
అది ఉత్కంఠగా సాగుతున్న ఐపీఎల్ మ్యాచ్..చివరి ఓవర్లో విజయానికి 20 పరుగులు కావాలి. క్రీజులో ఉన్నదేమో టెయిలండర్లు. కానీ ఫైనల్ టీమ్‌లోనే లేని డాషింగ్ బ్యాట్స్‌మన్ ఆండ్రీ రసెల్ సబ్‌స్టిట్యూట్‌గా అడుగుపెట్టాడు. భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించాడు. మరో మ్యాచ్‌లో విజయానికి 12 పరుగులు కావాలి. కానీ తుది జట్టులో లేని, అప్పటి వరకు డౌగౌట్‌కే పరిమితమైన వరల్డ్ క్లాస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా సబ్‌స్టిట్యూట్‌గా వచ్చి బంతినందుకున్నాడు. అద్భుత యార్కర్లతో ప్రత్యర్థిని కట్టడి చేస్తూ విజయాన్నందించాడు. అసలు ఫైనల్ ఎలెవన్‌లోనే లేని ఈ ఇద్దరు కీలక సమయంలో బరిలో దిగి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. నమ్మశక్యంగా లేదు కాదా! వినడానికి కొత్తగా ఉంది కదా!
అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్ పద మూడో సీజన్‌లో ఈ పరిస్థితులను, మ్యాచ్ స్వరూపాన్ని మార్చే ఈ ఉద్విగ్న క్షణాలను మనం చూడబోతున్నాం. బీసీసీఐ మెదడుకు తట్టిన ‘పవర్ ప్లేయర్ ’నింబంధన కార్యరూపం దాలిస్తే ఇది సాధ్యం కానుంది. పొట్టి క్రికెట్‌ను మరింత రసవత్తరంగా మార్చే ప్రక్రియలో భాగంగా బీసీసీఐ వినూత్న ఆలోచనతో ప్రణాళికలు రచిస్తోంది. ఈ నిబంధన అమల్లోకి వస్తే 11 మందితో కూడిన జట్టుకు బదులు 15 మందిని ప్రకటించాల్సి ఉంటుంది. 11 మంది ప్లేయర్లే బరిలోకి దిగినప్పటికీ.. నలుగురు ప్లేయర్లు సబ్‌స్టిట్యూట్లుగా వ్యవహరించనున్నారు. మ్యాచ్‌లో ఓవర్ ముగిసిన తర్వాత లేదా వికెట్ పడిన ఏ సమయంలోనైనా ఈ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లను ఆడించవచ్చు. ఈ ‘పవర్ ప్లేయర్’ కాన్సెప్ట్‌కు బీసీసీఐ అధికారుల ఆమోదం లభించినప్పటికీ మంగళవారం ముంబైలో జరిగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో దానిపై చర్చించాల్సి ఉందని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ‘వచ్చే ఐపీఎల్ సీజన్‌లో 11 మందితో కూడిన తుది జట్టు కాకుండా సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లతో కలిపి 15 మందితో ఉన్న జట్టును ప్రకటించే విధానంపై కసరత్తులు చేస్తున్నాం. ఈ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లు ఓవర్ ముగిసిన, వికెట్ పడిన ఏ సమయంలోనైనా.. ఎలాంటి పరిస్థితులోనైనా బరిలోకి దిగవచ్చు. ఐపీఎల్‌లో ప్రవేశ పెట్టే ముందు ఈ కాన్సెప్ట్‌ను ముస్తాక్ అలీ ట్రోఫీలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్నాం’ అని ఆ అధికారి చెప్పారు.
తుది నిర్ణయం దాదాదే..
సబ్‌స్టిట్యూట్ రూల్‌పై తుది నిర్ణయం బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీదేనని బోర్డు సీనియర్ అధికారి ఒకరు అధికారి స్పష్టం చేశారు. ‘ఐపీఎల్ ఆపరేషన్స్‌కు చెందిన ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ రూపొందించిన ఈ కాన్సెప్ట్‌పై ఫైనల్ డిసిషన్ గంగూలీ తీసుకోనున్నారు. ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్, ఇతర ఆఫీసర్లతో ఈ కాన్స్‌ప్ట్‌పై గవర్నింగ్ సమావేశంలో దాదా చర్చిస్తారు. దీన్ని అమలు చేసే విషయంలో చాలా అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. అందుకే ముస్తాక్ అలీ టోర్నీ ప్రారంభానికి ఇంకా నాలుగు రోజులే ఉన్నా ఇప్పటి వరకు ఈ కాన్సెప్ట్‌పై ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇది అమలవుతుందా లేదా అనేది తెలియదు’ అని తెలిపారు. ఇక ఈ నిబంధనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. క్రికెట్ సహజ స్వభావానికి ఇది విరుద్ధమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, వెటరన్ ప్లేయర్లతో కూడిన ఓ ఫ్రాంచైజీకి మేలు చేకూర్చేలా ఈ నిబంధన ఉందనే ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. ఆ జట్టును దృష్టిలో ఉంచుకోనే ఈ కాన్సెప్ట్‌ను తెరపైకి తెచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ రూల్ వల్ల క్రికెట్‌లో అవినీతి పెరిగే ఆస్కారం కూడా ఉందని బీసీసీఐలోని ఓ వర్గం గట్టిగా వాదిస్తోంది. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ల కారణంగా ఫిక్సింగ్ జరిగే చాన్స్ ఉందని, ఆ ఆటగాళ్లను బుకీలు సంప్రదించే అవకాశం ఉందనే వాదనలు వస్తున్నాయి. గవర్నింగ్ సమావేశంలో ఈ అంశాలన్నీ చర్చకు రానున్నాయి.