V6 News

ఎన్జీటీ ఆదేశాలు బేఖాతర్..రాంకీకి లక్ష జరిమానా

ఎన్జీటీ ఆదేశాలు బేఖాతర్..రాంకీకి లక్ష జరిమానా
  • శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేయకపోయినా పట్టించుకోని బల్దియా
  • రాంకీకి లక్ష జరిమానా విధించిన ఎన్టీటీ
  • డంపింగ్ యార్డు చుట్టూ అక్రమంగా 20 వరకు లీచెట్ వాటర్ పాండ్ లు 
  • ఈ నెల 12 న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్​ను ఆశ్రయించిన స్థానికులు

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లో రోజూ ఉత్పత్తి అయ్యే చెత్తను ఎప్పటికప్పుడు శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) జారీ చేసిన ఆదేశాలను రాంకీ సంస్థ తుంగలో తొక్కుతోంది. కళ్లముందే నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా.. బల్దియా అధికారులు పట్టించుకోవడంలేదని డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల ప్రజలు మండిపడుతున్నారు. ఇక్కడ కొత్త చెత్త వేయొద్దని గతేడాది అక్టోబర్ 28న ఎన్జీటీ ఆర్డర్ ఇస్తే.. నవంబర్ 6 వరకు దాన్ని అమలు చేయకపోవడంపై జస్టిస్ పుష్ప సత్యనారాయణ, జ్యుడీషియల్​మెంబర్ డాక్టర్ ప్రశాంత్ గార్గవ్‌‌‌‌ తో కూడిన బెంచ్ అప్పట్లో అసహనం వ్యక్తం చేసింది. కోర్టులో అందరి ముందూ తీర్పు చెప్పినప్పుడే అది అమల్లోకి వస్తుందని, ఆర్డర్ కాపీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో పెట్టేదాకా ఎదురుచూడటం ఏంటని.. ఇది కోర్టు ధిక్కరణే అని మండిపడ్డారు. 

ఈ ఉల్లంఘనకు ఈ ఏడాది  జనవరిలో రాంకీ సంస్థకు రూ. లక్ష జరిమానా వేసింది. 393 ఎకరాల్లో డంపింగ్ యార్డు ఉండగా.. 125 ఎకరాల విస్తీర్ణంలో క్యాపింగ్ చేశారని, ఆ ఏరియాలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త చెత్త వేయొద్దని ఎన్జీటీ స్పష్టం చేసింది. కేవలం రీక్లెయిమ్ చేసిన 214 ఎకరాల్లో మాత్రమే ప్రాసెసింగ్ పనులు చేసుకోవాలని అనుమతిని సవరించింది. అక్కడ కూడా ఫ్లై యాష్ (బూడిద) మేనేజ్మెంట్ సరిగ్గా లేదని, రాంకీ సంస్థ బాధ్యతారాహిత్యంగా ఉండొద్దని హెచ్చరించింది. అయినా సరే, క్షేత్రస్థాయిలో పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు.   

18 ప్రాంతాల్లో సమస్య 

జవహర్​నగర్​ డంపింగ్‌‌‌‌యార్డు చుట్టు పక్కల 15 నుంచి 18 ప్రాంతాల్లో సమస్య ఉంది. జవహర్‌‌‌‌నగర్‌‌‌‌, దమ్మాయిగూడ, కార్మిక నగర్‌‌‌‌, బాలాజీనగర్‌‌‌‌, గబ్బిలాలపేట, అంబేద్కర్‌‌‌‌నగర్‌‌‌‌, మల్కారం, రాజీవ్‌‌‌‌గాంధీ నగర్‌‌‌‌, శాంతి నగర్‌‌‌‌, ప్రగతి నగర్‌‌‌‌, హరిదాసుపల్లి, చెన్నాయిపల్లి, బీజేఆర్‌‌‌‌నగర్‌‌‌‌, అహ్మద్‌‌‌‌గూడ, తిమ్మాయపల్లి, నాగారం, బండ్లగూడ, రాంపల్లి ప్రాంతాలతో పాటు సాయంత్రమైందంటే యాప్రాల్, సైనిక్ పురి, ఈసీఎల్ ప్రాంతాల్లో దుర్గంధం వస్తుందని జనం అంటున్నారు. ఇక  డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారు ఇండ్లను ఖాళీ చేస్తుండటమే కాకుండా, కొత్త వారు ఇక్కడకు వచ్చే ధైర్యం చేయడంలేదు.

