
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వ్యాపార లేదా పర్యాటక వీసా దరఖాస్తు ప్రక్రియను మారుస్తూ ఓ పైలట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టనుంది. దీని ప్రకారం వ్యాపార లేదా పర్యాటక వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారు అమెరికాలోకి ప్రవేశించడానికి $15,000 వరకు బాండ్ కట్టాల్సి ఉంటుంది. అయితే వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో అక్రమంగా ఉండే వారిని తగ్గించడానికి ఈ చర్య తీసుకుంది.
కొత్త నోటీసు ప్రకారం US స్టేట్ డిపార్ట్‌మెంట్ వీసా ఓవర్‌స్టేలు ఎక్కువ రేట్లు ఉన్న దేశల నుండి అలాగే సరైన డాక్యుమెంట్ సెక్యూరిటీ సిస్టం లేని దేశాల నుండి దరఖాస్తు చేసుకునే వారిని లక్ష్యంగా చేసుకుని 12 నెలల పైలట్ ప్రోగ్రామ్‌ను అమలు చేయాలని యోచిస్తోంది. ఈ ప్రోగ్రాం కింద దరఖాస్తుదారులు ప్రమాణాలను బట్టి $5,000 అంటే రూ.4,38,900 వేలు, $10,000(రూ.8,70,000) లేదా $15,000(రూ.13,16,000) బాండ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
అమెరికా వీసా నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం రోజురోజుకి మరింత కఠినతరం చేస్తోంది. ఇందులో భాగంగానే కొత్త నిబంధనలను వచ్చాయి. అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించే పర్యాటకుల వల్ల ప్రభుత్వానికి కలిగే ఆర్థిక నష్టాలు తగ్గించేందుకు ఈ చర్యలు తీసుకుంది. హై వీసా ఓవర్ స్టే రేట్లు, సరిపడని స్క్రీనింగ్, వెట్టింగ్ వ్యవస్థలు ఉన్న దేశాల వారికి కొత్త వీసా నిబంధనలు వర్తిస్తాయి.
కొత్త నిబంధనల ప్రకారం, కొన్ని దేశాల నుంచి బిజినెస్ లేదా టూరిస్ట్ వీసాలకు అప్లై చేసుకునేవారు $5,000, $10,000, లేదా $15,000 వరకు బాండ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ బాండ్ డిపాజిట్ నిబంధన ఈ పైలట్ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైన 15 రోజుల తర్వాత అమలులోకి వస్తుంది.
ఈ బాండ్ వీసా మినహాయింపు కార్యక్రమంలో పాల్గొనే దేశాల వారికి వర్తించదు. ఈ కార్యక్రమంలో ప్రస్తుతం 42 దేశాలు ఉండగా, వీటిలో ఎక్కువగా యూరప్ దేశాలు ఉన్నాయి. గతంలో కూడా వీసా బాండ్ల గురించి ప్రతిపాదనలు వచ్చినా,కొన్ని కారణాల వల్ల అమలు చేయలేదు. ఇప్పుడు ఈ కొత్త నిబంధనలను కఠినంగా అమలు చేయనుంది. ఈ పైలట్ కార్యక్రమం వల్ల ఏ దేశాలపై ప్రభావం పడుతుందో అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే, వ్యక్తిగత పరిస్థితులను బట్టి కూడా బాండ్ నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంది.