సీతమ్మసాగర్​ విషయంలో రాష్ట్ర సర్కారుపై ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం

సీతమ్మసాగర్​ విషయంలో రాష్ట్ర సర్కారుపై ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: సీతమ్మ సాగర్​మల్టీపర్పస్​ప్రాజెక్టు నిర్మాణంలో  పర్యావరణ ఉల్లంఘనలపై నేషనల్ ​గ్రీన్​ ట్రిబ్యునల్(ఎన్జీటీ) ​తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ అనుమతులు తీసుకోకుండా పనులు చేయొద్దని ఆదేశించినా పట్టించుకోకపోవడం ఏమిటని మండిపడింది. ఈ మేరకు ఇరిగేషన్​డిపార్ట్​మెంట్​కు ఎన్జీటీ షోకాజ్​ నోటీస్ ​పంపింది. నోటీసులపై ఈ నెల 20వ తేదీలోగా సమాధానమివ్వాలని స్పష్టం చేసింది. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లోని సెక్షన్​–5 ప్రకారమే నోటీస్​ ఇస్తున్నట్టు  ఎన్విరాన్ మెంట్​ ఇంపాక్ట్​అసెస్​మెంట్​ వింగ్ ​ప్రిన్సిపల్​ సైంటిస్ట్​ యోగేంద్రపాల్​ సింగ్​ నోటీసులో  పేర్కొన్నారు.

ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయని తేలినట్లు చెప్పారు. ఎలాంటి పర్మీషన్స్  తీసుకోకుండా 30 శాతం పనులు చేపట్టినట్లు నిర్ధారణ జరిగిందన్నారు. మిగతా పనులను ఆపాలని ఎన్జీటీ స్టే ఇచ్చిందని..అయినా వర్క్స్ కొనసాగించి ధిక్కరణకు పాల్పడ్డారని తెలిపారు. సీతారామ ఎత్తిపోతల, సీతమ్మ సాగర్​ను వేర్వేరు ప్రాజెక్టులుగా చేపట్టి.. రెండింటిని ఒకే ప్రాజెక్టుగా మార్చి సీడబ్ల్యూసీకి డీపీఆర్​సమర్పించారని గుర్తుచేశారు. సీతమ్మ సాగర్​ బ్యారేజీతో పర్యావరణానికి నష్టం వాటిల్లదని నిర్ధారణ జరగాల్సి ఉందని వివరించారు. కేంద్ర అణు ఇంధన శాఖ, సెంట్రల్​ ఎలక్ట్రిసిటీ అథారిటీల నుంచి అనుమతులు వచ్చిన తర్వాతనే రెండో దశ పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఈ అనుమతులేవి లేకుండానే ప్రాజెక్టు పనులు కొనసాగించడం తమ ఆదేశాలను ఉల్లంఘించడమేనని, తాము లేవనెత్తిన అంశాలకు నిర్దేశిత గడువులోగా  సమాధానం ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించింది.