ఇండియాతో జరగబోయే 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ లో స్వల్ప మార్పు చేసింది. ఇటీవలే టీమిండియాపై అరంగేట్ర సిరీస్ లో అద్భుతంగా రాణించిన క్రిస్టియన్ క్లార్క్‌ని కివీస్ తమ స్క్వాడ్ లో చేర్చుకుంది. ఇండియాతో నాగ్‌పూర్, రాయ్‌పూర్, గౌహతిలో జరిగే మొదటి మూడు టీ20లకు క్లార్క్‌ను జట్టులోకి తీసుకున్నట్లు న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ మంగళవారం (జనవరి 20) వెల్లడించారు. కొంతమంది కివీస్ ఆటగాళ్ళు పూర్తి ఫిట్ నెస్ సాధించలేదు. దీంతో క్లార్క్ ను బ్యాకప్ గా సెలక్ట్ చేశారు. ఇండియాతో వన్డే సిరీస్ కు కెప్టెన్ గా ఉన్న మైఖేల్ బ్రేస్‌వెల్ మూడో వన్డే ఆడుతూ గాయపడ్డాడు.
బుధవారం (జనవరి 21)న జరగబోయే తొలి టీ20 మ్యాచ్ కు బ్రేస్ వెల్ అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. కొత్తగా సెలక్ట్ అయిన క్లార్క్ విషయానికి వస్తే ఇండియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో 7 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. క్లార్క్ తీసిన వికెట్లన్నీ ప్రధాన వికెట్లు కావడం గమనార్హం. చివరి రెండు మ్యాచ్ ల్లో ఈ కివీస్ పేసర్ విరాట్ కోహ్లీని రెండు సార్లు ఔట్ చేశాడు. రెండో వన్డేలో కోహ్లీని బౌల్డ్ చేసిన విధానం అద్భుతం. అంతేకాదు శ్రేయాస్ అయ్యర్ ను రెండు సార్లు.. రోహిత్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డిలను ఒక్కొక్కసారి ఔట్ చేసి తన సూపర్ బౌలింగ్ తో టీ20 సిరీస్ కు ఎంపికయ్యాడు.
ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి టీ20 బుధవారం (జనవరి 21) నాగ్‌పూర్ వేదికగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ లో జరగనుంది. వరల్డ్ కప్ ముందు ఇరు జట్లకు ఇదే చివరి సిరీస్. జనవరి 21 నుంచి జనవరి 31 వరకు ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ జరగనుంది. ఇండియాకు సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ చేయనున్నాడు. మరోవైపు న్యూజిలాండ్ జట్టును మిచెల్ సాంట్నర్ లీడ్ చేయనున్నాడు. రెండు జట్లు బలంగా ఉండడంతో సిరీస్ హోరాహోరీగా జరగడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇండియాతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ కు న్యూజిలాండ్ జట్టు:
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఇష్ సోధి, క్రిస్టియన్ క్లార్క్ (మొదటి 3 ఆటలు)
