గల్ఫ్ కార్మికుల ఓటు హక్కు హరించడం రాజ్యాంగ విరుద్ధం : న్యాయవాది ఇమ్మినేని రామారావు

గల్ఫ్ కార్మికుల ఓటు హక్కు హరించడం రాజ్యాంగ విరుద్ధం : న్యాయవాది ఇమ్మినేని రామారావు
  •     ఎన్ హెచ్ఆర్సీని ఆశ్రయించిన ఇమ్మినేని రామారావు

న్యూఢిల్లీ, వెలుగు: దేశ ఆర్థిక వ్యవస్థకు చేయూతనందిస్తున్న గల్ఫ్ కార్మికుల ఓటు హక్కును హరించడం రాజ్యాంగ విరుద్ధమని హైదరాబాద్ కు చెందిన న్యాయవాది ఇమ్మినేని రామారావు అన్నారు. బతుకు దెరువు కోసం స్వగ్రామాలకు దూరంగా ఉంటున్న వారి ఓటును తొలగించడం సరైంది కాదన్నారు. ఈ మేరకు శుక్రవారం నేషనల్ రైట్స్ కమిషన్ (ఎన్ హెచ్ఆర్సీ)కి ఇమ్మినేని ఫిర్యాదు చేశారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన దాదాపు 15 లక్షల మంది ప్రవాస కార్మికుల ఓట్లు ఓటరు జాబితాల నుంచి గల్లంతవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 

నివాస స్థలాల్లో అందుబాటులో లేరనే నెపంతో ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే 15 లక్షల మంది గల్ఫ్ కార్మికుల ఓట్లను ఎన్నికల సంఘం జాబితా నుంచి తీసివేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు.ఇది పౌరుల ప్రజాస్వామ్య హక్కును కాలరాయడంతోపాటు మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి కేంద్ర ఎన్నికల సంఘానికి, సంబంధిత రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఎన్ హెచ్ఆర్సీకి విజ్ఞప్తి చేశారు.