
- ఆలస్యం చేసినందుకు సైనిక సంక్షేమ నిధికి రూ. 50 వేలు జరిమానా చెల్లించండి
- అధీకృత అధికారికి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: జనగామ జిల్లాలోని కాందిశీకుల భూములకు సంబంధించి రద్దయిన ఎవాక్యూ ఇంటరెస్ట్ విభజన చట్టం-1951 కింద వారసులు పెట్టుకున్న దరఖాస్తును మూడు నెలల్లో పరిష్కరించాలని అధీకృత అధికారికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 25 ఏండ్లైనా దరఖాస్తును పరిష్కరించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.50 వేల జరిమానాను సైనిక సంక్షేమ నిధికి చెల్లించాలని ఆదేశించింది. జనగామ తాలూకాలో కుందరం, బెక్కల్, సముద్రాల, జనగాం, మెట్టూరు, మాడూరు, సింగరాజపల్లి, బహిరిపల్లి, పఖాల్, పాలకుర్తి, ఇర్రెవేను, ముత్తారం, ఇప్పుగూడ, రఘునాథపల్లి తదితర ప్రాంతాల్లో ఫాతిమా బేగం వారసులు సేల్ సర్టిఫికెట్ దరఖాస్తును పరిష్కరించకపోవడాన్ని సవాలు చేస్తూ అబుల్ ఖైర్ నసీరుద్దీన్ కమ్రాన్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టారు. ఈ భూములకు చెందిన వ్యక్తులు పాకిస్తాన్ వెళ్లిపోగా ఆస్తులను కాందిశీకుల చట్టం కింద అధీకృత అధికారి స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తాన్ కు వెళ్లిన వారి సోదరి సలేహా ఫాతిమా బేగం ఇక్కడే ఉండి ఆ భూములను స్వాధీనం చేసుకుని సేల్ సర్టిఫికెట్ పొందారు. ఇందులో భూములను సేల్ సర్టిఫికెట్‌లో నుంచి 1962లో తొలగించడంతో వారసులు హైకోర్టును ఆశ్రయించారు. అధీకృత అధికారికి దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు ఆదేశించగా 2000లో దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తును పరిష్కరించాలంటూ గతేడాది మళ్లీ వినతిపత్రం ఇచ్చినా అధికారులు పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయమూర్తి దరఖాస్తును 3 నెలల్లో పరిష్కరించాలని ఆదేశించారు.