- రాష్ట్రప్రభుత్వ చర్యలపై కేంద్రమంత్రి ప్రశంసలు
న్యూఢిల్లీ, వెలుగు: గ్లోబల్ ఎక్స్ పోర్ట్ హబ్ గా తెలంగాణను తీర్చి దిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి అభినందించారు. ఈ అంశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ముందంజలో ఉందని కితాబిచ్చారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో ‘బోర్డ్ ఆఫ్ ట్రేడ్’మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ ఎగుమతుల వృద్ధిని వేగవంతం చేయడానికి రాష్ట్రాలు, పరిశ్రమల కోసం రూపొందించిన ఏడు సూత్రాల కార్యాచరణ అజెండాను మంత్రి వివరించారు.
తొలి అంశంగా ఎగుమతులకు అత్యంత ప్రాధాన్యత గల అంశంగా పరిగణించాలని భాగస్వామ్య పక్షాలను కోరారు. కాగా... గ్లోబల్ ఎక్స్ పోర్ట్ లో తెలంగాణ ముందు వరుసలో ఉందని కేంద్ర మంత్రి ప్రశంసించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే ఎరాడిషన్ ఫెసిలిటీ, టెస్టింగ్ ల్యాబరేటరీ ప్రతిపాదనపై త్వరలో చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
