నేడు న్యూజిలాండ్‌‌తో పాక్‌‌ పోరు

నేడు న్యూజిలాండ్‌‌తో పాక్‌‌ పోరు

బర్మింగ్‌‌హామ్‌‌: గత మ్యాచ్‌‌లో నెగ్గి నాకౌట్‌‌ రేసులో నిలిచిన పాకిస్థాన్‌‌ మరో పోరుకు సిద్ధమైంది. టోర్నీలో అజేయంగా కొనసాగుతున్న న్యూజిలాండ్‌‌తో బుధవారం తలపడనుంది. ఆరు మ్యాచ్‌‌ల్లో రెండు విజయాలు సాధించి ఐదు పాయింట్లతో పట్టికలో ప్రస్తుతం ఏడో స్థానంలో ఉన్న పాక్​ మిగతా మూడు మ్యాచ్‌‌ల్లోనూ నెగ్గడం తప్పనిసరి. చిరకాల ప్రత్యర్థి ఇండియా చేతిలో ఓడిన తర్వాత సౌతాఫ్రికాపై నెగ్గి పాక్‌‌ విమర్శకుల నోరు మూయించింది. గత మ్యాచ్‌‌లో పునరాగమనం చేసిన హరీస్‌‌ సొహైల్‌‌ బ్యాటింగ్‌‌లో సత్తా చాటాడు. ఇక బాబర్‌‌ ఆజమ్‌‌, ఫఖర్‌‌ జమాన్‌‌, ఇమాముల్‌‌ హక్‌‌ స్థాయికి తగ్గట్టు ఆడాల్సి ఉంది. బౌలింగ్‌‌లో మహ్మద్‌‌ ఆమిర్‌‌ చెలరేగుతున్నాడు. వాహబ్‌‌ రియాజ్‌‌, షాదాబ్‌‌ ఖాన్‌‌ మరింతగా రాణించాల్సి ఉంది. ఆ టీమ్​ ఫీల్డింగ్‌‌ మెరుగుపడాల్సి ఉంది. గత మ్యాచ్‌‌లో మూడు క్యాచ్‌‌లు డ్రాప్‌‌ చేశారు. ప్రతీ మ్యాచ్‌‌ కీలకం కాబట్టి ఇకముందైనా ఇలాంటి పొరపాట్ల నుంచి పాఠాలు నేర్వాలి.

మరోవైపు టోర్నీలో డార్క్‌‌హార్స్‌‌గా బరిలోకి దిగిన కివీస్‌‌  అంచనాలకు మించి రాణిస్తోంది. ఐదు విజయాలతో టాప్‌‌ ప్లేస్‌‌లో ఉన్న కివీస్‌‌ ఈ మ్యాచ్‌‌లో గెలిస్తే  నాకౌట్‌‌ బెర్త్‌‌ అధికారికంగా ఖరారు చేసుకుంటుంది. ప్రస్తుత ఫామ్‌‌ చూస్తే కివీస్‌‌ను ఆపడం పాక్‌‌కు శక్తికిమించిన పనే. బ్యాటింగ్‌‌లో కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌ వెన్నెముకలా నిలిచాడు. వరుస సెంచరీలతో జట్టును ఆదుకుంటున్నాడు. రాస్‌‌ టేలర్‌‌ ఫామ్‌‌ లో ఉన్నాడు. అయితే ఓపెనర్లు మార్టిన్‌‌ గప్టిల్‌‌, కొలిన్‌‌ మన్రో బ్యాట్‌‌ ఝుళిపించాల్సి ఉంది. ఆల్‌‌రౌండర్లు జిమ్మీ నీషమ్‌‌, గ్రాండ్‌‌హోమ్‌‌ మంచి టచ్‌‌లో ఉన్నారు.