Fitness Influencer : అనుమానాస్పద స్థితిలో ప్రముఖ ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి

 Fitness Influencer : అనుమానాస్పద స్థితిలో ప్రముఖ ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి

న్యూజిలాండ్ బాడీ బిల్డర్, ప్రముఖ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ రేచెల్ చేజ్ (Raechelle Chase) అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె తెలిపింది. న్యూజిలాండ్ పోలీసులు ఆమె మృతిపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. రేచెల్ చేజ్ కు ఐదుగురు పిల్లలు. ఫేస్‌బుక్‌లో ఆమెకు1.4 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్‌ మీడియాలో నిత్యం ఫిట్‌నెస్‌ మీద పోస్టులు చేస్తుంటారు. అంతేకాదు.. ఒంటరి తల్లిగా ఉండటంపై స్ఫూర్తిదాయకమైన పోస్ట్‌లు చేస్తుంటారు.

చిన్న వయస్సు నుంచే బాడీ బిల్డింగ్‌లో సత్తా చాటుతూ వస్తున్న రేచెల్‌ చేజ్‌.. న్యూజిలాండ్ లో జరిగిన చాలా పోటీల్లో పాల్గొని..  గెలుపొందింది. 2011లో లాస్‌ వేగాస్‌లో జరిగిన ప్రతిష్టాత్మక ఒలింపియా బాడీ – బిల్డింగ్‌ పోటీల్లో న్యూజిలాండ్‌ తరఫున పాల్గొని మొదటి మహిళగా రికార్డుకెక్కింది. ఇక రేచెల్‌.. క్రిస్‌ చేజ్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఐదుగురు పిల్లలు. అయితే.. భర్తతో విబేధాల కారణంగా పెళ్లైన 14 ఏళ్ల తర్వాత ఫిబ్రవరి 2015లో విడాకులు తీసుకుంది. 

భర్తతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి రేచెల్‌ తన ఐదుగురి పిల్లల బాగోగులు చూసుకుంటూ ఒంటరిగానే జీవిస్తోంది. అయితే.. ఆమె తన విడాకులకు దారితీసిన విషయం గురించి 2016లో భావోద్వేగంతో కూడిన ఒక పోస్ట్‌ చేసింది. విడాకుల సమయంలో తాను తొమ్మిది నెలల గర్భవతినని.. ఆ సమయంలో పిల్లలను ఒంటరిగా ఎంతో ఆత్మవిశ్వాసంతో పెంచానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ రేచెల్ చేజ్ మృతిని ఆమె అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సోషల్​ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఆమె పిల్లలకు సానుభూతి తెలియజేస్తున్నారు.

ALSO READ : బాసర శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు.. కాళరాత్రి అవతారంలో అమ్మవారు