లీచెట్ ట్రీట్ మెంట్ ప్లాంట్​ ఉన్నా అంతే

జవహర్ నగర్ డంపింగ్ యార్డు వద్ద మురికి నీటి శుద్దీకరణ (లీచెట్ ట్రీట్మెంట్) ప్లాంట్ ఏర్పాటు చేసినా కూడా సమస్య తీరడంలేదు. రూ.251 కోట్లతో 2023 ఏప్రిల్ 15న 2000 కే ఎల్ డీ సామర్థ్యం గల లీచెట్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. 12 ఏండ్లపాటు దీని నిర్వహణ బాధ్యతలను రాంకీ సంస్థకి అప్పగించారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు పరిసర  ప్రాంత ప్రజలకు కాలుష్యం లేని వాతావరణం కల్పించేందుకు 30 ఎకరాల్లో విస్తరించి ఉన్న మల్కారం చెరువులోని లీచెట్ ని  2023 మే  నెలాఖరులోపు పూర్తిగా శుద్ధి చేసి, 2024  ఏప్రిల్ నాటికి డంపిండ్ యార్డు పరిసర ప్రాంతాల్లో పూర్తిగా లీచెట్ లేకుండా శుద్ధి చేసి సమస్యకి పూర్తిగా చెక్ పెడుతామని ప్రారంభం సమయంలో రాంకీ ప్రతినిధులు అప్పటి బీఆర్ఎస్​ సర్కార్ హయాంలో తెలిపారు.  కానీ, నేటికి మల్కారం చెరువు శుద్ధి కాలేదు.  

అక్రమంగా లీచెట్ పాండ్లు

డంపింగ్ యార్డు చుట్టూ దాదాపు 20 వరకు అక్రమంగా లిచేట్ వాటర్ పాండ్లను ఏర్పాటు చేశారు. చెత్త కుప్పల నుంచి కారే విషపూరితమైన 'లిచేట్' నీటిని ఈ పాండ్లలో నిల్వ చేస్తున్నారు. వాస్తవానికి ఈ నీటిని ఎప్పటికప్పుడు ట్రీట్‌‌‌‌మెంట్ ప్లాంట్‌‌‌‌లో శుద్ధి చేసి పంపాల్సి ఉన్నప్పటికీ, రాంకీ సంస్థ మాత్రం నామమాత్రంగానే ట్రీట్ చేస్తూ చేతులు దులుపుకుంటోంది. 

అనారోగ్య సమస్యలు.

డంపింగ్ యార్డు చుట్టూ లీచెట్ వల్ల  స్థానికులు చర్మ సమస్యల బారిన పడుతున్నారు. వర్షాలు పడిన సమయంలో లీచెట్ పూర్తి కాలనీల్లోంచి ప్రవహిస్తుందని, అందులోంచి నడిచినా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెబుతున్నారు. హరిదాస్ పల్లిలోని సింధివనం, అహ్మద్ గూడ డబు బెడ్రూం కాలనీ, ఇందిరమ్మ ఇండ్ల కాలనీల్లో సమస్య ఉందని చెబుతున్నారు. 

 మానవ హక్కుల కమిషన్‌‌‌‌కు ఫిర్యాదు

సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో స్థానికులు ఈ నెల 12న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్‌‌‌‌ను ఆశ్రయించారు. గాలి, నీరు కలుషితమై తాము ప్రాణాపాయ స్థితిలో బతుకుతున్నామని, తక్షణమే జోక్యం చేసుకుని రాంకీ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారం ఇక్కడకు వచ్చే చెత్తలో 25 శాతం దుండిగల్ ప్లాంట్ కి తరలిస్తామని చెప్పినప్పటికీ అక్కడకు కేవలం 800 టన్నులు మాత్రమే వెళ్తోంది. ఇప్పటికే యార్డులో 14 మిలియన్‌‌‌‌ టన్నులకుపైగా చెత్త పేరుకుపోయింది. 

ఎన్ జీటీ ఆదేశాలు ఇచ్చినా అధికారులు కాలయాపన చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఐఐటీ బాంబే రిపోర్టును తక్షణమే తెప్పించి, యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కేసును ఏప్రిల్ 15వ తేదీన విచారణ జరిగినప్పటికీ వాయిదా పడింది.  ఐఐటీ బాంబే నివేదికతో పాటు చెత్త సేకరణ, శుద్ధికి సంబంధించిన పూర్తి డేటాను సిద్ధం చేయాలని బల్దియాను ఆదేశించింది.