అన్ని టెస్టులు ఒకే చోట మంచిర్యాలలో.. ప్రారంభమైన టీ హబ్​

అన్ని టెస్టులు ఒకే చోట మంచిర్యాలలో..  ప్రారంభమైన టీ హబ్​
  • అందుబాటులో 140 రకాల వైద్య పరీక్షలు 
  • త్వరలోనే  సీటీ స్కాన్​, ఇతర సేవలు 
  • సిబ్బంది కొరతతో ఇబ్బందులు  

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్​లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్​ హబ్​(టీ హబ్ ) ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రాష్ర్ట వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టి.హరీశ్​రావు శనివారం హైదరాబాద్​ నుంచి వర్చువల్​గా ప్రారంభించిన  వెంటనే ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్​రావు, కలెక్టర్​ బదావత్​ సంతోష్ టీ హబ్​ను ఓపెన్​ చేశారు. ఇక్కడ వివిధ రకాలైన బ్లడ్​, యూరిన్​ టెస్టులతో పాటు డిజిటల్​ ఎక్స్​రే, సీటీ స్కానింగ్, మోమోగ్రామ్​ తదితర 140  రకాల సర్వీసులను అందించనున్నారు. ప్రస్తుతం అన్ని రకాల బ్లడ్​, యూరిన్​ టెస్టులు నిర్వహిస్తామని, క్రమంగా పూర్తిస్థాయి సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటామని గవర్నమెంట్​జనరల్​ హాస్పిటల్​ సూపరింటెండెంట్​ డాక్టర్​ హరిశ్చంద్రారెడ్డి తెలిపారు.  

రూ.1.25 కోట్లతో ఏర్పాటు....  

రోగులకు అన్ని రకాల బ్లడ్​, యూరిన్​ టెస్టులు, ఎక్స్​రే, స్కానింగ్​ వంటి సేవలను ఒకే దగ్గర అందించడానికి ప్రభుత్వం అన్ని జిల్లాల్లో టీ హబ్​లను శాంక్షన్​ చేసింది. ఇందులో భాగంగా మంచిర్యాల కాలేజీ రోడ్​లో రూ.1.25 కోట్లతో టీ హబ్​ను ఏర్పాటు చేశారు. దీనికోసం కొత్తగా 17 రూములతో డబుల్​ ఫ్లోర్ బిల్డింగ్​ను నిర్మించారు. మైక్రోబయాలజీ, బయోకెమిస్ర్టీ ల్యాబ్​లు, పాథాలజీ, డ్రైస్టోర్​, కోల్డ్​స్టోర్​, కన్సల్టేషన్​, 2డీ ఎకో, ఈసీజీ, యూఎస్​జీ, సీఆర్​, సీటీ స్కాన్​, ఎక్స్​రే, మామోగ్రఫీల కోసం రూములను కేటాయించారు. సంబంధిత మెషీన్లను ఇన్​స్టాలేషన్​ చేశారు. సీటీ స్కాన్​, టుడీ ఎకో మెషీన్లు మాత్రం ఇంకా రాలేదు. 

 140 రకాల వైద్య పరీక్షలు....  

టీ హబ్​లో బ్లడ్​, యూరిన్ టెస్టులు, ఎక్స్​రే, స్కానింగ్​, మొమోగ్రామ్ తదితర 140 రకాల వైద్య పరీక్షలను అందించనున్నారు. డయాబెటిక్​, థైరాయిడ్​ ప్రొఫైల్​, లివర్​ ప్రొఫైల్​, లిపిడ్​ ప్రొఫైల్​, రేనల్​ ఫంక్షన్​, సీరం ఎలక్ర్టోలైట్స్​, సీబీపీ, మైక్రోబయాలజీలో కలిపి 57 రకాల టెస్టులు అందుబాటులోకి వచ్చాయి.  మహిళల రొమ్ము క్యాన్సర్​కు సంబంధించి మోమోగ్రాఫ్​, అల్ర్టాసౌండ్​, ఈసీజీ, డిజిటల్​ ఎక్స్​రే సేవలు అందనున్నాయి. ఈ టెస్టులను ప్రైవేట్​ ల్యాబ్​లలో చేయించుకోవాలంటే వేల రూపాయలు ఖర్చవుతాయి.  టీ హబ్​లో అన్ని టెస్టులను ఉచితంగానే చేస్తారు. అలాగే జిల్లాలోని 17 పీహెచ్​సీలు, నాలుగు అర్బన్​ హెల్త్​ సెంటర్లు, మూడు బస్తీ దవాఖానాలతో పాటు పల్లె దవాఖానాలు, సీహెచ్​సీలకు వచ్చే పేషెంట్ల నుంచి శాంపిల్స్​ సేకరించి టీ హబ్​లో టెస్టులు నిర్వహిస్తారు. జిల్లావ్యాప్తంగా శాంపిల్స్​ తరలించడానికి నాలుగు వెహికల్స్​అవసరం కాగా, ప్రస్తుతం రెండు మాత్రమే వచ్చాయి.  

సిబ్బంది కొరతతో ఇబ్బందులు

ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టీ హబ్​లను ఏర్పాటు చేసినప్పటికీ అవసరమైన డాక్టర్లను, సిబ్బందిని నియమించకపోవడం వల్ల ఇబ్బందులు తప్పేలా లేవు. జిల్లాలోని వివిధ హాస్పిటళ్లలో పనిచేస్తున్న తొమ్మిది మంది ల్యాబ్​ టెక్నీషియన్లను డిప్యూటేషన్​పై టీ హబ్ కు కేటాయించారు. రేడియోగ్రాఫర్లు, రేడియాలజిస్టులు, మైక్రోబయాలజిస్టుల కొరత ఉంది. ఈ పోస్టుల రిక్రూట్​మెంట్​ కోసం ఇప్పటికే ఒకసారి నోటిఫికేషన్​ ఇచ్చినా దరఖాస్తులు రాలేదు. దీంతో మరోసారి నోటిఫికేషన్​ జారీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు.  

మెరుగైన సేవలు అందిస్తాం... 

 మంచిర్యాలలో టీ హబ్​ఏర్పాటుతో పేదలకు మెరుగైన వైద్య పరీక్షలు ఉచితంగానే అందుబాటులో వచ్చాయి. మొత్తం 140 రకాల సేవలకు గాను ప్రస్తుతం అన్ని రకాల బ్లడ్​ టెస్టులకు ఏర్పాట్లు చేశాం. పూర్తిస్థాయిలో సేవలందించడానికి అవసరమైన సిబ్బందిని, టెక్నీషియన్లు, డాక్టర్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నాం. 

డాక్టర్​ హరిశ్చంద్రారెడ్డి, జీజీహెచ్​ సూపరింటెండెంట్​