వెలుగు ఓపెన్ పేజీ.. ఇన్వర్టెడ్ పిరమిడ్‌తో.. ఆరోగ్యకరమైన జీవనం

వెలుగు ఓపెన్ పేజీ.. ఇన్వర్టెడ్  పిరమిడ్‌తో.. ఆరోగ్యకరమైన జీవనం

అమెరికన్ల కోసం ఆహార మార్గదర్శకాలను  ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అమెరికా ప్రభుత్వం విడుదల చేస్తోంది.  మునుపటి 2020–2025  ఆహార మార్గదర్శకాలు  2020 చివరిలో విడుదల అయ్యాయి.  ప్రస్తుత 2025–2030  కాలవ్యవధిలో  అమెరికన్లు  తీసుకోవలసిన  ఆహార  మార్గదర్శకాలు ఆలస్యమైనప్పటికీ అధికారికంగా  జనవరి 7, 2026న  విడుదల చేశారు.  అమెరికన్లకు  సంభవించే  అనారోగ్యాలలో  చాలావరకు  జన్యుపరమైనవి కావు.

 ఇవి అమెరికన్  ఆహారపు అలవాట్ల  వినాశకరమైన  పర్యవసనాలు.  ఈ ఆహారపు అలవాట్లు అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు,  కార్బోహైడ్రేట్లు, చక్కెర కలిపినవి,  ఎక్కువ ఉప్పు,  హానికర కొవ్వులు, రసాయనిక యాడిటివ్‌లతో  నిండిన  ఆహారాలపై  ఆధారపడటంతోపాటు,  శ్రమలేని  జీవనశైలి కలిగి ఉండటం అనారోగ్యానికి  కారణమవుతున్నాయి.  

అమెరికన్  పెద్దలలో  70% కంటే  ఎక్కువ మంది  అధిక బరువు లేదా ఊబకాయంతో  బాధపడుతున్నారు. 12  నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు గల అమెరికన్లలో  దాదాపు ముగ్గురిలో ఒకరికి  ప్రీ డయాబెటిస్ ఉన్నది. ఆహారం -ఆధారిత  దీర్ఘకాలిక  వ్యాదులు  ఇప్పుడు పెద్దసంఖ్యలో యువ అమెరికన్లను సైనిక సేవల నుంచి  అనర్హులుగా చేస్తున్నది.  ఈ ఉద్దేశంతోనే  అమెరికన్ల కోసం  ఆహార  మార్గదర్శకాలు 
2025–2030  ప్రవేశపెట్టడం జరిగింది.

ఆరోగ్యానికి ఆహార మార్గదర్శకాలు

గత దశాబ్దాలుగా విడుదల చేసిన ఆహార మార్గదర్శకాల పిరమిడ్  నిటారుగా ఉంటే,  2025–2030 కాల వ్యవధికి సంబంధించిన ఆహార మార్గదర్శకాల  పిరమిడ్  ‘ఇన్వర్టెడ్   పిరమిడ్‌’ (తలకిందుల పిరమిడ్)గా ఉంది.  అంటే గత నిటారు పిరమిడ్​కు  పూర్తి వ్యతిరేకమయినది ఇన్వర్టెడ్  పిరమిడ్.   దీని అర్థం 2025–-2030 ఆహార మార్గదర్శకాలు గడచిన  దశాబ్దాలుగా అనుసరిస్తున్న  ఆహార మార్గదర్శకాలకు ఇది పూర్తిగా  వ్యతిరేకమైనది.  

గత దశాబ్దాలుగా ఆహార  మార్గదర్శకాలలో  బ్రెడ్,  తృణ ధాన్యాలు, బియ్యం వంటి  కార్బోహైడ్రేట్లకు,  ప్రాసెస్ చేసిన  ఆహారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వగా  కూరగాయలకు, పండ్లుకు రెండవ ప్రాధాన్యం, పాలు, పెరుగు, మాంసం, పౌల్ట్రీ, చేపలు, గుడ్లు  బీన్స్,  గింజలు వంటి  ప్రోటీన్లను కలిగిన ఆహార పదార్థాలకు మూడవ ప్రాధాన్యం.  కొవ్వులు, నూనెలు, చక్కెరలకు నాలుగో  ప్రాధాన్యం అంటే  అత్యల్ప ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. 

వృక్ష సంబంధమైన ప్రోటీన్లు 

బీన్స్, బఠాణీలు, కాయగూరలు,  చిక్కుళ్లు, గింజలు,  సోయా  మొదలగునవి  వృక్ష సంబంధమైన  ప్రోటీన్లకు ఉదాహరణ.  సాధారణంగా సంతృప్త  కొవ్వు  వినియోగం మొత్తం  రోజువారీ  కేలరీలలో 10% మించకూడదు.  శరీరానికి తగినంత నీరు అందించడం మొత్తం ఆరోగ్యానికి  ఒక  ముఖ్యమైన అంశం.  

2025-– 2030  అమెరికన్ల  ఆహార  మార్గదర్శకాలు,  గత కొన్ని సంవత్సరాలుగా   దేశవ్యాప్తంగా పేరొందిన  వీరమాచినేని రామకృష్ణ  సూచించిన ఆహార విధానం (వి.ఆర్.కె. డైట్) దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. వి.ఆర్.కె. డైట్ విదానంలో  కార్బోహైడ్రేట్లు, చక్కెర పదార్థాలు,   ప్రాసెస్ చేసిన ఆహారం అసలు తీసుకోకూడదు.  

ప్రతిరోజు ప్రోటీన్,  కొవ్వులు,  గింజలను ఆహారంగా  తీసుకోవాలి.  కార్బోహైడ్రేట్లు,  చక్కెర,  ప్రాసెస్ చేసిన ఆహారం దీర్ఘకాలిక వ్యాధులకు  మూలకారణం అని  వి.ఆర్.కె. డైట్  గతంలోనే   చెప్పడం జరిగింది. 

