డీపీఆర్​ పేరు చెప్పి.. పునాదులు తవ్వుతరా?

డీపీఆర్​ పేరు చెప్పి.. పునాదులు తవ్వుతరా?
  • ‘సంగమేశ్వరం’ పనుల విషయంలో ఏపీపై ఎన్జీటీ ఆగ్రహం
  • డీపీఆర్​ పేరిట ప్రాజెక్టుకు అవసరమైన పనులన్నీ చేశారు
  • ఏ ప్రాజెక్టుకైనా డీపీఆర్​కు ఈ స్థాయిలో పనులు జరిగాయా?
  • మా తీర్పును అమలు చేయకుంటే చేతులు కట్టుకుని కూర్చోవాల్నా 

హైదరాబాద్​, వెలుగు: రాయలసీమ లిఫ్ట్​ (సంగమేశ్వరం) ప్రాజెక్ట్​ పనులపై ఎన్జీటీ చెన్నై బెంచ్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. డీపీఆర్​లు అనుకుంట ప్రాజెక్టు పునాదులు తవ్వుతారా అంటూ ఏపీ ప్రభుత్వంపై మండిపడింది. ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరించి ఏపీ ప్రభుత్వం సంగమేశ్వరం ప్రాజెక్ట్​ కడ్తోందని నారాయణపేట జిల్లా రైతు గవినోళ్ల శ్రీనివాస్​, తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్లను చెన్నై బెంచ్​ జ్యుడీషియల్​ మెంబర్​ జస్టిస్​ కె. రామకృష్ణన్​, ఎక్స్​పర్ట్​ మెంబర్​ సత్యగోపాల్​ గురువారం విచారించారు. గవినోళ్ల శ్రీనివాస్​ తరఫున సుప్రీంకోర్టు అడ్వొకేట్​ శ్రావణ్​కుమార్​, తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ రామచందర్​రావు, ఏపీ తరఫున సీనియర్​ అడ్వొకేట్​ వెంకటరమణి వాదనలు వినిపించారు. కోర్టు తీర్పును ధిక్కరించడం పట్ల ఏపీపై బెంచ్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పును అమలు చేయకుంటే తాము చేతులు కట్టుకుని చూస్తూ కూర్చోవాల్నా అని నిలదీసింది. డీపీఆర్​ పేరుతో ప్రాజెక్టుకు అవసరమైన పనులన్నీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ప్రాజెక్టు డీపీఆర్​కైనా ఈ స్థాయిలో పనులు జరిగినట్టు చరిత్రలో ఉందా అని ప్రశ్నించింది. ముందుగా కోర్టు తీర్పులను అమలు చేసే విషయంపై దృష్టి పెట్టాల్సిందిగా ఏపీ సర్కార్​ను ఆదేశించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ధిక్కరణ పిటిషన్​పై ఏపీ వాదనలు ముగిశాయని, ఇక పిటిషనర్లు గవినోళ్ల శ్రీనివాస్​, తెలంగాణ ప్రభుత్వ వాదనలను మంగళవారం వింటామని స్పష్టం చేసింది. 

ఆ మట్టి పోతిరెడ్డిపాడుదట..
సంగమేశ్వరంపై గురువారం కూడా ఏపీ ప్రభుత్వం అదే అడ్డగోలు వాదన చేసింది. కేఆర్​ఎంబీ రిపోర్ట్​లో పేర్కొన్న ఫొటోలు తప్పు అని, అసలు సంగమేశ్వరం పనులనే తాము చేయట్లేదని వాదించింది. పోతిరెడ్డిపాడు హెడ్​ రెగ్యులేటర్​ వద్ద తీసిన మట్టి అని, వాటిని చూపించి తెలంగాణ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఎన్జీటీకి వివరించింది. తప్పుడు ఫొటోలు, వీడియోలు చూపించిన తెలంగాణ 
సర్కార్​పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఏపీ వాదనపై ఎన్జీటీ అసహనం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలను అమలు చేయకుండా ఏపీ ధిక్కరించిందని పేర్కొంది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశిస్తే ఏం చేస్తారని ఏపీ తరఫు లాయర్​ను ప్రశ్నించింది. ప్రాజెక్టు పనులు ప్రజల ఉపయోగం కోసమని, వాటిని కోర్టులు, ట్రిబ్యునళ్లు అర్థం చేసుకోవాలనే కొత్త వాదనను ఏపీ లాయర్​ తెరపైకి తీసుకొచ్చారు. ప్రాజెక్ట్ డీపీఆర్​ సహా ఇతర అవసరాల కోసమే సంగమేశ్వరం పనులను చేశామన్నారు. అవసరానికి మించి కొంత ఎక్కువ పనులు చేసినంత మాత్రాన అధికారులను జైలుకు పంపుతారా అని ప్రశ్నించారు. ఇప్పటిదాకా చేసిన పనులను పూడ్చేయాలా అని అన్నారు. ఓ ప్రైవేట్​ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్​లో తెలంగాణ సర్కార్​ ఇంప్లీడ్​ అవ్వడమేంటని అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎస్​ను​ జైలుకు పంపాలన్న పిటిషన్​ను కొట్టేయాల్సిందిగా కోరారు. రాష్ట్రాల మధ్య వచ్చే సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు.