పురిటినొప్పులతో మహిళా ఎంపీ సైక్లింగ్

 పురిటినొప్పులతో  మహిళా ఎంపీ సైక్లింగ్
  • 2018లో తొలి డెలివరీకి కూడా ఇలాగే బైసికిల్ పై వెళ్లిన జూలీ అన్నే జెంటర్
  • కావాలని వెళ్లలేదు.. అలా జరిగిపోయింది: న్యూజిలాండ్ పార్లమెంట్ సభ్యురాలు జూలీ అన్నేజెంటర్

న్యూజిలాండ్ ఎంపీ జూలీ అన్నే జెంటర్ గర్భవతి. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో పురిటినొప్పులు మొదలయ్యాయి. వెంటనే ఇంట్లో ఉన్న సైకిల్‌ (బైక్‌ వంటి బైసికిల్‌)పై సమీపంలోని హాస్పిటల్‌ బయలుదేరారు. ఆస్పత్రిలో చేరిన 10 నిమిషాలకే నొప్పులు తీవ్రమయ్యాయి. సకాలంలో చేరుకోవడంతో వైద్యులు వెంటనే ఆమెను లేబర్ రూమ్ కు తరలించి డెలివరీ ఏర్పాట్లు చేశారు. గంట తరవాత పండంటి బిడ్డను ప్రసవించారు. ఇదే విషయాన్నిఆమె తన  ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.
గ్రీన్‌ పార్టీకి చెందిన జూలీ అన్నే జెంటర్‌ మోటర్‌ బైక్‌కు బదులు పర్యావరణ అనుకూలమైన సైకిల్‌ వాడతారు. ఇది చూడడానికి బైక్‌లా ఉండే సైకిల్. ఇదంతా తాను ప్లాన్‌ చేసుకుని చేయలేదని, అంతా అకస్మాత్తుగా అలా జరిగిపోయిందని అన్నారు. సైకిల్‌ ఆస్పత్రికి బయలుదేరినప్పుడు అంటే అర్ధరాత్రి 2 గంటలకు పురిటి నొప్పులు పెద్దగా లేవని చెప్పారు. అయితే హాస్పిటల్‌కు పది నిమిషాల్లో చేరుకున్న వెంటనే నొప్పులు అధికమయ్యాయని చెప్పారు.  ఆసుపత్రికి చేరుకున్న గంట తర్వాత, ఆమె తన రెండవ బిడ్డకు జన్మనివ్వడం జరిగిపోయిందని వివరించారు. 
తన కుటుంబంలోని సరికొత్త సభ్యుడిని తెల్లవారుజామున 3:04 గంటలకు స్వాగతించామని ఫేస్ బుక్ లో రాశారు. “నేను నిజంగా ప్రసవ సమయంలో సైకిల్ తొక్కాలని అనుకోలేదు, కానీ అలా జరిగిపోయింది ” అంటూ జెంటర్ తన సైకిల్‌పై ఆసుపత్రికి వెళ్లిన కొన్ని ఫోటోలను జోడించి ఫేస్‌బుక్‌లో రాసింది. తెల్లవారుజామున 2 గంటలకు ఆసుపత్రికి బయలుదేరినప్పుడు ఏదో తెలియని సంకోచం కలిగినా.. తాను భయపడినట్లు ఏమీ జరగలేదని, అంతా సురక్షితంగా ప్రసవం జరిగిపోయిందని సంతృప్తి వ్యక్తం చేశారు.