కొత్త ఆఫీస్​ స్పేస్​ రెట్టింపయింది

 కొత్త ఆఫీస్​ స్పేస్​ రెట్టింపయింది

న్యూఢిల్లీ: తక్కువ బేస్  ఎఫెక్ట్,  డిమాండ్ పెరగడంతో ఏడాది లెక్కన 2022 జనవరి-–జూన్‌‌‌‌లో కొత్త ఆఫీస్​ స్పేస్​ రెట్టింపయింది. దేశంలోని ఆరు నగరాల్లో 23.7 మిలియన్ చదరపు అడుగుల కొత్త ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది.  2021 జనవరి--–జూన్‌లో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే, ముంబై,  ఢిల్లీ–-ఎన్​సీఆర్ నగరాల్లో  12.1 మిలియన్ చదరపు అడుగుల సరఫరా ఉందని కొలియర్స్​ రిపోర్టు తెలిపింది. దీని  డేటా ప్రకారం...  చెన్నైలో  కొత్త సరఫరా 2021 జనవరి–-జూన్​లో 0.4 మిలియన్ చదరపు అడుగుల నుండి 2022 జనవరి–-జూన్‌‌లో 4.2 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది.  ఢిల్లీ–-ఎన్​సీఆర్​లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆఫీస్‌ స్పేస్‌ 1.5 మిలియన్ చదరపు అడుగుల నుండి 2.4 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది.  2022 మొదటి ఆరు నెలల్లో హైదరాబాద్‌‌లో ఆఫీస్​ స్పేస్​ లభ్యత 1.9 మిలియన్ చదరపు అడుగుల నుండి 6.4 మిలియన్ చదరపు అడుగులకు.. అంటే మూడు రెట్లు పెరిగింది.

ముంబైలో ఇది 0.8 మిలియన్ చదరపు అడుగుల నుండి 1.1 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. పూణేలో 2022 జనవరి-–జూన్ లో 3.8 మిలియన్ చదరపు అడుగుల జాగా అందుబాటులోకి వచ్చింది.  బెంగళూరులో మాత్రం ఇది 7.3 మిలియన్ చదరపు అడుగుల నుండి 5.7 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయింది.    డిమాండ్ పరంగా చూస్తే ఈ ఏడాది జనవరి–-జూన్ లో, ఆఫీస్ స్పేస్ గ్రాస్​ లీజింగ్ ఆరు నగరాల్లో 2.5 రెట్లు పెరిగి 27.5 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. ఇది మునుపటి సంవత్సరం ఇదే కాలంలో 10.3 మిలియన్ చదరపు అడుగులుగా రికార్డయింది. గడచిన రెండేళ్లుగా కార్పొరేట్లకు ఉన్న చాలా సమస్యలు పరిష్కారమయ్యాయని, అందుకే ఇప్పుడు భారీ విస్తరిస్తున్నాయని కొల్లియర్స్ ఇండియా సీఈఓ రమేష్ నాయర్ తెలిపారు.  పోయిన క్వార్టర్​లో 18 శాతంగా ఉన్న ఆఫీస్ స్పేస్ సగటు ఖాళీ జూన్ క్వార్టర్​ చివరి నాటికి 17 శాతానికి చేరుకుందని ఆయన వివరించారు.