
- ఫ్రీజర్లలో పెట్టి.. ఎస్కార్ట్నుతోడుగా పంపిస్తున్న ప్రభుత్వం
- ఇప్పటివరకూ కుటుంబ సభ్యులు గుర్తించిన, డీఎన్ఏ సరిపోలిన 34 డెడ్‌బాడీల అప్పగింత
- ప్రమాదంలో 39 మంది మృత్యువాత..
- గుర్తుపట్టలేనంతగా కాలిన డెడ్‌బాడీలు
సంగారెడ్డి, వెలుగు: సిగాచి ఫ్యాక్టరీ పేలుడులో చనిపోయిన కార్మికుల డెడ్‌బాడీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అంబులెన్స్లలో వారి స్వస్థలాలకు తరలిస్తున్నది. మృతదేహాలు చెడిపోకుండా ఫ్రీజర్ లో పెట్టి కుటుంబ సభ్యులకు తోడుగా ఇద్దరు పోలీసులను ఎస్కార్ట్ గా ఇచ్చి పంపిస్తున్నది. భారీ పేలుడులో ఇప్పటివరకు 39 మంది చనిపోగా, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి.
కొన్ని డెడ్‌బాడీలు మాంసపు ముద్దల్లా మిగిలిపోయాయి. వాటన్నింటినీ జాగ్రత్తగా సేకరిస్తున్న రెస్క్యూ టీమ్.. పటాన్చెరు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలిస్తున్నది. అక్కడ హైదరాబాద్ నుంచి తెప్పించిన ఫ్రీజర్లలో డెడ్‌బాడీలను భద్రపరిచి, డీఎన్ఏ సరిపోలిన మృతదేహాలను స్వస్థలాలకు పంపిస్తున్నది.
డీఎన్ఏ టెస్ట్‌తో 20 డెడ్‌బాడీల గుర్తింపు
పటాన్‌చెరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఇప్పటివరకు 39 మృతదేహాలు రాగా, డీఎన్ఏ కోసం శాంపిల్స్ సేకరించిన అనంతరం వాటిని అక్కడి మార్చురీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫ్రీజర్లలో భద్రపరుస్తున్నారు. ఇందులో ఇప్పటివరకూ 34 డెడ్ బాడీలను గుర్తించారు. 13 మృతదేహాలను వారి కుటుంబసభ్యులు గుర్తుపట్టగా, 20 డెడ్‌బాడీలను డీఎన్ఏ టెస్టుల ద్వారా సరిపోల్చారు.
ఒకరు ధ్రువ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మరో 5 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. డెడ్‌బాడీలను గుర్తు పట్టిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వం స్వస్థలాలకు తరలిస్తున్నది. ఘటన జరిగిన రెండో రోజు నుంచే తరలింపు కార్యక్రమం కొనసాగుతున్నది. బాధితులంతా పేద కుటుంబాలకు చెందినవారు కావడంతో ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ.లక్ష చొప్పున అందజేసి, తోడుగా ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్కార్ట్‌గా పంపుతున్నది.
శుక్రవారం సాయంత్రానికి తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు 4, ఏపీకి- 6, బిహార్‌కు 6, ఒడిశాకు- 8, ఉత్తర్‌ప్రదేశ్ కు-4, వెస్ట్‌బెంగాల్ కు4, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు ఒక్కో డెడ్‌బాడీ చొప్పున పంపించారు. ఇంకా 9 మంది ఆచూకీ దొరకలేదు. వీరి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. మృతదేహాలను గుర్తించడం దగ్గర నుంచి తరలించేదాకా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య నేతృత్వంలో రెవెన్యూ, పోలీస్, హెల్త్, ఫైర్ డిపార్ట్‌మెంట్, ఫోరెన్సిక్, డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ సమన్వయంతో పనిచేస్తున్నాయి.
గాయపడిన వారికి మెరుగైన వైద్యం..
క్షతగాత్రులు, మృతులకు సంబంధించి బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు పాశమైలారం వద్ద ఏర్పాటుచేసిన సహాయ కేంద్రం 24 గంటలు పనిచేస్తున్నది. మరోవైపు బాధిత కుటుంబాలకు ఇక్కడే తాత్కాలిక వసతి ఏర్పాటుచేశారు. వారికి అధికారులు ఆహారం, ఆరోగ్య సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రస్తుతం 23 మంది క్షతగాత్రులు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతుండగా, ప్రభుత్వ సూచనల మేరకు ప్రత్యేక వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి.. మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. బాధితులకు అవసరమైన
కౌన్సిలింగ్ ఇస్తున్నారు.