‘గౌరవెల్లి’కి పర్యావరణ పర్మిషన్లు.. ఇంకెప్పుడు తీసుకుంటరు?

‘గౌరవెల్లి’కి పర్యావరణ పర్మిషన్లు.. ఇంకెప్పుడు తీసుకుంటరు?
  • రాష్ట్ర సర్కార్​పై మరోసారి ఎన్జీటీ ఆగ్రహం
  • అనుమతులు వచ్చేదాకా పనులు చేయొద్దని ఆర్డర్​

హుస్నాబాద్, వెలుగు: పర్యావరణ అనుమతులు తీసుకోకుండానే గౌరవెల్లి ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్జీటీ) మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. తక్షణమే అన్ని రకాల పర్మిషన్లు తీసుకోవాలని, అప్పటి దాకా ప్రాజెక్టుకు సంబంధించిన ఎలాంటి పనులను చేయొద్దని సోమవారం ఆదేశాలు జారీ చేసింది. నిర్వాసితులు బద్ధం భాస్కర్ రెడ్డి, కొత్త సంజీవరెడ్డి, ఉస్కె సురేందర్ రెడ్డి, రాగి శివ తదితరులు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రాజెక్టు నిర్మిస్తున్నారని చెన్నైలోని ఎన్​జీటీని ఆశ్రయించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు చేస్తున్నారని పిటీషనర్ల తరఫున లాయర్లు ఎన్జీటీకి ఎవిడెన్సులు చూపించారు. 

గోదావరి రివర్ మేనేజ్​మెంట్ బోర్డు కార్యదర్శి అలగేషన్ కూడా ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి రిపోర్టును సమర్పించారు. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేయవద్దని నాలుగుసార్లు కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఖాతరు చేయకుండా అధికారులు ప్రాజెక్టు పనులు చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాంచదర్​రావు వాదనలు వినిపించారు. ప్రభుత్వం ప్రాజెక్టు పనులు చేయడం లేదని తెలిపారు. చిన్నచిన్న ప్యాచ్ వర్కు మాత్రమే చేస్తున్నట్టు చెప్పారు. కట్టకు రాళ్లు పెంచడం, ప్రాజెక్టులో నీళ్లు నింపడం ప్యాచ్ వర్క్ ఎలా అవుతుందని జడ్జి ప్రశ్నించారు. తక్షణమే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పనులను ఆపాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. లేకుంటే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది.