కెనడాకు ఆత్మపరిశీలన తప్పదు

కెనడాకు ఆత్మపరిశీలన తప్పదు

ఏనాటి నుంచో  కెనడాలో ఉంటున్నవాళ్లు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యంతో బాధపడుతూంటే,  చదువుల కోసం కొత్తగా వెళ్ళినవారు వసతి సదుపాయాలు లేక, పార్ట్ టైమ్ ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ‘కెనడాలో ఎక్కడైనా పనిచేసిన’ అనుభవం ఉందా? అని వారిని అడుగుతున్నారు. కొత్తవారికి ఆ అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? దాంతో కెనడా వచ్చి తప్పు చేశామా అనుకుంటున్నవారు కూడా లేకపోలేదు. మొత్తంమీద, కెనడాకి కొత్తగా రావాలనుకుంటున్నవారు ఒకటికి, రెండుసార్లు ఆలోచించుకోండని వారు సలహా ఇస్తున్నారు. 

ఇతర వృత్తి వ్యాపారాలపై కెనడా వెళుతున్న వారికన్నా చదువుల నిమిత్తం వెళుతున్న భారతీయులే పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. వారికి కెనడా సాదరంగా స్వాగతం పలకడం వెనుక దాని ప్రయోజనాలు దానికున్నాయి. విద్యార్థిగా ముందు కెనడాలో కాలుమోపితే తర్వాత శాశ్వత నివాస హోదా, పౌరసత్వం సంపాదించుకోవచ్చని చాలామంది భావిస్తున్నారు. కెనడాలోని ప్రైవేటు కళాశాలలు, విశ్వవిద్యాలయాల అత్యాశ విద్యార్థులు వరదలా ఆ దేశాన్ని ముంచెత్తడానికి కారణమవుతోంది.   కెనడాలో 2022 నాటికి 8 లక్షల మంది విదేశీ విద్యార్థులున్నారని అంచనా. వారిలో దాదాపు 40 శాతం మంది భారతదేశం నుంచి వెళ్ళినవారే ఉన్నారు. సమస్య సంక్షోభంగా మారాక ఇప్పుడు ప్రభుత్వం కెనడాకు వచ్చే విద్యార్థులపై ఒక పరిమితి విధించాలని యోచిస్తోంది. గత ఎనిమిదేండ్ల జస్టిన్ ట్రూడో పాలనలో గృహనిర్మాణ వ్యయం రెండింతలైంది, అద్దెలు రెట్టింపు పెరిగాయి. 

సిక్కులు స్థితిమంతులు

ఏనాడో కెనడాకు వలసవెళ్ళి స్థిరపడిన భారతీయుల్లో సిక్కుల సంఖ్య ఎక్కువ. ఒక వర్గంగా పొందికతో పనిచేయడం, సంస్థాగత నైపుణ్యం, కష్టపడి పనిచేయగల తత్వం, నిధులు సమీకరించగలిగిన సామర్థ్యం, కెనడా అంతటా ఉన్న గురుద్వారాల మధ్య సమన్వయం సిక్కులను ఒక ప్రత్యేక వర్గంగా నిలబెట్టాయి. దాంతో సహజంగానే వారు ఉన్నత స్థితికి చేరుకోగలిగారు.  కెనడాలో కూడా మన దేశంలో మాదిరి రెండు సభలున్నాయి. మన లోక్ సభలాంటి హోస్ ఆఫ్ కామన్స్​లో 338 మంది సభ్యులుంటారు. రాజ్యసభలాంటి సెనేట్​లో 105 మంది సెనేటర్లు ఉంటారు. ప్రధాన మంత్రి సలహా మేరకు గవర్నర్ జనరల్ వారిని నియమిస్తారు. సాధారణంగా ఆ నియామకం జీవితకాలం చెల్లుతుంది. అయితే, 75 ఏండ్లు నిండినవారు సెనేట్ సమావేశాలకు హాజరుకాకపోయినా ఫరవాలేదు. లిబరల్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీలను ప్రధాన పార్టీలుగా చెప్పుకుంటారు. ప్రస్తుత సభలో లిబరల్స్ సంఖ్యా బలం 158గా ఉంది. కన్జర్వేటివ్​లు 117 మంది ఉన్నారు.  జగ్ మీత్ సింగ్ ధలీవాల్ నేతృత్వంలోని న్యూ డెమొక్రాటిక్ పార్టీ మద్దతుతో ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో అధికారంలో నెట్టుకొస్తున్నారు. కెనడా జనాభాలో సిక్కులు సుమారుగా 7.71 లక్షల మంది ఉంటారు. 

