బ్రెజిల్‌ కు ఎదురుదెబ్బ.. వచ్చే రెండు మ్యాచ్లకు నెయ్‌మర్ దూరం

బ్రెజిల్‌ కు ఎదురుదెబ్బ.. వచ్చే రెండు మ్యాచ్లకు నెయ్‌మర్ దూరం

బ్రెజిల్‌ గతంలో ఐదు సార్లు విశ్వవిజేతగా నిలిచింది. చివరిగా 2002లో విశ్వ విజేతగా నిలిచింది. ఈసారి ఎలాగైనా జగజ్జేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది. ఈ తరుణంలో బ్రెజిల్​ టీమ్​ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. స్టార్​ ప్లేయర్​ నెయ్‌మ‌ర్ మోకాలికి గాయమైంది. సెర్బియాతో గురువారం జ‌రిగిన‌ తొలి మ్యాచ్‌లో అతడి గాయం పాలయ్యాడు. గాయం నుంచి కోలుకునేందుకు నెయ్‌మ‌ర్‌కు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని, అత‌ను వచ్చే రెండు మ్యాచ్‌ల‌కు అందుబాటులో ఉండ‌డ‌ని వైద్యులు ప్రకటించారు. మొదటి మ్యాచ్‌లో సెర్బియాతో తలపడిన బ్రెజిల్ 2 -0 తేడాతో ఘన విజ‌యం సాధించింది. అయితే ఆ మ్యాచ్‌లో సెర్బియా ఆట‌గాడు నికోల మిలెన్‌ కోవిక్‌ను ఢీకొట్టడంతో నెయ్‌మ‌ర్ మోకాలికి గాయ‌మైంది. అయినా త‌మ జ‌ట్టు రెండు గోల్స్ చేసేంత వ‌ర‌కు  నెయ్‌మ‌ర్ మైదానంలోనే ఉన్నాడు. గేమ్​ మరో పది నిమిషాల్లో ముగుస్తుందనగా.. నెయ్​మర్​ గ్రౌండ్​ నుంచి బయటికి వచ్చాడు. డిసెంబ‌ర్ 3 నుంచి జరగనున్న నాకౌట్ స్టేజ్ మ్యాచ్‌ల‌కు నెయ్‌మ‌ర్ అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది. 


 
‘గ్రూప్ జీ’లో పోటీ ఎలా ఉంది ? 
 
గ్రూప్ జీలో బ్రెజిల్ తో పాటు సెర్బియా, స్విట్జర్లాండ్, కామెరూన్ లాంటి టీమ్​ లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ బ్రెజిలే చాలా బలమైంది. 1958, 1962, 1970, 1994, 2002 వరల్డ్​ కప్​ల ను గెలిచిన చరిత్ర బ్రెజిల్​ సొంతం. అయితే వరుసగా గత నాలుగు ప్రపంచకప్‌లలో బ్రెజిల్‌ టాప్‌–3  లిస్టులో  నిలవడంలోనూ విఫలమైంది. ఇప్పుడు కోచ్‌ టిటె జట్టును పటిష్టంగా తీర్చిదిద్దాడు. స్టార్‌ ప్లేయర్‌ నెయ్‌మ‌ర్ జట్టును ముందుండి నడిపించగలడు. అలీసాన్‌ ప్రస్తుతం అత్యుత్తమ గోల్‌కీపర్లలో ఒకడు. థియాగో, రఫిన్హా ఇతర కీలక ఆటగాళ్లు. గ్రూప్‌ జీలో బ్రెజిల్​ టాపర్‌ గా నిలిచే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. ఈ గ్రూప్​ నుంచి బ్రెజిల్ తో పాటు స్విట్జర్లాండ్ జట్టు ప్రిక్వార్టర్స్ కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే సెర్బియాను కూడా తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే క్వాలిఫయింగ్‌ టోర్నీలో పోర్చుగల్‌ను అది వెనక్కి నెట్టి అగ్రస్థానంతో అర్హత సాధించింది.