WI vs NZ: వెస్టిండీస్ అసాధారణ పోరాటానికి క్రికెట్ ప్రపంచం షాక్.. 163 ఓవర్ల పాటు ఆడి మ్యాచ్ డ్రా చేసుకున్నారు

WI vs NZ: వెస్టిండీస్ అసాధారణ పోరాటానికి క్రికెట్ ప్రపంచం షాక్.. 163 ఓవర్ల పాటు ఆడి మ్యాచ్ డ్రా చేసుకున్నారు

న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో వెస్టిండీస్ అద్భుత పోరాటానికి ప్రపంచ క్రికెట్ ఆశ్చర్యపోయింది. రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసి మ్యాచ్ కు కాపాడుకుంది. శనివారం (డిసెంబర్ 6) క్రైస్ట్‌చర్చ్ వేదికగా హాగ్లీ ఓవల్ లో ముగిసిన తొలి టెస్టులో 531 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్ ఐదో రోజు 6 వికెట్ల నష్టానికి 457 పరుగులు చేసి మ్యాచ్ ను డ్రా చేసుకోగలిగింది. సాధారణంగా టెస్టుల్లో 531 పైగా  పరుగుల లక్ష్యం.. రెండు రోజుల ఆట మిగిలి ఉంటే ప్రత్యర్థి జట్టు ఆశలు వదులుకోవాల్సిందే. విండీస్ జట్టు పరిస్థితి కూడా అందరూ అలాగే అనుకున్నారు. 

కళ్ళ ముందు 531 పరుగులు భారీ టార్గెట్.. ఆడుతోంది న్యూజిలాండ్ లో.. తొలి ఇన్నింగ్స్ లో 167 పరుగులకే ఆలౌట్.. రెండో ఇన్నింగ్స్ లో 72 పరుగులకే నాలుగు వికెట్లు.. ఈ దశలో కివీస్ విజయం.. వెస్టిండీస్ కు ఘోర పరాభావం తప్పదని భావించారు. అయితే ఇక్కడ నుంచే అసలు గేమ్ స్టార్ట్ అయింది. విండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ షై హోప్ (140), జస్టిన్ గ్రేవీస్ (202) అద్భుతంగా పోరాడారు. నాలుగో రోజు అసాధారణంగా పోరాడుతూ మ్యాచ్ ను ఐదో రోజుకు తీసుకెళ్లారు.ఈ క్రమంలో హోప్ సెంచరీ.. గ్రేవీస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఐదో రోజు ఆరంభంలోనే విండీస్ హోప్ తో పాటు వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ వికెట్లను కోల్పోయింది. 

గ్రేవీస్ తో కలిసి కీమర్ రోచ్ (53) నెక్స్ట్ లెవల్ పోరాటం చూపించారు. కివీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ క్రీజ్ లో పాతుకుపోయారు. మరోవైపు కివీస్ స్టార్ బౌలర్లు హెన్రీ, స్మిత్ గాయాల కారణంగా చివరి రోజు బౌలింగ్ కు దిగకపోవడం విండీస్ జట్టుకు కలిసొచ్చింది. తొలి రెండు సెషన్ లు పరుగులు రాబట్టిన వీరిద్దరూ మూడో సెషన్ లో డ్రా కోసం ఆడారు. ఈ క్రమంలో గ్రేవీస్ సెంచరీతో పాటు డబుల్ సెంచరీ కూడా పూర్తి చేసుకొని తన కెరీర్ లోనే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్ లో రోచ్ బౌలర్ అయినప్పటికీ 233 బంతులు ఎదుర్కొని 53 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

హోప్ తో కలిసి ఐదో వికెట్ కు 196 పరుగులు జోడించిన గ్రేవీస్.. రోచ్ తో కలిసి ఏడో వికెట్ కు అజేయంగా 180 పరుగులు జోడించి విండీస్ ను పరాజయం నుంచి తప్పించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 231 పరుగులు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ 167 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో కివీస్ కు తొలి ఇన్నింగ్స్ లో 64 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో లాతమ్ (145), రచీన్ రవీంద్ర (176) సెంచరీలతో కివీస్ 8 వికెట్ల నష్టానికి 466 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. 531 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 457 పరుగులు చేసి మ్యాచ్ ను డ్రా చేసుకుంది.