నిజ్జర్ హత్యోదంతం

సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్​జే) గ్రూపు నాయకుడు హర్ దీప్ సింగ్ నిజ్జర్ బ్రిటిష్ కొలంబియాలోని సరీలో ఈ ఏడాది జూన్ లో హత్యకు గురయ్యారు. ఈ హత్య వెనుక ఇండియన్ ఏజెంట్లు ఉన్నారని ఎస్ఎఫ్ జే ప్రధాన అధికార ప్రతినిధి గురుప్రీత్ సింగ్ పన్నున్ ఆరోపించారు. అదే పల్లవిని కెనడా ప్రధాని కూడా అందుకోవడం అంతర్జాతీయ సమాజాన్ని ముఖ్యంగా భారతీయులను ఆశ్చర్యపరచింది. పైగా, ఆయన ఆ ఆరోపణలను కెనడా హోస్ ఆఫ్ కామన్స్ లో చేశారు. కనుక, అది తీవ్ర పర్యవసానాలకు దారితీసి రెండు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించుకునేటట్టు చేసింది. అమెరికా, కెనడా, బ్రిటన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నాయట. అమెరికా ఉప్పు అందించిన మీదటే జస్టిన్ ట్రూడో అలాంటి ఆరోపణలకు దిగారని చెబుతున్నారు. ఇపుడు అమెరికా కూడా తేలు కుట్టిన దొంగలా వ్యవహరిస్తూ, దర్యాప్తులో కెనడాకు సహకరించాలని భారతదేశానికి ఉచిత సలహా పడేసింది. ఇది బహుళ ధ్రువ ప్రపంచం అన్న సంగతిని మరచిపోతోంది. ఏటా ఎనభై వేల మందికి పైగా కెనడియన్లు భారతదేశాన్ని సందర్శిస్తూ ఉంటారు. కెనడాలో వీసాలు మంజూరు చేసే కార్యక్రమాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. వాణిజ్యం, వర్తకం వంటి ఇతర అంశాలపై కూడా రెండు దేశాల మధ్య చర్చలు ప్రస్తుతానికి అటకెక్కినట్లే కనిపిస్తున్నాయి. కెనడాలో తాజా ప్రజాభిప్రాయ సేకరణల్లో జస్టిన్ పాపులారిటీ బాగా క్షీణించిపోవడంలో వింతేమీ లేదు. 

గత చరిత్ర రక్తసిక్తమే 

నిజ్జర్ పై భారతదేశంలో హత్యా నేరాలతో సహా ఎన్నో కేసులున్నాయి. ఆయనను తమకు అప్పగించాలని భారత్ పదే పదే కోరుతున్నా కెనడా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయింది.  ఏ చర్యలూ తీసుకోలేదు. నిజ్జర్​పైనే కాదు, ఖలిస్థాన్ తీవ్రవాదులు 1985లో ఎయిర్ ఇండియా విమానంలో బాంబు పెట్టి అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయేటట్టు చేసిన సంఘటనలో.. నిందితులపై కూడా విచారణను కెనడా తూతూ మంత్రంగా నడిపించింది. ఏకంగా 329 మంది ప్రాణాలను బలిగొన్న ఆ ఘటన పౌర విమానయాన చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. ఆల్ కాయిదా తీవ్రవాదులు 2001 సెప్టెంబర్ 11న విమానాలను హైజాక్ చేసి న్యూయార్క్​లో ట్విన్ టవర్స్ ను కూల్చివేసిన ఘటన తాలూకు నిందితులను అమెరికా ఎలా మట్టుబెట్టిందీ అందరికీ తెలిసిందే. ఇంతకూ ఎయిర్ ఇండియా విమానాన్ని కూల్చివేసిన ఘటనలో ఒక్క ఇందర్ జిత్ సింగ్ రియాత్ తప్ప మిగిలినవారు నవ్వుతూ బయటికొచ్చేశారు. రియాత్​కు 30 ఏండ్ల జైలు శిక్ష  విధించారు. కానీ, శిక్షా కాలం సగం ముగిసిన తర్వాత 2016లో ఆయనను కూడా విడుదల చేసేశారు. శిక్ష అనుభవించకుండా తప్పించుకున్న “దోషుల్లో” రిపుదమన్ సింగ్ మాలిక్ ఒకరు.

