నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రపంచ రికార్డ్

నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రపంచ రికార్డ్

న్యూఢిల్లీ: నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా.. NHAI ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒకే వరుసలో 75 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మించింది. ఐదు రోజుల్లోనే రోడ్డు నిర్మాణం పూర్తి చేసి ఖతార్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. ఈ రికార్డుకు సంబంధించి సమాచారాన్ని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ట్విట్టర్లో ట్వీట్ చేశారు. గిన్నిస్‌ రికార్డ్‌ సర్టిఫికెట్‌తో పాటు రోడ్డు నిర్మాణ ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

మహారాష్ట్రలోని అమరావతి నుంచి అకోలా వరకు నేషనల్ హైవే 53పై రోడ్డు నిర్మాణ పనులను ఎన్‌హెచ్‌ఏఐ గత శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభించి.. మంగళవారం పూర్తి చేసింది. మొత్తం75 కిలోమీటర్ల పొడవైన రోడ్డును 105 గంటల 33 నిమిషాల్లో పూర్తి చేసింది. దీంతో అతి తక్కువ సమయంలో 75 కి.మీ. రోడ్డు పూర్తి చేసి గిన్నిస్‌ రికార్డుల్లో నిలిచింది. కాగా, ఎన్‌హెచ్‌ఏఐ తరఫున రాజ్‌పుత్‌ ఇన్‌ఫ్రాకాన్‌ అనే సంస్థ చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణంలో.. 800 మంది ఉద్యోగులు, 700 మంది కార్మికులు పాల్గొన్నారు. అయితే గతంలో కూడా ఈ సంస్థ సాంగ్లీ-సతారా మధ్య 24 గంటల్లో రోడ్డు నిర్మించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు అతి తక్కువ సమయంలో 75 కిలోమీటర్ల రోడ్డు పూర్తి చేసిన రికార్డు ఖతార్‌కు చెందిన పబ్లిక్‌ వర్క్స్‌ అథారిటీ ఏఎస్‌హెచ్‌డీహెచ్‌ఏఎల్‌ పేరిట ఉంది 2019, ఫిబ్రవరి 17న అల్‌-ఖర్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై 75 కి.మీ. రోడ్డును ఏఎస్‌హెచ్‌డీహెచ్‌ఏఎల్‌ 10 రోజుల్లో నిర్మించింది.