
- 15 మందితో చేయించిన ప్యానెల్ సభ్యుడు రాధామోహన్ సింగ్
- తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో ఎంపీల ప్రమాణం
- హాజరైన సోనియా, ప్రియాంక, సీఎం రేవంత్, రాష్ట్ర మంత్రులు
- సింగరేణి కార్మికుల డ్రెస్‌లో గడ్డం వంశీకృష్ణ, పంచెకట్టులో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం
- ‘జై పాలస్తీనా’ అంటూ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి కొత్తగా ఎన్నికైన ఎంపీలు లోక్‌సభలో ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ ప్రమాణం చేయగా.. మంగళవారం మిగిలిన 15 మంది సభ్యులు ప్రమాణం చేశారు. వీరిలో కాంగ్రెస్ నుంచి 8 మంది, బీజేపీ నుంచి ఆరుగురు, ఎంఐఎం నుంచి ఒకరు ఉన్నారు. వీరందరితో ప్యానెల్ సభ్యుడు రాధామోహన్ సింగ్ ప్రమాణం చేయించారు. తొలుత ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేశ్, తర్వాత పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రమాణం చేయగా.. అనంతరం ఒక్కొక్కరుగా ప్రమాణం చేసి లోక్ సభ రూల్ బుక్‌లో సంతకం చేశారు. తెలుగులో కాంగ్రెస్ ఎంపీలు సురేశ్ షెట్కార్ (జహీరాబాద్), మల్లు రవి (నాగర్‌కర్నూల్), కె. రఘువీర్ రెడ్డి (నల్గొండ), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), కడియం కావ్య (వరంగల్), బలరాం నాయక్ (మహబూబాబాద్), బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్ (మల్కాజ్‌గిరి), డీకే అరుణ (మహబూబ్‌నగర్) ప్రమాణం చేశారు.
ఇంగ్లిష్‌లో కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ (పెద్దపల్లి), రామసహాయం రఘురాం రెడ్డి (ఖమ్మం), బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), రఘునందన్ రావు (మెదక్), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల) ప్రమాణ స్వీకారం చేశారు. ఇక హిందీలో బీజేపీ ఎంపీ గొడెం నగేశ్ (ఆదిలాబాద్) ప్రమాణం చేయగా, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (హైదరాబాద్) ఉర్దూలో చేశారు. రాష్ట్ర ఎంపీల ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, మాజీ మంత్రి జానారెడ్డి తదితరులు హాజరయ్యారు.
సింగరేణి కార్మికుల డ్రెస్‌లో వంశీకృష్ణ..
తొలిసారి ఎంపీగా ఎన్నికైన కాంగ్రెస్యువ నేత గడ్డం వంశీకృష్ణ సింగరేణి కార్మికుల డ్రెస్ లో ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. దైవసాక్షిగా ప్రమాణం చేసిన ఆయన.. చివర్లో జైహింద్ అంటూ ప్రమాణం ముగించారు. వంశీకృష్ణ ప్రమాణస్వీకారానికి ఆయన కుటుంబసభ్యులు హాజరయ్యారు. తండ్రి వివేక్ వెంకటస్వామి (చెన్నూర్ ఎమ్మెల్యే), తల్లి సరోజ, సతీమణి రోషిణి, సోదరీమణులు వైష్ణవి, రుతిక విజిటర్స్ గ్యాలరీ నుంచి ప్రమాణస్వీకారాన్ని వీక్షించారు. మరోవైపు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలుగుదనం ఉట్టిపడేలా పంచెకట్టులో ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు.
జై తెలంగాణ.. జై భద్రకాళి
రాష్ట్ర ఎంపీలందరూ దైవసాక్షిగా ప్రమాణం చేసినప్పటికీ.. ప్రమాణం చివర్లో తమ ప్రాంతాల్లోని దేవుళ్లను తలచుకున్నారు. కాంగ్రెస్ ఎంపీలు కడియం కావ్య ‘జై భద్రకాళి’, బలరాం నాయక్ ‘జై తుల్జాభవానీ’, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ‘జై యాదగిరి లక్ష్మీనరసింహాస్వామి’ అని ప్రమాణ స్వీకారాన్ని ముగించారు. ఇక బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ‘జై సమ్మక్క సారక్క’ అని స్మరించుకున్నారు. మరోవైపు పార్టీలకు అతీతంగా ఎంపీల నోట ‘జై తెలంగాణ’ నినాదాలు వినిపించాయి.
అసద్ వ్యాఖ్యలపై గొడవ
ప్రమాణస్వీకారం తర్వాత ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసద్‌దుద్దీన్ ఒవైసీ చేసిన పలు నినాదాలు సభలో గందరగోళం సృష్టించాయి. ప్రమాణం తర్వాత జై తెలంగాణ, జై భీమ్, జై పాలస్తీనా, అల్లహో అక్బర్ అంటూ ఆయన నినాదాలు చేశారు. అయితే ‘జై పాలస్తీనా’ అంటూ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి శోభా కర్లందాజే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీగా ప్రమాణం చేసే టైమ్‌లో మరో దేశం పేరును ఎలా ప్రస్తావిస్తారని ఆందోళన చేపట్టారు. ఒవైసీ భారత పార్లమెంట్ ను అవమానిస్తున్నారని, వెంటనే తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ స్పందించి.. నిబంధనల ప్రకారం రికార్డుల నుంచి తొలగించే విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. దీంతో గొడవ సద్దుమణిగింది.