రూ.118 కోట్ల బ్రిడ్జి.. మే 17న ప్రారంభం.. జూన్ 29న పగుళ్లు

రూ.118 కోట్ల బ్రిడ్జి.. మే 17న ప్రారంభం.. జూన్ 29న పగుళ్లు

మహా ప్రభో ఓ బ్రిడ్జి వేయండి.. రాకపోకలకు ఇబ్బందిగా ఉంది.. మీకు పుణ్యం ఉంటుంది అంటూ అక్షరాల ఎనిమిది లక్షల మంది ప్రజలు.. దశాబ్దాలుగా డిమాండ్ చేస్తూ వచ్చారు. ప్రజల మొర ఆలకించిన గుజరాత్ ప్రభుత్వం.. ఎట్టకేలకు బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే బ్రిడ్జే వేద్ – వరియావ్ వంతెన. తాపీ నదిపై నిర్మించారు. దీని బడ్జెట్ అక్షరాల 118 కోట్ల రూపాయలు. 2023, మే 17వ తేదీన.. చిరకాల స్వప్నం అయిన బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంతో వైభవంగా చేశారు. ఇక ఎలాంటి ఇబ్బంది లేదని ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. 

అంతా బాగుంది అనుకుంటున్న టైంలో వర్షాలు వచ్చాయి. పర్వాలేదు ఎంత వర్షం వచ్చినా.. వరదలు వచ్చినా డోంట్ కేర్ మన ఊరుకు హాయిగా బ్రిడ్జిపై నుంచి వెళ్లిపోవచ్చని భావించిన ప్రజలకు ఒక్కసారిగా షాక్. కొత్త బ్రిడ్జిపై భారీగా పగుళ్లు వచ్చాయి. బ్రిడ్జి రెండు చీలినట్లు పగుళ్లు వచ్చింది. కొత్త బ్రిడ్జి మద్య భాగంలో సరిగ్గా.. ఎవరో భూకంపం వచ్చి చీలినట్లు.. రెండుగా చీలింది బ్రిడ్జి. అంతే అధికారులు అప్రమత్తం అయ్యారు. వాహనాల రాకపోకలను నిలిపివేశారు. 

118 కోట్ల రూపాయలతో.. కొత్తగా కట్టిన బ్రిడ్జి.. ప్రారంభించిన 40 రోజులకే.. జూన్ 29వ తేదీన పగుళ్లు రావటం.. వాహనాల రాకపోకలు నిలిచిపోవటం గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. బ్రిడ్జిని సిమెంట్ తో కట్టారా లేక ఇసుకతో కట్టారా అనే విమర్శలు తలెత్తుతున్నాయి. నిత్యం లక్షల మంది ప్రజలు రాకపోకలు సాగించే బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యతపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 

బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత లేదని.. అవినీతి మాత్రమే ఉందని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపక్ష నేత ధర్మేష్ భండారీ తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. 40 రోజుల్లోనే కొత్త బ్రిడ్జికి పగుళ్లు రావటంపై హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష నేతలు.