గిరిజన సంక్షేమ శాఖలో ప్రమోషన్లకు కొత్త రూల్స్!

గిరిజన సంక్షేమ శాఖలో ప్రమోషన్లకు కొత్త రూల్స్!
  • ఉద్యోగ ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా పదోన్నతుల జాబితా
  • సీనియారిటీ, రిజర్వేషన్లను పక్కనపెట్టడంపై తీవ్ర విమర్శలు
  • ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ డిపార్ట్​మెంట్లో గందరగోళం

హైదరాబాద్, వెలుగు: గిరిజన సంక్షేమ శాఖలో ప్రమోషన్లకు కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ డిపార్ట్​మెంట్​లో ఖాళీగా ఉన్న నాలుగు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల (ఈఈ) పోస్టుల భర్తీకి కొత్త సీనియారిటీ లిస్ట్ తయారు చేశారు. ఇంజినీర్లుగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరినప్పుడు ప్రవేశ పరీక్షలో వచ్చిన అత్యధిక మార్కుల ఆధారంగా పదోన్నతుల జాబితా సిద్ధం చేశారు. 20 ఏండ్లకు పైగా పనిచేసిన సర్వీస్, రోస్టర్ పాయింట్లను లెక్కలోకి తీసుకోవట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా రూపొందించిన లిస్ట్​ను డిపార్ట్​మెంటల్​ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)కి పంపించారు. డీపీసీ ఆమోదం లభిస్తే ఈ లిస్ట్ ఆధారంగానే ప్రభుత్వం ప్రమోషన్లు ఇవ్వనుంది. దీంతో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ డిపార్ట్​మెంట్​లో  తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగుల సర్వీస్ సీనియారిటీ, రిజర్వేషన్లను పక్కన పెట్టారంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఏఈఈలుగా 2005లో ఒకేసారి జాయినింగ్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ 11/2004 ఆధారంగా నిర్వహించిన ఎగ్జామ్​లో జాగ జ్యోతి, హేమలత, ఎం.బాలు, ఫణి కుమారి ఏఈలుగా సెలక్ట్ అయ్యారు. అందరూ ఒకేసారి జూలై 2005లో ఉద్యోగంలో చేశారు. ఫణి కుమారి ఆరో జోన్​లో  పనిచేయగా మిగిలిన ముగ్గురు ఐదో జోన్​లో పనిచేశారు. వీరికి సర్వీస్ సీనియారిటీ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోనే 2009లో డిప్యూటీ డీఈలుగా పదోన్నతులు లభించాయి. నాలుగేండ్ల తర్వాత ఈఈ ప్రమోషన్ల కోసం ఉమ్మడి రాష్ట్రంలోనే  2012–13లో సీనియారిటీ లిస్ట్ రెడీ చేసి అనెక్జర్–2 రిలీజ్ చేసింది. ఈ సీనియారిటీ లిస్ట్ల్​లో జాగ జ్యోతి 43, హేమలత 44, బాలు 45, ఫణికుమారి 47 నంబర్లలో ఉన్నారు. ఈ లిస్ట్ ఆధారంగా వీరిలో కొందరికి అప్పుడే ఇన్​చార్జ్​ ఈఈలుగా అవకాశం ఇచ్చి పనిచేయించారు. 

తెలంగాణలో ఉన్నది 15 మంది డీఈఈలే!
ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్​లో 15 మంది డీఈఈలుగా పనిచేస్తున్నారు. సీనియర్లు అయిన వారిలో బాలు ప్రస్తుతం హైదరాబాద్ ఇన్​చార్జ్​ చీఫ్ ఇంజినీర్, హేమలత హైదరాబాద్ ఇన్​చార్జ్​ ఎస్​ఈ, ఫణి కుమారి వరంగల్ ఇన్​చార్జ్​ఎస్ఈ, జె.జ్యోతి ఇన్​చార్జ్​ ఈఈ గా పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ డిపార్ట్​మెంట్​లో నలుగురికి పర్మినెంట్ ఈఈ లుగా  ప్రమోషన్లు ఇవ్వడానికి నిర్ణయించింది. అయితే సీనియారిటీ లిస్ట్ తయారీ దగ్గర అసలు సమస్య వచ్చింది.

ఉద్యోగ  ప్రవేశ  పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా పదోన్నతుల జాబితా
ఎప్పుడో 20 ఏండ్ల కిందట ఉద్యోగ ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ఇప్పుడు పదోన్నతుల జాబితా తయారు చేసి డిపార్ట్ మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)కి పంపించారని ఆరోపణలు వచ్చాయి. పాత సీనియారిటీ లిస్ట్ ప్రకారం మూడో స్థానంలో ఉన్న బాలు ప్రస్తుతం ఇన్​చార్జ్​ చీఫ్ ఇంజినీర్​గా పనిచేస్తుండం వల్ల ఆయన పేరు ఫస్ట్, ఓసీ అయినప్పటికీ నాలుగో స్థానంలో ఉన్న ఫణి కుమారి పేరు సెకండ్, ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మొదటి స్థానంలో ఉన్న జాగ జ్యోతి పేరు మూడు, రెండో స్థానంలో ఉన్న హేమలత పేరు నాలుగో స్థానంలోకి మారిపోయింది. 

కారణం ఏంటంటే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ 11/2004 ఆధారంగా నిర్వహించిన ఏఈఈ సెలక్షన్ ఎగ్జామ్స్ లో బాలుకి 288, ఫణి కుమారికి 288, జాగ జ్యోతికి 281, హేమలతకు 275 మార్కులు వచ్చాయని వీటి ఆధారంగా సీనియారిటీ లిస్ట్ మార్చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. 2018లో డీఈఈగా పదోన్నతి పొందిన బీసీ క్యాండెట్ ప్రవీణ పేరు కంటే ముందుగా 2021లో డీఈఈలు అయిన మధుకర్, రాజు పేర్లు చేర్చడంతో ఎనిమిదో స్థానంలో ఉండాల్సిన ప్రవీణ పేరు 11వ ప్లేస్​లోకి మారిందని అంటున్నారు.  

సీఎంకు కంప్లైంట్ చేసిన ఇన్​చార్జ్​ ఈఈ జ్యోతి
ఈఈ పదోన్నతులకు సంబంధించి తయారుచేసిన డీఈఈల సీనియారిటీ లిస్ట్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అదే డిపార్ట్ మెంట్​లో ఇన్​చార్జ్​ ఈఈగా పనిచేస్తున్న జాగ జ్యోతి ఇటీవల సీఎం రేవంత్ కార్యాలయంలో  కంప్లైంట్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలు, కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా తయారుచేసి డీపీసీకి పంపిన సీనియారిటీ లిస్ట్​ను రద్దు చేయాలని కోరారు. ఒక్క రోజు కూడా ఇన్​చార్జ్​ ఎస్ఈగా బాధ్యతలు నిర్వర్తించకుండా డైరెక్ట్​గా ఇన్​చార్జ్​ చీఫ్ ఇంజినీర్​గా నియమితులై పనిచేస్తున్న బాలు తనకు అనుకూలంగా సినియారిటీ లిస్ట్ తయారుచేసి డీపీసీకి పంపించారని ఆ కంప్లైంట్లో జ్యోతి ఆరోపించారు.