న్యూఢిల్లీ: గల్వాన్ ఘర్షణ తర్వాత ఇండో–చైనా సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగాయి. పలు దఫాల సైనిక చర్చల తర్వాత ఇరు దేశాల దళాలు వెనక్కి తగ్గడంతో పరిస్థితి చక్కబడినట్టే కనిపించింది. కానీ ఎల్‌వోసీ వెంబడి చైనా సుమారు 1 లక్ష మంది జవాన్లను మోహరించడం పరిస్థితిని మళ్లీ మొదటికి తెచ్చింది. ఇండియా కూడా లడఖ్‌తోపాటు సరిహద్దుల్లో దళాలను మోహరించిందని సమాచారం. అయితే తాజాగా ఒక ఓపెన్ సోర్స్ శాటిలైట్ ఇమేజరీలో నేపాల్‌తో మన సరిహద్దు ప్రాంతమైన లిపులేఖ్‌లో చైనా మిలటరీ నిర్మాణాలను చేపట్టినట్లు తెలుస్తోంది.
ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ రీజియన్‌కు వ్యతిరేక దిశలో డ్రాగన్ ఈ నిర్మాణాలను చేపట్టినట్లు సమాచారం. పీఎల్‌ఏ దళాలను లిపులేఖ్ పాస్‌కు సమీపంలో చైనా మోహరించినట్లు తెలుస్తోంది. గత కొన్ని వారాలుగా ఈ కదలికలు పెరిగినట్లు సమాచారం. డెట్రెస్ఫా అనే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్, ట్విట్టర్ యూజర్ బయట పెట్టిన శాటిలైజ్ చిత్రాల ప్రకారం.. రెండు ప్రాంతాల్లో పీఎల్‌ఏ నిర్మాణాలు చేపడుతోంది. ఈ రెండు ప్రాంతాలు ఇండియా–నేపాల్ బార్డర్‌లో కీలకంగా మారిన కాలాపానీ–లిపులేఖ్ రీజియన్‌కు అతి సమీపంలో ఉండటం గమనార్హం. టిబెట్‌లోని మానససరోవర్ నదీ తీరాల్లో ఈ నిర్మాణాలు చేపట్టారని సమాచారం.
