రైలు ప్రమాదాల నివారణకు కొత్త టెక్నాలజీ

రైలు ప్రమాదాల నివారణకు కొత్త టెక్నాలజీ

తొలిసారి మన దగ్గరే అమలు
ఉమ్రి-సివున్ గావ్ స్టేషన్ల మధ్య ప్రారంభం

హైదరాబాద్‌‌, వెలుగు: రైలు ప్రమాదాల నివారణకు దక్షిణ మధ్య రైల్వే కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. రైళ్లు ఒకదానికొకటి ఢీకొనకుండా నివారించే ట్రైన్‌‌ కొలిజన్ అవైడెన్స్ సిస్టమ్ (టికాస్)ను రైల్వేలోనే తొలిసారి ప్రారంభించింది. హైదరాబాద్‌‌ డివిజన్‌‌లో ముద్కేడ్‌‌– సికింద్రాబాద్‌‌ సెక్షన్‌‌లో ఉమ్రి– సివున్‌‌గావ్‌‌ స్టేషన్ల మధ్య 21.5 కిలోమీటర్ల మేర టికాస్ ను శుక్రవారం సక్సెస్ ఫుల్ గా స్టార్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్​ను మెస్సర్స్‌‌ మేథా కంపెనీ చేపట్టింది. టికాస్ ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే డెవలప్ చేశారు. ఇంతకుముందు లింగంపల్లి–వికారాబాద్‌‌–వాడీ, వికారాబాద్‌‌– బీదర్‌‌ సెక్షన్ల మధ్య టికాస్‌‌ ట్రయల్స్‌‌ ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. దీన్ని జోనల్‌‌ రైల్వేల్లో అమలు చేయాలని బోర్డు సూచించడంతో మన్మాడ్‌‌–నాందేడ్‌‌– సికింద్రాబాడ్‌‌–డోన్‌‌– గుంతకల్‌‌, బీదర్‌‌ – పర్లి – పర్బని సెక్షన్ల మధ్య 1,200 కి.మీ. పొడవున చేపట్టేందుకు అనుమతులు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా ఉమ్రి – సివున్‌‌గావ్‌‌ మధ్య ప్రారంభించారు.

టికాస్ తో లాభాలివీ…

టికాస్‌‌.. ఆటోమేటిక్‌‌ ట్రైన్‌‌ ప్రొటెక్షన్‌‌ (ఏటీపీ) సిస్టమ్. దీనిని లోకో పైలట్‌‌ క్యాబిన్‌‌లో ఏర్పాటు చేస్తారు. ఇది లోకో పైలట్ బ్రేకులు వేయడంలో ఫెయిల్ అయినా, సిగ్నల్ పాసింగ్ కావడం లేదా రైలు నిర్దేశించిన వేగాన్ని మించి దూసుకుపోవడం తదితర సమస్యల వల్ల జరిగే ప్రమాదాలను నివారిస్తుంది. అంతేకాకుండా నాన్‌‌ ఇంటర్‌‌ లాక్డ్‌‌ లేదా నాన్‌‌ సిగ్నల్డ్‌‌ ద్వారా జరిగే ఇతర ప్రమాదాలను నివారిస్తుంది. టార్గెట్‌‌ స్పీడ్‌‌, డిస్టెన్స్‌‌, సిగ్నల్‌‌ యాస్పెక్ట్‌‌ తదితరాలను సూచిస్తుంది.

సెక్యూరిటీకి ప్రాధాన్యం.. 

రైల్వేలో భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ఆ —దిశగానే టికాస్ ను తీసుకొచ్చాం. ఉమ్రి–సివున్‌‌గావ్‌‌ స్టేషన్ల మధ్య టికాస్‌‌ సిస్టమ్ ను విజయవంతంగా ప్రారంభించాం. ఈ ప్రాజెక్ట్‌‌ అమలు చేయడంలో హైదరాబాద్‌‌ డివిజన్‌‌, సిగ్నల్‌‌ అండ్‌‌ టెలీకమ్యూనికేషన్స్‌‌ విభాగాల కృషి అభినందనీయం. మొత్తం ప్రాజెక్టును అమలు చేయడంలో ఇదే  పనితీరు కనబరచాలి.
-గజానన్‌‌ మాల్యా, జీఎం, ఎస్సీఆర్