంత వసూలు చేయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్నారు తమ్మినేని.