
గచ్చిబౌలి, వెలుగు: మాదాపూర్ జోన్ పరిధిలో డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ వేడుకలు, న్యూ ఇయర్ ఈవెంట్లను అర్ధరాత్రి 1 గంటలోగా ముగించాలని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తెలిపారు. సోమవారం సాయంత్రం గచ్చిబౌలిలోని డీసీపీ ఆఫీసులో ఈవెంట్ ఆర్గనైజర్లు, హోటల్స్, రెస్టారెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ ప్రతినిధులు, ఓనర్లతో న్యూ ఇయర్ వేడుకల నిర్వహణపై ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పవల్లి మాట్లాడుతూ.. 2023 న్యూ ఇయర్ వేడుకలను నిర్వహించే ఆర్గనైజర్స్ కచ్చితంగా అర్ధరాత్రి 1 గంటలోగా ఈవెంట్‌ను కంప్లీట్ చేయాలన్నారు. ఈవెంట్లకు పరిమితికి మించి టికెట్లు, పాస్‌లు, కూపన్లు ఇవ్వొద్దని ఆమె సూచించారు. ఎంట్రీ దగ్గర ప్రతి ఒక్కరి ఏజ్‌ను చెక్ చేస్తూ వారి ఐడెంటిటీ కార్డును పరిశీలించాలన్నారు.
కపుల్స్ వెంట మైనర్లను ఈవెంట్లకు అనుమంతిచవద్దని ఆమె చెప్పారు. ప్రతి ఈవెంట్ ఆర్గనైజర్ పబ్లిక్ సేఫ్టీ ఎన్ ఫోర్స్ మెంట్ యాక్ట్–2013 ప్రకారం ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద, పార్కింగ్ ఏరియాలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అసభ్యకరమైన డ్రెస్‌లు, డ్యాన్సులకు పర్మిషన్ లేదన్నారు. మైనర్లకు లిక్కర్ అందించవద్దని, లిక్కర్ ఏర్పాటు చేసే ఈవెంట్ ఆర్గనైజర్లు పార్టీకి వచ్చిన కస్టమర్లకు క్యాబ్ సర్వీస్‌తో పాటు డ్రైవర్లను ప్రొవైడ్ చేయాలన్నారు. చుట్టుపక్కల ఉన్న వారికి ఇబ్బంది లేకుండా డీజే ఏర్పాటు చేసుకోవాలని.. సౌండ్ 45 డెసిబెల్స్ కంటే మించకూడదని హెచ్చరించారు. సమావేశంలో పోలీసు అధికారులు, ఈవెంట్ ఆర్గనైజర్లు, పబ్, బార్, రెస్టారెంట్ల ప్రతినిధులు పాల్గొన్నారు.