కేలరీలను గణించే విధానం

ఒక వ్యక్తికి  రోజుకు  అవసరమయ్యే  కేలరీలు  ఆ వ్యక్తి  వయస్సు,  లింగం,  ఎత్తు,  బరువు, శారీరక శ్రమ స్థాయిపై ఆధారపడి ఉంటాయి.  డైటరీ రిఫరెన్స్ ఇన్డెక్స్ (డి.ఆర్.ఐ.)  కాలిక్యులేటర్  ద్వారా ఒక వ్యక్తి  బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ),  అంచనా వేసిన రోజువారీ  కేలరీల అవసరాలు,  స్థూల పోషకాలు,  నీరు,  విటమిన్లు,  సిఫార్సు చేసిన ఖనిజాల మోతాదులను  తెలుసుకొనవచ్చును. 

 తినే ఆహార  పదార్థాల  లేబిలింగ్​లపై  ‘చక్కెర’  లేదా ‘సిరప్’  అనే పదాలు ఉన్న లేదా  ‘ఓస్’  అనే పదంతో ముగిసే పదార్థాల పేరు ఉన్నట్లయితే  కలిపిన చక్కెరలు (యాడెడ్​ షుగర్స్) ఉన్నట్లు  గుర్తించాలి.  కలిపిన  చక్కెరలు అనారోగ్యకరమైనవి. 

ఉదాహరణకు కలిపిన చక్కెరలు కలిగి ఉన్న ఆహార పదార్థాల  లేబుళ్లపై  హై-ఫ్రక్టోజ్ కార్న్ సిరప్,  అగేవ్ సిరప్,  కార్న్ సిరప్,  రైస్ సిరప్,   ఫ్రక్టోజ్,   గ్లూకోజ్,  డెక్స్ట్రోస్,  సుక్రోజ్ లాంటి అనేక  విభిన్న పేర్లతో కనిపించవచ్చును.  పండ్లు,  సాదా పాలు వంటి కొన్ని ఆహారాలు, పానీయాలలో  సహజంగా లభించే చక్కెరలు ఉంటాయి. ఈ ఆహారాలలో  ఉండే చక్కెరలను  కలిపిన  చక్కెరలుగా  పరిగణించరు.  కలిపిన  చక్కెరలు  కలిగిన శీతల  పానీయాలను  తాగకూడదు.

 ఆహార  మార్గదర్శకాలలోని ఇతర అంశాలు

రకరకాల రంగులు, పోషకాలు అధికంగా ఉండే కూరగాయలు,  పండ్లను తినాలి.   కూరగాయలు,  పండ్లను యధాతథంగా తినాలి.  పచ్చిగా  తినడానికి  లేదా  వండటానికి ముందు వాటిని పూర్తిగా కడగాలి.  100%  పండ్ల లేదా కూరగాయల  రసాన్ని  పరిమిత  పరిమాణంలో  లేదా నీటితో కలిపి పలచబరిచి తాగాలి.  

ఆహారాన్ని  ప్రాసెస్ చేసి తినడానికి సిద్ధంగా ఉన్న ప్యాక్ చేసిన అల్పాహార పదార్థాలు,  వైట్ బ్రెడ్, పిండి పదార్థాలు లేదా చక్కెరలు, ఉప్పు కలిపిన చిప్స్,  కుకీలు,  క్యాండీ వంటి  ఉప్పగా లేదా  తీపిగా ఉండే  ఆహారాలను  నివారించాలి.  ఇంట్లో  తయారుచేసిన భోజనాలకు  ప్రాధాన్యత ఇవ్వాలి.  

‘గట్ హెల్త్’కు  ప్రాధాన్యత ఇవ్వాలి

‘గట్ హెల్త్’  (పేగు ఆరోగ్యం)కు  ప్రాధాన్యత  ఇవ్వాలి.  మానవ  గట్‌లో  ట్రిలియన్ల కొద్దీ   బ్యాక్టీరియా,    మైక్రోబయోమ్ అని పిలిచే ఇతర 
సూక్ష్మజీవులు ఉంటాయి.  ఆరోగ్యకరమైన ఆహారం బాగా సమతుల్యమైన మైక్రోబయోమ్,  జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది.  అధికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు ఈ సమతుల్యతను దెబ్బతీస్తాయి.   

కొంతమంది వృద్ధులకు తక్కువ కేలరీలు అవసరం అయినప్పటికీ,  వారికి ప్రొటీన్,  విటమిన్ బి12, విటమిన్ డి,  కాల్షియం వంటి కీలక పోషకాలు సమాన లేదా అధిక మొత్తంలో అవసరమవుతాయి. 

ఈ  అవసరాలను తీర్చడానికి వారు పాల ఉత్పత్తులు, మాంసం, సీఫుడ్, గుడ్లు, చిక్కుళ్లు, మొక్కల ఆధారిత ఆహారాలకు ప్రాధాన్యత  ఇవ్వాలి. ఆహారం ద్వారా తీసుకునే పోషకాలు లేదా వాటి శోషణ సరిపోనప్పుడు, వైద్యుల పర్యవేక్షణలో  పోషకాలు కలిపిన ఆహారాలు లేదా సప్లిమెంట్లు అవసరం కావచ్చును.   ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనకు 2025–2030  ఆహార  మార్గదర్శకాలను అందరూ  స్వాగ తించి  అనుసరించవలసిన  అవసరం ఉన్నది.

- డా. శ్రీధరాల రాము, ఫ్యాకల్టీ ఆఫ్​ కెమిస్ట్రీ అండ్​ ఎన్విరాన్​మెంటల్​ సైన్సెస్​