ఖలిస్థాన్​ వాదాన్ని ఎగదోస్తున్నరు

ఖలిస్థాన్ వేర్పాటువాదం భారతదేశంలో కొడిగట్టింది. చెదురుమదురుగా కొంతమంది మద్దతుదారులు ఇప్పటికీ ఉండవచ్చు. కానీ, మొత్తంమీద, ‘ఇండియాలోని సిక్కులలో ఎక్కువ మంది తాము భారతీయులుగా కొనసాగడానికే గర్వపడతా’మని పేర్కొన్నట్లు వివిధ ప్రజాభిప్రాయ సేకరణల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఖలిస్థాన్ దీపం ఇప్పటికీ అక్కడక్కడ మినుకుమినుకుమంటోంది. ముఖ్యంగా కెనడాలో  దానికి ‘చమురు’ అందుతోంది. ఖలిస్థాన్ మద్దతుదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ లను భారత్ ఏనాటినుంచో  కోరుతోంది. స్వర్ణాలయంపై సైనిక చర్య నిర్ణయానికిగాను భారత మాజీ ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ నిహతులైన సంగతిని భారతీయులు ఎన్నడూ మరిచిపోలేరు. ఖలిస్థాన్ కార్యకలాపాలకు కెనడా కేంద్రంగా మారుతూండడంపై 1982లో అప్పటి కెనడా ప్రధాని పెరీ ట్రూడో (ఇప్పటి ప్రధాని జస్టిన్ కు తండ్రి)కు ఇందిరా గాంధీ ఫిర్యాదు చేశారు. మన విజ్ఞప్తులన్నీ అరణ్యరోదనగానే మిగిలిపోతున్నాయి. పైగా, భారతదేశం కాస్త పైకి వస్తున్న ప్రతి సందర్భంలోనూ ప్రత్యర్థి దేశాలు, మన ఎదుగుదల చూసి ఓర్వలేని దేశాలు ఖలిస్థాన్ ఉద్యమాన్ని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎగదోస్తున్నాయి.

సయోధ్య యత్నాలు

కెనడాలోని ఖలిస్థాన్ మద్దతుదారుల్లో పరివర్తన తీసుకొచ్చి, సయోధ్య కుదిర్చేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. వయసుమీద పడిన ఖలిస్థానీ తీవ్రవాదులు కొందరు కూడా దానికి హాజరయ్యారు. వారిలో మాలిక్ ఒకరు. జస్టిన్ ట్రూడో నేతృత్వంలో 2015లో ‘లిబరల్’ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం చప్పబడిపోవడంలో తనవంతు పాత్ర పోషించిందని చెబుతారు. నిజ్జర్ కూటమిలో పశ్చాత్తాపం చెందని ఖలిస్థానీలకు మాలిక్ భారత ప్రభుత్వ ఏజెంట్​గా  కనిపించారు.  మాలిక్ 2022లో  కెనడాలో హత్యకు గురయ్యారు. దానికి నిజ్జర్ వర్గమే బాధ్యులనే అభిప్రాయం విస్తృతంగా ఉంది. దానికి ప్రతీకారంగా నిజ్జర్ హత్యకు మాలిక్ వర్గంలోనివారు సుపారీ తీసుకున్నారనే అభిప్రాయమూ ఉంది. నిజ్జర్ హత్యలో పాకిస్తాన్ సైనిక గూఢచారి సంస్థ (ఐఎస్ఐ) హస్తం ఉందనే వార్తలూ పొడసూపుతున్నాయి. 

సమగ్ర, సంపూర్ణ దర్యాప్తులో కానీ, నిజానిజాలు వెల్లడి కావు. ఆ హత్యలు జరిగింది కెనడా గడ్డపై కనుక, నిందితులను పట్టుకుని విచారించవలసిన బాధ్యత కెనడా ప్రభుత్వంపైనే ఎక్కువగా ఉంది. ‘అభివృద్ధి చెందిన’ దేశాల ద్వంద్వ ప్రమాణాలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్  మెచ్చుకోతగిన విధంగా ఎండగడుతున్నారు.  అయినా, ఈ పరిణామాలు కెనడాకు కొత్తగా వెళ్ళినవారిని బెంబేలెత్తిస్తున్నాయి. అక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నవారు కూడా భయాందోళనలకు గురవుతున్నారు. ఆరోపణలను నిరూపించలేని పక్షంలో కెనడా మొత్తం భారతీయులందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పవలసి ఉంటుంది. నియమాలు, నిబంధనల ఆధారిత పాలనా వ్యవస్థల గురించి ఉపన్యాసాలు దంచేముందు అవి తమ దేశంలో ఏమేరకు అమలవుతున్నాయో కెనడా ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి.

‑ మల్లంపల్లి  ధూర్జటి, సీనియర్​ జర్నలిస్ట్​